‘వారణాసి’ వాయిదా.. రిలీజ్‌కు కొత్తగా మూడు డేట్స్?
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:32 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ వాయిదా పడినట్లుగా టాక్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సంచలనం తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న తదుపరి చిత్రం కావడంతో యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారబోతోందంటూ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘వారణాసి’ చిత్రానికి సంబంధించి భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ పెండింగ్‌లో ఉండటంతో ఏప్రిల్ 7 నాటికి సినిమాను సిద్ధం చేయడం కష్టమని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడని రాజమౌళి, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవుట్‌పుట్ విషయంలో మరింత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7కు బదులుగా 2027 జులై 29, ఆగస్ట్ 5 లేదా ఆగస్ట్ 12 తేదీలను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.
ఇన్సైడ్ టాక్ ప్రకారం.. 2027లో ఆగస్ట్ 5 లేదా ఆగస్ట్ 12 తేదీల్లోనే ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఒక స్పెషల్ కారణం ఉంది. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు. రాజమౌళి - మహేశ్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో, ఆయన బర్త్‌డేకి వచ్చే ముందు వీకెండ్ లేదంటే తర్వాత వీకెండ్ సినిమాను విడుదల చేస్తే అభిమానులకు అది మర్చిపోలేని కానుక అవుతుందని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు మహేశ్ పుట్టినరోజున పాత బ్లాక్‌బస్టర్ సినిమాల రీ-రిలీజ్‌లతోనే సరిపెట్టుకున్న ఘట్టమనేని అభిమానులకు, ఈసారి ఏకంగా ‘వారణాసి’ వంటి గ్లోబల్ మూవీ థియేటర్లలోకి వస్తే అంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు.
మరోవైపు, రిలీజ్ డేట్ మార్పు వెనుక పక్కా బిజినెస్ వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి మార్కును అందుకోవడంలో తడబడిన నేపథ్యంలో.. రాజమౌళి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏప్రిల్‌లో విద్యార్థులకు పరీక్షలు, ఐపీఎల్ (IPL) సీజన్ కావడంతో, వాటికి దూరంగా ఆగస్ట్‌లో విడుదల చేస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రతో పాటు శ్రీరాముడిగానూ కనిపించనున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ (ప్రతినాయకుడు) పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ జీరో చేసి.. మేమే కొత్త ఇండస్ట్రీని ఫామ్ చేశాం: విశ్వక్
మహేశ్ బాబుకు డై-హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే..
‘భోగి’ ప్రమోషన్స్.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?