Mohan Babu: నాని నువ్వు గొప్ప నటుడివి.. నూరేళ్లు చల్లగా ఉండాలి
ABN, Publish Date - Sep 26 , 2026 | 09:44 PM
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బాక్సాఫీస్ తాండవం ‘ద ప్యారడైజ్’. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని శనివారం మీడియా ములాఖత్ నిర్వహించారు.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) లేటెస్ట్ బాక్సాఫీస్ తాండవం ‘ద ప్యారడైజ్’ (The Paradise). కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం మేకర్స్ మీడియా ములాఖాత్ నిర్వహించారు.
ఈ వేదికపై మోహన్ బాబు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివంగత రచయిత కుమారుడు కబీర్ ఎం.ఫార్మసీ చదువుకోవాలనుకుంటున్న విషయాన్ని తెలుసుకుని.. తిరుపతిలోని తమ మోహన్ బాబు యూనివర్సిటీలో రెండేళ్ల పాటు ఉచిత విద్యతో పాటు ఉచిత హాస్టల్ వసతిని కల్పిస్తున్నట్లు స్వయంగా ప్రకటించి అక్కడికక్కడే బాధ్యతలను తన సిబ్బందికి అప్పగించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా మేకింగ్ టైమ్‌లో నిర్మాత సుధాకర్‌ను కేవలం 10 సార్లు మాత్రమే చూశాను. డబ్బు ఖర్చు పెట్టేసి, మొత్తం భారాన్ని దర్శకుడిపైనే వేసి ఎక్కడా జోక్యం చేసుకోకుండా సినిమాను నడిపించారు. మా గురువు దాసరి నారాయణరావు గారికి ఇలాంటి నిర్మాతలు ఉండేవారు, మళ్లీ ఇన్నాళ్లకు సుధాకర్‌లో ఆ లక్షణాన్ని చూశాను. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు ఎంతో అవసరం. ఎవరెవరో మాట్లాడుకునే మాటలను పట్టించుకోకుండా మన ప్రయాణం మనం సాగించాలి’’ అని హితవు పలికారు.
నాని.. నువ్వు సంపూర్ణ నటుడివి
హీరో నాని నటనను మోహన్ బాబు ఆకాశానికెత్తారు. ‘‘నాని.. నువ్వు పడ్డ కష్టం ఆ దేవుడికే తెలుసు. ప్రతి ఫ్రేమ్‌లో నీ అంకితభావం కనిపించింది. తలకు అంత పెద్ద జడలు వేసుకుని నటించడం చాలా నరకం, చాలా కష్టం. ఆ హెయిర్ స్టైల్‌తో ఫైట్స్ చేయడం, వర్షంలో డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు. ఫైట్ సీన్‌లో నీ జడలను గట్టిగా పట్టుకున్నప్పుడు నీకు ఎంత నొప్పి కలిగిందో నేను గమనించాను, కానీ నువ్వు బయటపడలేదు. నీలో మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు, గొప్ప నటుడు ఉన్నాడు. ఏడుపు, రౌద్రం, రొమాన్స్, డ్యాన్స్.. నటనకు సంబంధించిన అన్ని నవరసాలు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు గొప్ప నటుడివి, నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి’’ అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చివరగా ‘ద ప్యారడైజ్’ చిత్ర విజయంలో భాగస్వాములైన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, డిస్ట్రిబ్యూటర్లకు మోహన్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
వరుస సూపర్ హిట్స్.. అయినా ఈ భామకు తెలుగులో నో ఛాన్స్
‘ద ప్యారడైజ్’.. ఇలాంటి రెస్పాన్స్ నేనెక్కడా చూడలేదు: నాని
నా లైఫ్‌లో బేర్ బాడీతో చేసినవి మూడే సినిమాలు.. శ్రీకాంత్ చంపేశాడు: మోహన్ బాబు