Rambola: ‘హనుమాన్‌ అంశ్‌’ దర్శకుడి నెక్స్ట్‌ మూవీ..

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:33 AM

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ‘హనుమాన్‌ అంశ్‌’ చిత్రం. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై  భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vishal Chaturvedi

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ‘హనుమాన్‌ అంశ్‌’ (Hanuman ansh) చిత్రం. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు లభిస్తున్న ఆదరణను చూస్తే త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విజయోత్సాహంలో ఉన్న దర్శకుడు విశాల్‌ చతుర్వేది వినాయక చవితి సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈసారి ఆయన మరో ఆసక్తికరమైన, ఆధ్యాత్మిక నేపథ్య కథను ఎంచుకున్నారు. ప్రముఖ భక్త కవి, ఆధ్యాత్మిక వేత్త గోస్వామి తులసీదాస్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ‘రామ్‌బోలా: ది ఇమ్మోర్టల్‌ ఆఫ్‌ గోస్వామి తులసీదాస్‌’ (Ram Bola) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహవీర్‌ జైన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై మహవీర్‌ జైన్‌, విశాల్‌ చతుర్వేది, అమిత్‌ ఉపాధ్యాయ్‌, రఘువేంద్ర సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తులసీదాస్‌ జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలు, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, శ్రీరాముడిపై ఆయనకున్న అపారమైన భక్తిని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.16వ శతాబ్దానికి చెందిన తులసీదాస్‌ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీరాముడి పరమ భక్తుడిగా పేరొందిన ఆయన రచించిన ‘రామచరితమానస్‌’ ఇప్పటికీ కోట్లాది మంది భక్తులకు స్ఫూర్తినిస్తోంది.

చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన తులసీదాస్‌ జీవితంలో ఎన్నో కష్టాలు, మలుపులు చోటుచేసుకున్నాయి. చిన్నప్పటి నుంచే శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉండటంతో ఆయనను ‘రామ్‌బోలా’ అని పిలిచేవారని చెబుతారు. తులసీదాస్‌ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో హనుమంతుడితో ఆయనకు ఉన్న అనుబంధం కూడా ఒకటి. తులసీదాస్‌ రామాయణాన్ని కీర్తిస్తున్న సమయంలో హనుమంతుడు ఓ వృద్ధుడి రూపంలో అక్కడికి వచ్చి కూర్చుని వినేవాడనే విశ్వాసం ఉంది. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక, ఆసక్తికరమైన ఘట్టాలతో కూడిన తులసీదాస్‌ జీవితాన్ని దర్శకుడు విశాల్‌ చతుర్వేది తెరపై ఎలా ఆవిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

ALSO READ:
Power House: చియాన్ విక్రమ్‌ మాస్ అవతారం.. పగలు క్యాటరర్.. రాత్రి అయితే..

Immortal: ‘ఇమ్మోర్టల్‌’.. మరణం లేని మనిషి కథ



Updated Date - Sep 15 , 2026 | 09:51 AM