SS Rajamoul: రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ.. సింధూ రిప్లై
ABN , Publish Date - Jul 20 , 2026 | 02:40 PM
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ప్రస్తుతం ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu). ప్రస్తుతం ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ మహిళా షట్లర్‌గా నిలిచిన సింధుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) కూడా సింధుని అభినందిస్తూ ఎక్స్ (X) వేదికగా పోస్ట్ [పెట్టారు."జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చావు. హృదయపూర్వక అభినందనలు సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోంది" అంటూ జక్కన్న ప్రశంసించారు.
ఆ పోస్ట్‌కు పీవీ సింధు కూడా స్పందించారు. "ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ 'వారణాసి' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలోనైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ సినిమాలో కొత్త నటిగా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను" అంటూ స్మైలీఎమోజీలను పోస్ట్ చేశారు. పీవీ సింధు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నిజంగానే వెండితెరపై అడుగుపెట్టనున్నారా? రాజమౌళి సినిమాలో అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందా? అంటూ అభిమానులు చర్చలు మొదలెట్టారు.
క్రీడాకారుల నుంచి రాజమౌళికి ఇలాంటి సరదా రిక్వెస్ట్‌లు రావడం కొత్తేమి కాదు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాజమౌళితో పలుమార్లు సోషల్ మీడియాలో సరదాగా సంభాషించారు. తెలుగు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అభిమానులను అలరించిన వార్నర్‌కు రాజమౌళి ‘బాహుబలి’ కిరీటాన్ని బహుమతిగా పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తిచేసి, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.