‘కాకా’ రాక ఫిక్స్.. మరి ‘విశ్వంభర’ ఎప్పుడు?
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:00 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో ఈ ఏడాది ఇప్పటికే సాలిడ్ హిట్ కొట్టిన చిరు.. ఇప్పుడు వరుస సినిమాలతో స్పీడ్ పెంచేశారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో ఈ ఏడాది ఇప్పటికే సాలిడ్ హిట్ కొట్టిన చిరు.. ఇప్పుడు వరుస సినిమాలతో స్పీడ్ పెంచేశారు. అయితే, గత కొన్ని రోజులుగా మెగా అభిమానులను ఒకే ఒక్క ప్రశ్న తీవ్రంగా తొలుస్తోంది... అదే ‘వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చే మెగా సినిమా ఏది?’ ‘కాకా’ (Kaaka) వస్తుందా? లేక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) వస్తుందా? అని అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు. కానీ, ఈ కన్ఫ్యూజన్‌కు స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే చెక్ పెట్టేశారు.
బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘కాకా’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుండటంతో ‘కాకా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కె.వి.ఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. చిరు సరసన ఆయన భార్య పాత్రలో స్నేహ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఇస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లేలా చేయబోతోంది. ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
అయితే, మరోవైపు ‘విశ్వంభర’ ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. త్రిష, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా లాంటి భారీ తారగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కొద్దికాలం క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే ఓటీటీ డీల్ కూడా ఖరారైందని.. దీంతో సంక్రాంతికే ఈ సినిమా వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ‘కాకా’ వస్తుందా? ‘విశ్వంభర’ వస్తుందా? అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ‘సిగ్మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడిన చిరు.. ‘కాకా’ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తికావడంతో పాటు, రెండో భాగంలో కూడా 30 శాతం షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అంతేకాదు, థమన్ ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన రీ-రికార్డింగ్ పనులను ప్రారంభించారని చెప్పారు. చివరగా ‘ఈ సారి సంక్రాంతి మనదే!’ అంటూ మెగాస్టార్ మాస్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీనిని బట్టి జనవరి 13న పక్కాగా ‘కాకా’ చిత్రమే థియేటర్లలోకి వస్తోందని స్పష్టమైంది. చిరు ఇచ్చిన ఈ అఫీషియల్ క్లారిటీతో ‘విశ్వంభర’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ‘విశ్వంభర’ విడుదల ఎప్పుడు ఉంటుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘సిగ్మా’ అంటే ఏంటో గూగుల్ చేశా.. ఫస్ట్ కాపీ నాకే చూపించాలి: చిరంజీవి
ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్
సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్ బ్లోయింగ్ డీల్!