‘సిగ్మా’ అంటే ఏంటో గూగుల్ చేశా.. ఫస్ట్ కాపీ నాకే చూపించాలి: చిరంజీవి

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:33 PM

‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంతో సభను ఉర్రూతలూగించారు.

Chiranjeevi at Sigma Pre Release Event

సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా, స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతోన్న తాజా యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సిగ్మా’ (Sigma). ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, సీడెడ్‌లో ఎన్వీఆర్ సినిమా ద్వారా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ప్రసంగంతో సభను ఉర్రూతలూగించారు.

వేడుకకు రావడం శ్రమ కాదు.. నా బాధ్యత!

‘‘నేను నేరుగా ‘కాకా’ షూటింగ్ సెట్ నుంచి వస్తున్నాను. అక్కడ షూటింగ్ పూర్తి కాగానే.. ‘త్వరగా ప్యాకప్ చేయండి, ఫంక్షన్‌కి వెళ్లాలి’ అన్నాను. సెట్‌లో కొందరు మిత్రులు ‘ఎందుకు సార్ అంత శ్రమ తీసుకుంటారు? హాయిగా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు కదా’ అన్నారు. వాళ్ల కోణంలో అది కరెక్టే కావచ్చు.. కానీ యంగ్ టాలెంట్ కష్టపడి ఒక సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నప్పుడు, వాళ్లకు మన ద్వారా కొంచెమైనా ఉపయోగపడితే ఎందుకు వెళ్లకూడదు? ఉత్సాహాన్నిచ్చే నాలుగు మంచి మాటలు చెబితే తప్పేంటి? అందుకే నాకు ఇలాంటి వేడుకలకు రావడం శ్రమ అనిపించదు, అదొక బాధ్యతగా భావిస్తాను’’ అని చిరంజీవి స్పష్టం చేశారు.


నన్ను నేను చూసుకున్నట్లుంటుంది!

సందీప్ కిషన్ గురించి మాట్లాడుతూ.. ‘‘సందీప్ నన్ను ఎప్పటినుంచో ఎంతో అభిమానిస్తాడు. నాతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాడు, గ్రీటింగ్స్ పంపుతుంటాడు. మా మధ్య ఉన్న ఆ సాన్నిహిత్యం చాలా తక్కువమందికి తెలుస్తుంది. తను నా కుటుంబ సభ్యుడి లాంటివాడు. ‘ప్రస్థానం’ నుంచి మొదలైన తన కెరీర్‌లో ప్రయోగాత్మక, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు చేస్తుంటాడు. తనని చూస్తుంటే నా కెరీర్ ప్రారంభ రోజుల్లో నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఒకే మూసలో పడిపోకుండా ప్రత్యేకతను చాటుకోవాలి, సందీప్‌లో ఆ క్వాలిటీ ఉంది’’ అని అభినందించారు.

జీన్స్‌లోనే డైరెక్షన్.. విజయ్, ఎస్ఏ చంద్రశేఖర్‌ల వారసత్వం

దర్శకుడు జేసన్ సంజయ్ గురించి చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సంజయ్ వాళ్ల తాతగారు ఎస్.ఎ. చంద్రశేఖర్ నాతో ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ వంటి అద్భుతమైన హిట్లు తీశారు. ఆ సినిమాలకు కథ రాసింది సంజయ్ వాళ్ల నానమ్మ శోభా గారే. అలాగే దళపతి విజయ్ కెరీర్ ప్రారంభంలో ఆయన తండ్రి డైరెక్షన్‌లో చేసిన ఓ సినిమాకి నేను, రజనీకాంత్ గారు వెళ్లి క్లాప్ కొట్టి ముహూర్తం షాట్‌కు హాజరయ్యాం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ తన తొలి సినిమా వేడుకకు నన్ను పిలవాలని అనుకున్నప్పుడు రాకుండా ఎలా ఉండగలను? మొదటిసారి సంజయ్‌ను చూడగానే.. 90ల నాటి విజయ్‌ను చూసినట్టే అనిపించింది. ‘హీరో ఎందుకు అవ్వలేదు?’ అని అడిగితే.. తనకు డైరెక్షన్, రైటింగ్ అంటేనే ఇష్టమని చెప్పాడు. ఆ ప్రతిభ వాళ్ల తాతగారు, నానమ్మల జీన్స్ నుంచే వచ్చింది. వాళ్లలాగే, తండ్రి విజయ్‌లాగే సంజయ్ కూడా అత్యున్నత శిఖరాలకు చేరుకుంటాడు’’ అని ఆశీర్వదించారు.


‘సిగ్మా’ అంటే గూగుల్ చేశా..

సినిమా టైటిల్ గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చిన్నప్పుడు ఆల్జీబ్రా చదివినప్పుడు మ్యాథమెటికల్ టర్మ్‌గా సిగ్మా అనే పదాన్ని విన్నాను. సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అని గూగుల్ చేసి చూస్తే.. అది గ్రీక్ ఆల్ఫాబెట్స్‌లో 18వ అక్షరమని తెలిసింది. అంతేకాదు.. ఎవరి మాటా వినకుండా, తనకు నచ్చింది చేసుకుంటూ తన మార్గంలో తాను వెళ్లే వ్యక్తిని కూడా ‘సిగ్మా’ అంటారని తెలిసింది. బహుశా సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అదేనేమో! అందుకే జెన్-జీ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా వాళ్ల భాషలోనే ఈ టైటిల్ పెట్టారనిపించింది. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎంటర్‌టైనింగ్‌గా, క్రైమ్ అండ్ ఫన్‌తో హుషారుగా ఉంది. ఇంత కష్టపడి వచ్చాను కాబట్టి సినిమా ఫస్ట్ కాపీని ముందుగా నాకే చూపించాలి’’ అని సరదాగా డిమాండ్ చేశారు.

ఫరియాతో డ్యాన్స్.. స్టేజ్ పైన ఫన్నీ పంచులు!

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి మాట్లాడుతూ చిరు వేదికపై నవ్వులు పూయించారు. ‘‘గతంలో ఓ వేడుకలో ఫరియా బలవంతంగా నాతో స్టేజ్ మీద డ్యాన్స్ చేయించింది. నేను చాలా జెంటిల్‌మ్యాన్‌లా సైలెంట్‌గా కూర్చుందామనుకుంటే.. తను వచ్చి ‘ప్లీజ్ ప్లీజ్’ అంటూ టెంప్ట్ చేసి నాతో స్టెప్పులేయించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయి ఉత్సాహాన్ని నింపిందో అందరికీ తెలుసు. నా సినిమాలో తనను హీరోయిన్‌గా పెడదామనుకుంటే మిస్సయింది. హైట్ ప్రాబ్లమ్ అయితే కాదు, కావాలంటే కాస్త హీల్స్ ఉన్న బూట్లు వేసుకునేవాడిని. నన్ను ఏమైనా తొక్కేయాలని నన్ను అవాయిడ్ చేశావా అమ్మా?’’ అంటూ చిరంజీవి చమత్కరించగా.. ఫరియా వెంటనే స్పందిస్తూ ‘‘అయ్యో లేదు సార్.. మీరు మ్యూజిక్ పెడితే ఇప్పుడైనా మీతో డ్యాన్స్ చేయడానికి రెడీ’’ అంటూ నవ్వేసింది.


రాముడికి హనుమంతుడిలా నా గుండెల్లో థమన్..

సంగీత దర్శకుడు థమన్ గురించి మెగాస్టార్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘రామాయణంలో రాములవారు అందరినీ పొగిడి తనని మర్చిపోయేసరికి హనుమంతుడు అలిగాడట. అప్పుడు రాములవారు ‘హనుమా.. అందరూ నా చుట్టూ ఉంటారు, కానీ నువ్వు నా గుండెల్లో ఉంటావు’ అని చెప్పారట. అలాగే థమన్ ఎప్పుడూ నా హృదయంలో ఉంటాడు. ప్రస్తుతం ‘కాకా’ ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ వర్క్ పూర్తయింది, సెకండ్ హాఫ్ కూడా 30 శాతానికి పైగా పూర్తయింది. థమన్ మంచి జోష్‌తో ఉన్నాడు. తను ప్రామిస్ చేసినట్లే ఈ సంక్రాంతి పక్కా మనదే’’ అని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే వేదికపై ఉన్న సీనియర్ నటుడు సంపత్ రాజ్ గడ్డం లుక్ కొత్తగా ఉందని ప్రశంసిస్తూ ఆయనతో త్వరలోనే పనిచేస్తానని తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, తమిళ కుమరన్‌లకు, నైజాం డిస్ట్రిబ్యూటర్లు మైత్రీ నవీన్, శశిలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు, రీసెంట్‌గా వచ్చిన ‘ఇరుముడి’ ఘనవిజయం సాధించింది. పరిశ్రమలోకి కొత్త రక్తం రావాలి, కొత్త ఆలోచనలు రావాలి. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు. జేసన్ సంజయ్ దర్శకత్వంలో అక్టోబర్ 2న వస్తున్న ఈ ‘సిగ్మా’ చిత్రాన్ని కూడా ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేస్తారని నమ్ముతున్నాను’’ అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్

సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్‌ బ్లోయింగ్‌ డీల్‌!

గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్

Updated Date - Sep 25 , 2026 | 11:33 PM