సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. 20 ఏళ్ల నాటి ఆసక్తికర ఘటన

ABN, Publish Date - Nov 29 , 2026 | 03:52 PM

నేచురల్ స్టార్ నాని, యూత్ స్టార్ నితిన్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాని హీరోగా మారకముందు, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.

Nani and Nithiin

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), యూత్ స్టార్ నితిన్ (Nithiin) మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాని హీరోగా మారకముందు, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా ఒక వేదికపై నితిన్ గొప్పతనాన్ని, ఆయన సింప్లిసిటీని గుర్తుచేసుకుంటూ నాని పంచుకున్న పాత జ్ఞాపకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2005లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అల్లరి బుల్లోడు’ (Allari Bullodu) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆ ఆసక్తికర ఘటనను నాని వివరించారు. తాజాగా జరిగిన ‘అలియాస్ రుక్మిణీ’ (Alias Rukmini) ప్రీ రిలీజ్ వేడుకలో నాని ఆ నాటి ‘అంబ్రెల్లా స్టోరీ’ (Umbrella Story)ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నేను క్లాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అప్పటికి నాకు ఇండస్ట్రీ కొత్త. నేను, నితిన్ దాదాపు ఒకే వయసు వాళ్లం కావడంతో హీరోలను ‘బాబు.. బాబు..’ అని గౌరవంగా పిలవాలనే విషయం నాకు తెలియదు. అందుకే నేను వెళ్లి ‘నితిన్ షాట్ రెడీ’ అని పిలిచేవాడిని. అయితే ఒక కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ హీరోతో అంత ఫ్రీగా మాట్లాడటం ఆ సినిమా మేనేజర్‌కు నచ్చలేదు. ఆయన నన్ను పిలిచి ‘ఏంటి హీరోని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? బాబు అని పిలువు’ అని గట్టిగా తిట్టారని నాని చెప్పారు.


మేనేజర్ తిట్టడంతో తర్వాతి షాట్‌కు పిలవడానికి వెళ్లిన నాని.. ‘బాబు షాట్ రెడీ’ అని పిలిచారట. అప్పుడు నితిన్ ఆశ్చర్యపోయి.. ‘ఏంటి పిలుపు మారింది?’ అని అడిగారట. నాని ఏమీ లేదని చెప్పినా నితిన్ వదల్లేదు. ‘‘నువ్వు నన్ను మళ్లీ ‘నితిన్’ అని పిలిచే వరకు నేను షాట్‌కు రాను’’ అని అక్కడే కూర్చుండిపోయారట. దాంతో నాని జరిగిందంతా నితిన్‌కు చెప్పారు.

ఆ విషయం విన్న నితిన్, ఆ మేనేజర్‌కు బుద్ధి చెప్పాలని సరదాగా ప్లాన్ చేశారట. ‘‘ఇప్పుడు ఆయనకు ఇంకా ఒళ్లు మండాలంటే ఏం చేయాలి?’’ అని నితిన్ అడగగా.. ‘‘నేను మీ భుజంపై చెయ్యి వేసి సెట్‌లోకి నడిస్తే ఆయనకు మండుతుంది’’ అని నాని అన్నారట. ‘‘అంతకంటే ఇంకా ఎక్కువ మండాలంటే ఏం చేయాలి?’’ అని నితిన్ మళ్లీ అడగడంతో.. ‘మీ గొడుగు నాకు పట్టాలి’ అని నాని సరదాగా అన్నారట. అంతే.. మరుక్షణమే అప్పటి మోస్ట్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో అయిన నితిన్ స్వయంగా గొడుగు పట్టుకోగా, చేతిలో క్లాప్ బోర్డు పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న న్యాచురల్ స్టార్.. రాఘవేంద్రరావు ఉన్న సెట్‌లోకి నడుచుకుంటూ వెళ్లారట. ఆ సీన్ చూసి సెట్‌లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారని నాని గుర్తుచేసుకున్నారు.


ఇటీవల నితిన్ సినిమా గ్లింప్స్ షూటింగ్ సమయంలో తాను పలకరించడానికి వెళ్లినప్పుడు కూడా వర్షం పడుతుండటంతో నితిన్ మళ్లీ తనకు గొడుగు పట్టాడని, 20 ఏళ్ల నాటి ఆ మధుర జ్ఞాపకం మళ్లీ రిపీట్ అయిందని నాని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ తామిద్దరం సరదాగా ఒకరినొకరు ‘బాబూ.. బాబూ..’ అని పిలుచుకుంటామని నాని చెప్పడంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

ఇవి కూడా చదవండి:

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్.. ఏంటి విషయం?

‘దాదా’ వాయిదా వార్తలకు చెక్.. ఆ రోజు షెహరంతా అదిరిపోవాలి

వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణీ.. పోరులో గెలిచేదెవరు?

Updated Date - Nov 29 , 2026 | 03:52 PM