MS Biopic: ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ గ్రాండ్ లాంచ్.. ఎప్పుడంటే..
ABN, Publish Date - Sep 15 , 2026 | 11:43 AM
భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గాన సరస్వతి, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ జీవితం వెండితెరపైకి రానుంది.
భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గాన సరస్వతి, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ జీవితం వెండితెరపైకి రానుంది. ఆమె జీవిత కథ ఆధారంగా ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అమ్మ’ (MS Subbulakshmi Amma) పేరుతో ఈ బయోపిక్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్‌పై మంగళవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ఇందులో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాసు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండటం మరో ప్రత్యేకత.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ 110వ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ నెల 16న చెన్నైలోని 'ది మ్యూజిక్ అకాడమీ'లో సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి విశ్వా నాయకుడు హాజరుకానున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆలపించిన చిరస్మరణీయ గీతాలను ‘ది ఇండియన్ కోరల్ ఎన్‌సెంబుల్’ ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వినిపించనుంది. సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేక శకానికి ప్రతీకగా నిలిచిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని రష్మిక ఎలా ఆవిష్కరించనున్నారు? గౌతమ్ తిన్ననూరి ఈ కథను ఎలాంటి దృక్కోణంలో తెరకెక్కించనున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.