బాలయ్యకు గాయం... సెంటిమెంట్‌ బ్రేక్‌ అవుతుందా!?

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:52 PM

మహానటుడు ఎన్టీఆర్ కు షూటింగ్‌ లో యాక్సిడెంట్ జరిగిన సినిమాలు సూపర్ హిట్‌ కాగా, బాలకృష్ణ షూటింగ్‌లో గాయపడిన సినిమాలేవీ హిట్‌ కాలేదు. ఆ సెంటిమెంట్‌ తాజా చిత్రంతో మారుతుందేమో చూడాలి.

NTR - Balakrishna

చిత్రసీమలో ఏ చిన్న సంఘటన జరిగినా... దాన్ని సెంటిమెంట్స్ కు ముడిపెట్టడమనేది సర్వసాధారణం. తాజాగా నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్‌లో యాక్సిడెంట్‌ జరిగిన నేపథ్యంలో గతంలో బాలకృష్ణ ఏ చిత్రంలో నటిస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది? ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయనే చర్చ మొదలైంది.

బాలకృష్ణకు తొలిసారి షూటింగ్‌లో యాక్సిడెంట్ కు గురైంది 1985లో. జంద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో సుత్తి వీరభద్రరావు, బాలకృష్ణ 'బాబాయ్ - అబ్బాయ్'గా నటించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన అనితా రెడ్డి కారును డ్రైవ్ చేస్తూ హీరోకు డ్యాష్‌ ఇచ్చే సీన్ లో నిజంగానే బాలకృష్ణు గుద్దేసింది. ఆ సమయంలో ఆయన నడుముకు గాయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా ఆడలేదు. అదే సంవత్సరం వచ్చిన 'భార్యాభర్తల బంధం' సినిమా షూటింగ్‌లోనూ బాలకృష్ణకు దెబ్బ తగిలింది. ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బాలకృష్ణ సరసన రజని హీరోయిన్ గా నటించింది. ఇందులోని ఓ పోరాట సన్నివేశంలో నటిస్తుండగా మోకాలుకు బలమైన గాయమైంది. అప్పుడు దానిని పట్టించుకోకపోవడంతో ఆ తర్వాత రోజుల్లో బాలకృష్ణ బాగా ఇబ్బంది పడ్డారు. 'భార్యాభర్తల బంధం' సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇక మూడోసారి 2004లో 'విజయేంద్ర వర్మ' సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ కాలుకు పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన ఈ సినిమా పరాజయం పాలైంది. అలానే బాలకృష్ణ 'లయన్' సినిమా షూటింగ్‌లోనూ ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు కూడా కాలుకే గాయమైంది. 2015లో వచ్చిన ఈ సినిమాకు సత్యదేవ్ దర్శకుడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా బాలకృష్ణ ప్రమాదానికి గురైన ఈ సినిమా కూడా ఇంతవరకూ హిట్‌ అయిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఆ సెంటిమెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి హిట్ అవుతుందేమో చూడాలి.


బాలకృష్ణ యాక్సిడెంట్స్ కథ ఇలా ఉంటే... ఆయన తండ్రి, మహా నటుడు ఎన్టీఆర్ కు యాక్సిడెంట్స్ అయిన సినిమాలన్నీ ఘన విజయాన్ని సాధించడం విశేషం. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్‌ 'పల్లెటూరి పిల్ల' సినిమా షూటింగ్‌ ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయం ఆయన ముఖంపై మాయనిమచ్చగా మిగిలిపోయింది. అలానే ఆ తర్వాత 'లక్ష్మీ కటాక్షం' సినిమా సమయంలోనూ ఎన్టీఆర్ కు గాయం అయ్యింది. ఇక 'దీక్ష' సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఆయన్ని పాము కరిచింది. దాసరి దర్శకత్వం వహించిన 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్‌ సమయంలోనూ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. చిత్రం ఏమంటే... 'దీక్ష' ఓ మాదిరిగా ఆడగా, మిగిలిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్‌ అయ్యాయి. ఆ రకంగా షూటింగ్‌లో యాక్సిడెంట్ అనేది ఎన్టీఆర్ కు కలిసివస్తే, బాలకృష్ణకు మాత్రం కలిసి రాలేదు.

ఇవి కూడా చదవండి:

'ఖలీఫా'ను ఢీ కొట్టబోతున్న దుల్కర్ సల్మాన్!


Amitabh Bachchan: అమితాబ్‌కు శస్త్రచికిత్స.. ఆందోళనలో అభిమానులు

Updated Date - Jul 21 , 2026 | 06:56 PM