Kiran Abbavaram: 'సంబరాల యేటి గట్టు' తెర వెనుక కథ!

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:47 AM

సాయిధరమ్ తేజ్ చేస్తున్న 'సంబరాల యేటి గట్టు' ప్రాజెక్ట్ మొదట కిరణ్‌ అబ్బవరంకే దర్శకుడు రోహిత్‌ చెప్పాడట. తన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈ భారీ బడ్జెట్ మూవీకి 'నో' చెప్పానని కిరణ్ అబ్బవరం చెబుతున్నాడు.

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం 'సంబరాల యేటి గట్టు'. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో 'హనుమాన్' ఫేమ్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు రోహిత్‌. అయితే ఈ సినిమా నిజానికి కిరణ్‌ అబ్బవరం చేయాల్సింది. కానీ అది సాయి ధరమ్ తేజ్‌ చెంతకు చేరింది. కిరణ్‌ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'సంబరాల యేటి గట్టు' సినిమాను తాను చేయక పోవడానికి కారణమేమిటో కిరణ్ అబ్బవరం వివరించారు.


కిరణ్ అబ్బవరం ఆ సినిమా గురించి చెబుతూ, 'దర్శకుడు రోహిత్‌ నాకు 'ఎస్. ఆర్. కళ్యాణ మండపం' మూవీ చేస్తున్న టైమ్ లో పరిచయం. అప్పట్లో అతను రెండు కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేలా ఓ కథను చెప్పాడు. అయితే ఓ భారీ బడ్జెట్ మూవీ కథతో రమ్మని అతనికి చెప్పాను. అలాంటి కథ తయారు చేయగలడనే నమ్మకం నాకు అప్పుడే కలిగింది. నిర్మాత నిరంజన్ రెడ్డి అన్న కూడా నాకు బాగానే పరిచయం. దాంతో రోహిత్‌ పేరు నేను అతనికి సజెస్ట్ చేశాను. దాంతో రోహిత్‌ స్క్రిప్ట్ ను సిద్థం చేస్తూ వచ్చాడు. అప్పటికి దాని బడ్జెట్ దాదాపు 70 - 80 కోట్లు అంచనా అయ్యింది. అదే సమయంలో నా సినిమాలన్నీ వరుసగా ఫెయిల్‌ అవ్వడం మొదలయ్యాయి. కథ నాకు బాగా నచ్చిన ఆ సమయంలో నా మీద 70, 80 కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీయమని నిర్మాతను అడగాలనిపించలేదు. పైగా నా సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో! స్టోరీ బాగా నచ్చినప్పటికీ, నిర్మాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చినా... నేను చొరవ చూపించలేక పోయాను. ఇప్పుడా సినిమాను సాయిధరమ్ తేజ్ చేస్తున్నారు. అందుకు ఎంతో ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

ఏ సినిమా ఎవరు చేయాల్సి ఉంటుందో ముందే రాసి పెట్టి ఉంటుందని సినిమా పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలకు అర్థం ఇదేనేమో!

ఇవి కూడా చదవండి:

పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్

బాలయ్యకు గాయం... సెంటిమెంట్‌ బ్రేక్‌ అవుతుందా!?


రీతూ వర్మ - వైష్ణవ్ తేజ్ బ్రేకప్.. నిజమేనా

Updated Date - Jul 22 , 2026 | 11:48 AM