అమల అక్కినేని ఆవిష్కరించిన ‘శివ రూపాయ విష్ణవే’!
ABN , Publish Date - Oct 01 , 2026 | 07:31 PM
దక్షిణ భారత చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్ ఎస్.ఎస్. కృష్ణ కిరీటి రచించిన సరికొత్త చారిత్రక నవల ‘శివ రూపాయ విష్ణవే: పార్ట్ 1 - ది వార్‌హార్స్ అండ్ ది డ్యాన్సర్’ను అమల అక్కినేని ఆవిష్కరించారు.
దక్షిణ భారత చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్ ఎస్.ఎస్. కృష్ణ కిరీటి రచించిన సరికొత్త చారిత్రక నవల ‘శివ రూపాయ విష్ణవే: పార్ట్ 1 - ది వార్‌హార్స్ అండ్ ది డ్యాన్సర్’ (Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer). మయసభ పబ్లికేషన్స్ సమర్పణలో వచ్చిన ఈ పుస్తకాన్ని నటి, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డైరెక్టర్ అమల అక్కినేని (Amala Akkineni) అధికారికంగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోని శివ థియేటర్‌లో ఈ పుస్తకావిష్కరణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పూర్వ విద్యార్థి అయిన కృష్ణ కిరీటి తన తొలి నవలను ప్రతిష్టాత్మక క్యాంపస్‌లోనే ఆవిష్కరించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అమల అక్కినేనితో పాటు ఫిల్మ్ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని రచయితకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణిస్తుండటం గర్వకారణమని ప్రశంసించారు. తెలుగు సంస్కృతి, పురాణాలు, చారిత్రక అంశాలను మేళవిస్తూ ఎనిమిది శతాబ్దాల కథను ఒక వినూత్న శైలిలో నవలగా మలచడం అభినందనీయమని, ఈ పుస్తకం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు.

ఈ బుక్ ప్రత్యేకతలివే..
యుద్ధం ముగిసిన మూడేళ్ల తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు.. కూచిపూడి నర్తకి చెప్పే ఒక కథతో ఈ నవల ప్రారంభమవుతుంది. సుమారు ఎనిమిది శతాబ్దాల (11వ, 12వ, 8వ, 15వ శతాబ్దాల) దక్షిణ భారత చరిత్రను వెనక్కి తీసుకెళుతూ ఆవిష్కరించిన ట్రయాలజీలో ఇది మొదటి భాగం. ఈ పుస్తకంలో మరో అరుదైన విశేషం ఉంది. రచయిత రాసిన ఒక ప్రత్యేక గీతాన్ని ప్రముఖ స్వరబ్రహ్మ మణిశర్మ స్వరపరచగా, దివంగత గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. పుస్తకంలోని క్యూఆర్ (QR) కోడ్ ద్వారా పాఠకులు చదువుతూనే ఈ పాటను వినే సరికొత్త అనుభూతిని పొందవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో కృష్ణ కిరీటి రూపొందించిన ఈ ‘శివ రూపాయ విష్ణవే’ నవల.. సాహిత్య, చరిత్ర ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
చేతి కట్టు తీసి మరీ అభిమానిని హత్తుకున్న తారక్.. వీడియో వైరల్
తాత జయంతి వేళ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం
కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట