దొంగ జూబ్లీస్... బాబోయ్ దొంగ జూబ్లీస్...

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:34 PM

పాతికవారాలు ఆడితే ‘సిల్వర్ జూబ్లీ’ అంటాం. యాభై వారాలు సాగితే ‘గోల్డెన్ జూబ్లీ’, అరవై వారాలు చూస్తే ‘డైమండ్ జూబ్లీ’, డెబ్బైఐదు వారాలు పోతే ‘ప్లాటినమ్ జూబ్లీ’ అంటూ పిలుస్తారు. కానీ ‘ఫేక్ జూబ్లీస్’ కూడా ఉన్నాయని తెలుసా!

Fake Jubilee Telugu Cinema

జెన్ జీ కదం తొక్కుతూ జంతర్ మంతర్‌లో జాలం చేస్తే ప్రభుత్వమే దిగివచ్చింది. నీట్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక్క సల్మాన్ ఖాన్ మినహాయిస్తే మన దేశంలోని ఏ టాప్ స్టార్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు మద్దతు పలకలేదు. దాంతో నవరాగాల, నవభావాల సాగుతున్న నవతరం తమ అభిమాన సినీస్టార్స్‌ను సైతం చిల్లపెంకులా తీసి పారేస్తున్నారు. యూత్ అలా సాగుతోంటే జెన్ ఎక్స్, జెన్ వై మాత్రం ఇంకా తమ అభిమాన హీరోల సినిమాలను ఆడకుండానే ఆడినట్లు చూపించి ఆనందించే ప్రయత్నంలో ఉన్నారు. మిల్లెనియల్స్‌గా పేరొందిన ఈ ఎక్స్, వై జనరేషన్స్ ఇప్పటికీ కులపిచ్చితో తమ అభిమానతారలకు జేజేలు పలుకుతున్నారు. వారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసినా ‘సూపర్ హిట్’ అంటూ కేకలు వేస్తుంటారు. కాసింత బాగున్న సినిమాను పగ్గాలు వేసి లాగించే ప్రయత్నాల్లో ఉంటారు. అలా సినిమాలను ఆడించాలంటే ఫ్యాన్స్ థియేటర్స్‌కు ఎదురిచ్చి మరీ ఆడించాల్సిందే. అయితే ఈ మధ్య ఈ ‘మిల్లేనియల్స్’ సరికొత్త జూబ్లీని కనుగొన్నారు. దానినే సినీజనం ‘ఫేక్ జూబ్లీ’ లేదా ‘దొంగ జూబ్లీ’ అంటున్నారు.


పాతికవారాలు ఆడితే ‘సిల్వర్ జూబ్లీ’ అంటాం. యాభై వారాలు సాగితే ‘గోల్డెన్ జూబ్లీ’, అరవై వారాలు చూస్తే ‘డైమండ్ జూబ్లీ’, డెబ్బైఐదు వారాలు పోతే ‘ప్లాటినమ్ జూబ్లీ’ అంటూ పిలుస్తారు. అయితే ఈ ‘ఫేక్ జూబ్లీస్’ (Fake Jubilees)కు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ జూబ్లీస్ ఎలా ఉంటాయంటే, అంతకు ముందు తమ స్టార్ హీరో నటించిన సినిమా ఆడిన థియేటర్ ముందు పోస్టర్ వేస్తారు. థియేటర్‌లో ఏ సినిమా ఆడుతున్నా, ఆడకపోయినా వారికి సంబంధం లేదు. ఆ సినిమా హాల్ ముందు అన్ని రోజులు, ఇన్ని రోజులు అంటూ రాసుకుంటూ పోతారు.. ఫోటోలు తీయించుకుంటారు. వాటిని వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని మురిసిపోతుంటారు. అలా సినిమా థియేటర్‌లో ఆడినన్ని రోజులు ఆడాక, తరువాత బొమ్మ ఎత్తేసినా ఈ తంతు సాగుతూ ఉంటుంది. అప్పుడు వారికి కావలసినన్ని రోజులు రాసుకుంటూ పోతారు. మరి థియేటర్ వారు ఏమి అనరా అంటే వారికి అంతో ఇంతో ముట్టచెప్పి వెర్రితలలు వేసిన తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. అలా సాగుతున్న ఫ్యాన్స్ ఎవరయ్యా అంటే తెలుగునేలపై చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు (వాళ్ళలో కృష్ణగారి పాత అభిమానులు) ఫ్యాన్స్ ఈ ‘ఫేక్ జూబ్లీస్’తో ఆనందిస్తున్నారని సమాచారం. ఆ తీరున ఈ ముగ్గురు హీరోల ఫ్యాన్స్‌లో ముదురు వయసు మాత్రమే అంటే ‘మిల్లేనియల్స్’ మాత్రమే ఇలాంటి వెర్రిపనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. నవతరం మాత్రం తమకు నచ్చితే సినిమాను చూస్తున్నారు. లేదంటే నిజాయితీగా వారే బాగోలేదని చెబుతున్నారు. కానీ, ఈ వయసు మళ్ళిన అభిమానులు మాత్రం ‘ఫేక్ జూబ్లీస్’తోనే మురిసిపోతున్నారు.


తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనూ, నటరత్న యన్టీఆర్ చిత్రసీమలో సాగినంత కాలం సినిమాల వసూళ్ళ విషయంలోనూ, ఆడిన సెంటర్స్‌లోనూ నిజాయితీ కనిపించేది. ఆ రోజుల్లోనూ కొందరు ప్రబుద్ధులు సినిమాలను పగ్గాలు వేసి లాగించడం ఎలాగో కనుగొన్నారు. రాని కలెక్షన్స్ వచ్చినట్టూ ప్రకటించుకున్న సందర్భాలున్నాయి. మరి యన్టీఆర్ (NT Ramarao) సినిమాలకు ఆ పరిస్థితి లేదా అంటే ఆయన చిత్రాల రన్నింగ్, కలెక్షన్స్‌కు ‘డీసీఆర్’ను అనుసరించే లెక్కలు ఉండేవి. సినిమా మంచి వసూళ్ళు చూస్తూండగానే యన్టీఆర్ చిత్రాలను టెర్మినేట్ చేసిన సందర్భాలు బోలెడున్నాయి. ఆ తరువాతి రోజుల్లో ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి కాలం వచ్చాక అభిమానులు డబ్బులు చెల్లించి మరీ థియేటర్స్‌లో తమ అభిమాన హీరోల సూపర్ హిట్స్‌ను రికార్డ్స్ కోసం ఆడించేవారు. అందుకు తగ్గ డీసీఆర్, ఆ సినిమా ప్రదర్శనకు రైట్స్ ఉన్న శాటిలైట్ పర్మిషన్స్ అన్నీ పక్కాగా చూపించేవారు.


కానీ, ఇప్పుడు అంత నిజాయితీ కోసం ముదురు ఫ్యాన్స్ ఆలోచించడం లేదు. తమ హీరో సినిమా ఆడిన థియేటర్ ముందు రోజులు మారుస్తూ మైమరచిపోతున్నారు. అసలు ఈ పంథాకు నాంది పలికింది ఎవరయ్యా అంటే అక్కినేని ముసలి అభిమానులు అనే చెప్పాలి. ఏయన్నార్ నటించిన ‘ప్రతిబింబాలు’ (Pratibimbalu) చిత్రం పూర్తై, ఎన్నో ఏళ్ళు విడుదలకు నోచుకోలేదు. దాదాపు నలభై ఏళ్ళ తరువాత ఎలాగోలా రిలీజైంది. కొన్ని థియేటర్స్‌లో ఒకటి, రెండు ఆటలతో ఆ సినిమా కథ ముగిసింది. అయితే చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెలోని థియేటర్ ముందు ‘ప్రతిబింబాలు’ పోస్టర్ వేసి వందరోజులు ఆడినట్టు రాసుకొని ఫొటోలు తీసుకుని మరీ నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. అంత పెద్ద నటుని అభిమానులే అలా సాగితే మనమూ అదే దారిలో పోదామంటూ చిరు, బాలయ్య, మహేశ్ (కృష్ణ అభిమానులు) ఫ్యాన్స్‌లో ముదురు వయసు ఫ్యాన్స్ ఈ ‘ఫేక్ జూబ్లీస్’కు నాంది పలికారు. అసలు ఇలా ప్రదర్శించుకొనే థియేటర్లు రెగ్యులర్‌గా ‘డీసీఆర్’ మెయింటైన్ చేయడం లేదు. అటువంటి సినిమా హాళ్లన్నీ మునిసిపాలిటీకి తక్కువ, పంచాయితీకి ఎక్కువ తరహా మారుమూల చిన్న కేంద్రాలలోనే ఉంటాయి. అలాంటి సినిమా హాళ్ళను ఎన్నుకొనే ‘దొంగ జూబ్లీస్’ ఆడించేస్తున్నారు అభిమానులు.


ఇరవై లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు జీయస్టీ మినహాయింపు అనే నిబంధన చిన్న చిన్న బడ్డీ వ్యాపారుల కోసం ఉంది. ఈ సినిమా హాళ్ళవారు తమ థియేటర్లకు ఇరవై లక్షల లోపు టర్నోవర్ అని చెప్పి, జీఎస్టీలేని థియేటర్లుగా చూపిస్తున్నారు. కనుక అవి టాక్స్ కట్టని, డీసీఆర్ లేని థియేటర్లుగా చలామణి అవుతున్నాయి. అందువల్ల ఆ టాక్స్ కట్టని థియేటర్లు సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రెగ్యులర్ థియేటర్ల జాబితాలో పరిగణించరు. ఈ కారణం చేత సదరు థియేటర్స్ వారికి అంతో ఇంతో ముట్టచెప్పి సినిమా ఆడినా, ఆడకపోయినా హాళ్ళ ముందు పోస్టర్స్‌పై రోజులు మార్చుకుంటూ ఆనందిస్తున్నారు వెర్రి అభిమానులు. ఇటువంటి టాక్స్ లేని థియేటర్లలో ఆడిన రన్‌ను ఎవరూ అధికారికంగా పరిగణించరు. ఓటీటీ ద్వారా ఇంట్లో ఆడించుకున్న సినిమాకి దీనికి తేడా ఏమీ ఉండదు. అయినా కొందరు పిచ్చ ఫ్యాన్స్ ఈ ఫేక్ జూబ్లీస్‌ తోనే ఆనందిస్తూ ఉండడం విచారకరం. ప్రపంచమంతా నవోదయం చూడాలని పయనిస్తోంటే, ఈ వెర్రి అభిమానులు ఈ ‘దొంగ జూబ్లీస్’తోనే ఆనందిస్తూ సాగడాన్ని ఏమనాలి? మీరే ఆలోచించండి!

ఇవి కూడా చదవండి:

సంక్రాంతి రేసులో ఇగో వార్.. తగ్గేదేలేదంటూ

Sobhita Akkineni: అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా

మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి.. ఉత్త‌ర్వులు జారీ

Updated Date - Aug 17 , 2026 | 04:57 PM