పవన్ ‘తీన్‌మార్’ హిట్ కాదని ముందే తెలుసు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 08:38 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ సినిమా ఫలితంపై తాజాగా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Jayant C Paranjee about Teenmaar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లో బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా క్లాసిక్ లవ్ స్టోరీగా, అభిమానుల గుండెల్లో ‘కల్ట్’ చిత్రంగా నిలిచిపోయిన సినిమా ‘తీన్‌మార్’ (TeenMaar). బాలీవుడ్ సూపర్ హిట్ ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మాటలు అందించగా, సీనియర్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఫలితంపై తాజాగా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ (Director Jayant C Paranjee) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో ‘తీన్‌మార్’ అనుభవాలను గుర్తుచేసుకుంటూ జయంత్ సి. పరాన్జీ షాకింగ్ నిజాలను బయటపెట్టారు.‘‘పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘తీన్‌మార్' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ సినిమా ఆడదనే విషయం నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అసలు ఆ ప్రాజెక్ట్ ప్రాసెస్‌లో కథ, మాటలు రాసిన త్రివిక్రమ్‌ను నేను కనీసం ఒక్కసారి కూడా కలవలేదు. ఆ సమయంలో ఆయన మహేష్ బాబుతో ‘ఖలేజా’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నన్నేమో ప్రాజెక్ట్ చివరి దశలో డైరెక్టర్‌గా లోపలికి తీసుకున్నారు. ఇద్దరి మధ్య సమన్వయం లేకుండా పోయింది’’ అని చెప్పుకొచ్చారు.


సైఫ్ వేరు.. పవన్ కళ్యాణ్ ఆరా వేరు

సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ కాకపోవడానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘బాలీవుడ్ ఒరిజినల్ ‘లవ్ ఆజ్ కల్’ సినిమా అక్కడి కల్చర్, బాలీవుడ్ సెన్సిబిలిటీస్‌కి సరిగ్గా సరిపోయింది. పైగా హీరో సైఫ్ అలీ ఖాన్‌కు మన పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత భారీ మాస్ ఇమేజ్, ఆరా లేవు. అందుకే అక్కడ ఆ సినిమా ఆడింది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో అలాంటి సబ్జెక్ట్ తీయడం మన ఆడియన్స్‌కు రుచించలేదు" అని స్పష్టం చేశారు. ‘‘సినిమా బెనిఫిట్ షోలు పడగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొందరు అభిమానులు ఏకంగా మా ఇంటి ముందే వచ్చి ధర్నా చేశారు. ‘అప్పటికే సోనూ సూద్‌తో పెళ్లయిపోయిన హీరోయిన్ త్రిష.. మళ్లీ మా హీరో దగ్గరికి ఎలా వస్తుంది? ఆ క్లైమాక్స్ ఏంటి?’ అంటూ గొడవ చేశారు’’ అని జయంత్ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.


ఫ్యాన్స్ దృష్టిలో ఇప్పటికీ ‘కల్ట్’.. రీ-రిలీజ్ డిమాండ్!

అప్పట్లో ఫలితం తారుమారైనా.. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ‘తీన్‌మార్’ ఇప్పటికీ ఎంతో ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. మైఖేల్ వేలాయుధం, అర్జున్ పాల్వాయిగా పవన్ చూపించిన వేరియేషన్స్, మణిశర్మ అందించిన చార్ట్‌బస్టర్ సాంగ్స్, త్రివిక్రమ్ లోతైన ఫిలాసఫికల్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే ఆ సమయంలో ప్రయోగించిన ‘స్పాట్ డబ్బింగ్’ వల్ల డైలాగ్స్ సరిగ్గా వినిపించకపోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందనే టాక్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఒకవేళ స్పాట్ డబ్బింగ్ కాకుండా సాధారణ డబ్బింగ్ ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అందుకే డబ్బింగ్ సమస్యను సరిచేసి, సౌండ్ రీ-మాస్టర్ చేసి ‘తీన్‌మార్’ను మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేయాలంటూ ఇప్పటికీ నిర్మాత బండ్ల గణేష్‌ను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లతో ముంచెత్తుతున్నారు. మరి దర్శకుడి వ్యాఖ్యల నేపథ్యంలో చిత్ర నిర్మాణ వర్గం.. ముఖ్యంగా బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

అమల అక్కినేని ఆవిష్కరించిన ‘శివ రూపాయ విష్ణవే’!

చేతి కట్టు తీసి మరీ అభిమానిని హత్తుకున్న తారక్.. వీడియో వైరల్

తాత జయంతి వేళ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం

Updated Date - Oct 01 , 2026 | 09:23 PM