‘కింగ్100’ సినిమాపై ఇంత సైలెన్స్ ఎందుకు?

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:47 PM

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన మైల్‌స్టోన్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కింగ్ 100’. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు.

King100 Update

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున (King Nagarjuna) కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన మైల్‌స్టోన్ మూవీగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కింగ్ 100’ (King100). తమిళ దర్శకుడు రా. కార్తీక్ (Ra Karthik) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పై.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అటు అక్కినేని అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఒక రకమైన టెన్షన్ మొదలైంది. దానికి కారణం సినిమా కంటెంట్ కాదు.. ప్రమోషన్స్.


నాగార్జున కెరీర్‌లో వందో సినిమాగా వస్తున్న ‘కింగ్ 100’, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు నందమూరి బాలకృష్ణ ‘దాదా’ (Dada), బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ‘కింగ్’ (King) సినిమాలు పోటీలో ఉన్నాయి. అయినప్పటికీ, రిలీజ్ డేట్ విషయంలో నాగార్జున చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత ట్రెండ్‌లో సినిమాను ఎంత బాగా తీశామనే దానికంటే, దాన్ని జనాల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామనేదే అత్యంత కీలకం. కొన్ని సినిమాలు అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీగా పబ్లిసిటీని దక్కించుకుంటాయి. కానీ కొన్ని సినిమాలకు మాత్రం కచ్చితంగా గట్టి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘కింగ్ 100’ అనేది నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా అనే ఒక్క కారణంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ ఆ చర్చ మాత్రమే సరిపోదు. సినిమా రిలీజ్‌కు కనీసం నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్ల హడావుడి మొదలుపెట్టాలి. కానీ ఇప్పటివరకు ‘కింగ్ 100’ నుంచి అలాంటి సందడి కనిపించడం లేదు. ఒక్క వీడియో తప్ప కొత్తగా ఎలాంటి పబ్లిసిటీ స్టఫ్ బయటకు రాలేదు. దీనివల్ల రెగ్యులర్ ఆడియన్స్‌లో ఈ సినిమా గురించి ఇంకా పూర్తిస్థాయిలో చర్చ మొదలుకాలేదని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం ఒక పెద్ద అసెట్. గతంలో నాగార్జున, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అందుకే ‘కింగ్ 100’ పాటల కోసం అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, సినిమా విడుదలకు ఇంకా కేవలం ఐదు వారాల సమయం మాత్రమే ఉన్నా, ఇప్పటివరకు ఒక్క పాట కూడా విడుదల కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు, ఇదే క్రిస్మస్ బరిలో ‘కింగ్ 100’కు గట్టి పోటీ ఇవ్వడానికి వస్తున్న ‘దాదా’ నుంచి ఇప్పటికే ఒక పాట విడుదలై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పోటీ సినిమాలు ప్రమోషన్స్ మొదలుపెడితే.. ‘కింగ్ 100’ మాత్రం సైలెంట్‌గా ఉండటం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మేకర్స్ వెంటనే ప్రమోషన్లపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి దర్శకుడు, మేకర్స్ ప్రమోషన్ల సందడిని ఎప్పటి నుంచి మొదలుపెడతారో, ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్

సోల్‌‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?

యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ రివ్యూ

Updated Date - Nov 18 , 2026 | 01:47 PM

King100: నాగ్ వందో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను

King Nagarjuna: నాగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4కె‌లో ఆ సినిమా రీ రిలీజ్!

King Nagarjuna: కడుపులో ఉండగానే.. అయ్యగారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!

Nagarjuna - DSP: హ్యాట్రిక్‌ ఇచ్చిన డిసెంబర్ మాసం...