ఈ నిర్మాత ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:42 PM

ప్రముఖ సినీ నిర్మాత, నాట్స్ ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సామాజిక కార్యక్రమాలను ప్రారంభించారు.

NATS Event

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ - NATS) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla).. ప్రముఖ సినీ నిర్మాత, నాట్స్ ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ (Raj Allada), న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల (Sai Gangula) స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సామాజిక కార్యక్రమాలను ప్రారంభించారు. సెప్టెంబర్ 20న నిడదవోలులోని “హృదయాలయం” ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించిన నాట్స్ బృందం.. అక్కడ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యంతో ‘హోప్4స్పందన’ నిర్మించిన ఈ భవనానికి నాట్స్ సంస్థ 10,000 అమెరికన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందజేయడం విశేషం.


ఈ సందర్భంగా నిర్మాత రాజ్ అల్లాడ, చైర్మన్ కిషోర్ కంచర్ల మానసిక దివ్యాంగులైన ప్రత్యేక చిన్నారులతో సరదాగా గడిపి, వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సులు, ఫిజియోథెరపీ సేవలపై ఆరా తీశారు. పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి, కేంద్రంలోని వసతులను పరిశీలించారు. పట్టణాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం ఇలాంటి సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్ అల్లాడ పేర్కొన్నారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడంలో భాగంగా నాట్స్ మరో గొప్ప ముందడుగు వేసింది. తొర్రేడు గ్రామంలో గోపి (షాప్ నం. 162), వెంకటానగర్‌లో దేవదాసు చినబాబు (షాప్ నం. 161)లకు కేటాయించిన కిరాణా దుకాణాలకు ఒక్కొక్కదానికి రూ. 1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ దుకాణాలను రాజ్ అల్లాడ, కిషోర్ కంచర్ల, సాయి గంగుల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అలాగే వెన్నెముక గాయాలతో వీల్‌చైర్, మంచానికే పరిమితమైన నిస్సహాయ బాధితులకు ‘హోప్4స్పందన’ ద్వారా ప్రతినెలా అందిస్తున్న మెడికల్ కిట్ పంపిణీ కార్యక్రమానికి నాట్స్ చేయూతనందిస్తోంది. హైదరాబాద్‌లో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు. ఇందులో క్యాథిటర్లు, యూరినల్ బ్యాగులు, డైపర్లు సహా 13 రకాల అత్యవసర వైద్య సామగ్రి ఉన్నాయి. వీటితో పాటు అనంతపురంలోని ‘ఆశ్రయ’ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమంలో శాశ్వత ఆశ్రయాల నిర్మాణానికి కూడా నాట్స్ బాసటగా నిలుస్తోంది.


Raj-Allada.jpg

హోప్4స్పందన ఏపీ, తెలంగాణ కో-ఆర్డినేటర్ డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలాక్షి, దయ్యాల మహేష్ పాల్గొన్నారు. సమాజ సేవకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రవాస భారతీయులకు నిర్మాత రాజ్ అల్లాడ, నాట్స్ నాయకత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని వారు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘కాకా’ రాక ఫిక్స్.. మరి ‘విశ్వంభర’ ఎప్పుడు?

‘సిగ్మా’ అంటే ఏంటో గూగుల్ చేశా.. ఫస్ట్ కాపీ నాకే చూపించాలి: చిరంజీవి

ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్

Updated Date - Sep 26 , 2026 | 06:42 PM