జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ జీరో చేసి.. మేమే కొత్త ఇండస్ట్రీని ఫామ్ చేశాం: విశ్వక్

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:56 PM

దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్’ గ్రాండ్‌గా నిర్వహించింది.

Vishwak Sen

దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దాస్యం తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి క్రేజీ గ్యాంగ్ మరోసారి తమ కామెడీ, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 19న గ్రాండ్‌గా విడుదలై హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన ‘బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్’ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేసిన ఎమోషనల్ అండ్ ఓపెన్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ.. ‘ఈఎన్‌ఈ రిపీట్’ విజయం నాకు చాలా రిలీఫ్‌ను ఇచ్చింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రసాద్ ల్యాబ్స్‌లో మేమంతా సినిమా చూసుకున్నాం. ఒకే సినిమాలో ఇన్ని అద్భుతమైన డైనమిక్స్ చూసి, మన జీవితాన్నే తరుణ్ తెరపై ఆవిష్కరించాడని షాకయ్యాను. థియేటర్ రన్ అద్భుతంగా ఉంది. యూఎస్‌లో నిన్ననే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, రేపు వరల్డ్‌వైడ్‌గా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా రూ. 50 కోట్ల మార్కును టచ్ చేయబోతున్నాం. నా కెరీర్‌లో ఫస్ట్ 1 మిలియన్, ఫస్ట్ 2 మిలియన్, ఫస్ట్ రూ. 50 కోట్ల సినిమాను సృజన్, సందీప్, తరుణ్, మా టీమ్ అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.


తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను విశ్వక్ సేన్ ఈ వేదికపై ఓపెన్‌గా బయటపెట్టారు. ‘‘ముంబైలో ఫిల్మ్ కోర్స్ చేసిన తర్వాత 17 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం తిరిగాను. 21 ఏళ్లు వచ్చేసరికి నా దగ్గర డబ్బులు లేవని, అప్పులు ఎక్కువ ఉన్నాయని నన్ను నమ్ముకున్న గర్ల్‌ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్లిపోయింది. ఒక సినిమాలో నన్ను ఫస్ట్ హీరోగా తీసుకుని, నాలుగో నెలలో నాలుగో హీరోగా మార్చారు. ఆఖరికి నాకు చెప్పకుండానే నన్ను సినిమాలోంచి తీసేశారు. ఆ విషయం తెలియక నేను 20 రోజుల పాటు నా పాకెట్ మనీతో అప్పు చేసి మరీ ఆఫీసుకు వెళ్లి వాళ్లకు మర్యాదలు చేశాను. నన్ను తీసేశారని తెలిశాక ఇంటికెళ్లి మూడు రాత్రులు ఎక్కిఎక్కి ఏడ్చాను. మనల్ని పెట్టి ఎవరూ సినిమా తీయరని కోపంతోనే 21 ఏళ్ల వయసులో ‘ఫలక్‌నుమా దాస్’ డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాను’’ అని విశ్వక్ భావోద్వేగానికి గురయ్యారు.

‘ఈ నగరానికి ఏమైంది’ ఆడిషన్స్ సమయంలో తనపై జరిగిన ఒక పెద్ద కుట్రను కూడా విశ్వక్ బయటపెట్టారు. ‘‘ ‘ఫలక్‌నుమా దాస్’ షూటింగ్ మరో 25 రోజుల్లో మొదలవుతుందనగా తరుణ్ ఆఫీసుకు ఆడిషన్ కోసం వెళ్లాను. ఆ కథ నా నిజ జీవితమే అనిపించి ఆడిషన్ ఇచ్చాను, వెంటనే సెలెక్ట్ అయ్యాను. కానీ రెండు వారాల తర్వాత.. గతంలో నాతో పనిచేసిన ఒక అమ్మాయిలాగా ఎవరో ఫేక్ జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసి, ‘విశ్వక్‌ను సినిమాలో పెట్టుకుంటే మీడియాకు వెళ్లి సినిమాను డిఫేమ్ చేస్తా’ అని తరుణ్‌కు అత్యంత ఘోరమైన ఈమెయిల్ పంపారు. ఆ మెయిల్ చూసి తరుణ్ నన్ను సినిమాలోంచి తీసేయాల్సి వచ్చింది. కానీ నేను బతిమలాడటంతో నాపై నమ్మకంతో తరుణ్ ఆ ఈమెయిల్ నాకు పంపాడు. ఆరా తీస్తే.. కాలేజీ రోజుల్లో నేను కొట్టిన ఒక వ్యక్తి ఆడిషన్‌లో సెలెక్ట్ కాకపోవడంతో నాపై కక్షతో ఆ ఫేక్ మెయిల్ పంపాడని 24 గంటల్లోనే నిజం బయటపడింది. ఆ రోజు తరుణ్ నన్ను నమ్మకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో తెలియదు. పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను షర్ట్ పట్టుకుని పైకి లాగాడు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.


ఇండస్ట్రీలో ఉండే వివక్ష, సోషల్ మీడియా ట్రోల్స్‌పై విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘సినిమా వాళ్లు తప్పు చేస్తే ఊరంతా తిడుతుంది. భుజాన ఎక్కించుకునేది మీరే, పాతాళంలోకి తొక్కేసేది మీరే, ఆ హక్కు మీకుంది. కానీ ట్రోల్స్ చూసినప్పుడు మా కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. ఇండస్ట్రీలో కూడా ఒక రెండు ఫ్లాపులు రాగానే మొన్నటి వరకు నవ్వుతూ పలకరించిన వాళ్ల మర్యాదలు మారిపోతాయి . మేము ఎవ్వరం జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ నుంచి రాలేదు. నేను దిల్‌సుఖ్‌నగర్, తరుణ్ మారేడ్‌పల్లి, వివేక్ సాగర్ చిక్కడపల్లి నుంచి వచ్చాం. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్‌ను మైనస్ చేసి హైదరాబాద్ 50 కిలోమీటర్ల రేడియస్‌లో మేమే ఒక కొత్త ఇండస్ట్రీని ఫామ్ చేసుకున్నాం’’ అంటూ విశ్వక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో 50 శాతం సంస్కారం మా అమ్మానాన్న, అక్క నేర్పిస్తే.. మిగిలిన 50 శాతం తరుణ్ దగ్గరే నేర్చుకున్నాను. నా విజయంలో సగభాగం తరుణ్‌దే. ఈ సినిమాకు హీరో తరుణ్, నా లైఫ్‌కు కూడా హీరో తరుణ్. విమర్శల పరీక్షను శ్రీనాథ్ దాటేశాడు, కౌశిక్ అన్న ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ పీస్, వివేక్ సాగర్ రాక్ బ్యాండ్‌లాంటి మ్యూజిక్ ఇచ్చారు, శివాత్మిక అద్భుతంగా నటించింది, ప్రియదర్శి, తరుణ్ కుమార్, కరుణ కుమార్ గారు అందరూ ప్రాణం పెట్టారు. సృజన్, సందీప్ లాంటి నిర్మాతలు గెలిస్తే మరెంతోమంది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ వస్తారు’’ అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

వి కూడా చదవండి:

మహేశ్ బాబుకు డై-హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే..

‘భోగి’ ప్రమోషన్స్‌.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?

ధర్మేంద్ర మొదటి వర్ధంతి.. హేమమాలిని ఎమోషనల్ పోస్ట్

Updated Date - Nov 25 , 2026 | 01:56 PM

Vishwak Sen : ఆవేశంతోనో.. అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదు!

Vishwak Sen: రెట్టింపు వెనక్కి ఇచ్చేశా.. ఆయన వల్ల నష్టపోయింది నేనే!

Vishwak Sen: భగవద్గీత తాత్పర్యం  శాశ్వతంగా నిలిచిపోతుంది

Vishwak Sen: అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌.. ఈ టీమ్‌ను చూస్తే ముచ్చ‌టేసింది

ENE Repeat: బతుకమ్మ.. ఈ కన్నె ముచ్చట వినమ్మా