చేతి కట్టు తీసి మరీ అభిమానిని హత్తుకున్న తారక్.. వీడియో వైరల్
ABN, Publish Date - Oct 01 , 2026 | 06:00 PM
మానవత్వానికి, అభిమానుల పట్ల చూపే ప్రేమాభిమానాలకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని కోట్లాది మంది అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.
మానవత్వానికి, అభిమానుల పట్ల చూపే ప్రేమాభిమానాలకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని కోట్లాది మంది అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. మాటలు రాని, వినికిడి లోపం ఉన్న ఓ వీరాభిమానిని ప్రత్యేకంగా హైదరాబాద్‌కు పిలిపించుకుని, తన చేతికి ఉన్న ఆర్మ స్లింగ్‌ను పక్కనపెట్టి మరీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ (NTR) చూపిన ఈ ఆత్మీయతకు ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.
అసలేం జరిగిందంటే..
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బొమ్మనకుంట గ్రామానికి చెందిన గణేష్ (Ganesh) పుట్టుకతోనే దివ్యాంగుడు (మాటలు రావు, చెవులు వినిపించవు). అయితేనేం, జూనియర్ ఎన్టీఆర్ అంటే అతనికి ప్రాణం. తారక్ లాగే హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తూ ఆయన సినిమాలను ఎంతగానో ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దేవర’ (Devara)ను చూసేందుకు పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లా మదనపల్లె థియేటర్‌కు వెళ్లాడు. సినిమా ముగిసిన తర్వాత బయటకు వచ్చిన గణేష్‌ను ఓ స్థానిక యూట్యూబర్ ‘సినిమా ఎలా ఉంది?’ అని అడగ్గా.. మాటలు రాని గణేష్ తన సైగలతోనే సినిమా అద్భుతంగా ఉందంటూ ఎమోషనల్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. తారక్ నటన, యాక్షన్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయంటూ కళ్లలోనే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చివరికి జూనియర్ ఎన్టీఆర్ కంట పడింది.
హైదరాబాద్‌కు పిలిపించి..
ఆ వీరాభిమాని స్వచ్ఛమైన ప్రేమను చూసి చలించిపోయిన ఎన్టీఆర్.. వెంటనే తన పీఆర్ టీమ్‌ను అప్రమత్తం చేశారు. బొమ్మనకుంట గ్రామంలో ఉన్న గణేష్ ఆచూకీ కనుక్కొని, ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి రప్పించారు. గణేష్ తన వద్దకు రాగానే ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల చేతికి గాయం కావడంతో ఆర్మ స్లింగ్ (చేతి కట్టు) ధరించి ఉన్న తారక్.. అభిమానిని పూర్తిగా హత్తుకోవడానికి ఆ కట్టు అడ్డంకిగా మారకూడదని భావించి దాన్ని విప్పేశారు. అనంతరం గణేష్‌ను ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. తారక్ చూపించిన ప్రేమాభిమానాలకు ఉబ్బితబ్బిబ్బైన గణేష్.. ఎన్టీఆర్ బుగ్గపై ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. దీంతో తారక్ చిరునవ్వులు చిందిస్తూ అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పి, ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉండాలని సైగలతో ధైర్యం చెప్పారు. అభిమానం అంటే కేవలం ఈలలు, గోలలు మాత్రమే కాదు.. హృదయం లోతుల్లోంచి పుట్టే స్వచ్ఛమైన భావోద్వేగమని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో చూసిన సినీ ప్రియులు, నెటిజన్లు ‘తారక్ అన్న బంగారు మనసు మామూలుది కాదు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
తాత జయంతి వేళ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం
కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట
ఈ వారం మూడు కొత్త సినిమాలు.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి