వరుణ్ తేజ్‌కు హిట్.. కనకరాజు 10 డేస్ కలెక్షన్స్ ఎంతంటే
ABN, Publish Date - Aug 17 , 2026 | 04:49 PM
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పుడాయన నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ లవ్‌స్టోరీలు, యాక్షన్ థ్రిల్లర్‌లు, స్పేస్ అడ్వెంచర్, బాక్సింగ్ డ్రామా, పేట్రియాటిక్ సినిమాలు ఇలా జోనర్ ఏదైనా సరే తనదైన నటనతో వైవిధ్యం చాటుకుంటూ వస్తున్నారు. అయితే, వరుణ్ గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో వరుణ్‌కి ఎప్పుడెప్పుడు హిట్ వస్తుందా? అని అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా ఆయన నటించిన సరికొత్త ఇండో-కొరియన్ హారర్-కామెడీ డ్రామా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సంచలన విజయాన్ని నమోదు చేసి, థియేటర్ల వద్ద కలెకన్ల సునామీ సృష్టిస్తోంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఆగస్ట్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్‌డేస్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తూ.. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిలా నిలిచిందీ చిత్రం.
ఇక ‘కొరియన్ కనకరాజు’ కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ గ్రామానికి చెందిన కనకరాజు అనే పల్లెటూరి కుర్రాడి శరీరంలోకి ఊహించని విధంగా ఒక కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పటివరకు మామూలుగా ఉన్న కనకరాజు.. కొరియన్ ఆత్మ ఎంటర్ అయ్యాక ఎలాంటి చిత్ర విచిత్రమైన పనులు చేశాడు? ఆ తర్వాత తన లైఫ్‌లో ఎలాంటి సరదా, హంగామా పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఆకట్టుకునే మేకోవర్‌తో జీవించేశారనే చెప్పాలి. ముఖ్యంగా కమెడియన్ సత్యతో కలిసి వరుణ్ తేజ్ పండించిన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కి ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత కొన్ని చిత్రాల తర్వాత వరుణ్ తేజ్‌కి ఇది పక్కా సాలిడ్ బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌గా నిలిచింది. మరి ఫుల్ రన్‌లో ‘కొరియన్ కనకరాజు’ ఇంకా ఎన్ని కోట్ల రికార్డులను తిరగరాస్తాడో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
దొంగ జూబ్లీస్... బాబోయ్ దొంగ జూబ్లీస్...
సంక్రాంతి రేసులో ఇగో వార్.. తగ్గేదేలేదంటూ
Sobhita Akkineni: అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా