నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్: దుల్కర్
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:24 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు ఆడియెన్స్ గురించి దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I am Game). మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా, ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘నా ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రమిది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఒక పెద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగే ఉందని వారు ప్రశంసించారు. ట్రైలర్‌లో సినిమాలోని అన్ని అంశాలను చూపించలేదు.. థియేటర్లలో చూసినప్పుడు ఇందులో ఉండే ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ మీ అందరినీ తప్పకుండా సర్‌ప్రైజ్ చేసి విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం, హీరోలను ఆదరించే తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి.. ఏ స్టార్ పేరు చెప్పినా.. ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మ్యాజికల్‌గా ఉంటుంది. ఇతర భాషల నుంచి వచ్చిన నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు నేనే స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాను. నా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా చూసి, ఎడిటింగ్‌లో కూడా ఎంతో సహాయం చేశారు’’ అని తెలిపారు.
అనంతరం వేదికపై నిర్వహించిన సరదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ గేమ్‌లో దుల్కర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’లలో ఏది మీ కెరీర్‌కు పాత్ బ్రేకింగ్ సినిమా అని అడగ్గా.. ‘‘ఖచ్చితంగా ‘మహానటి’ చిత్రమే. నాకు అసలు తెలుగు రాదని చెప్పినప్పుడు నాగి, స్వప్న నన్ను నమ్మి అండగా నిలిచారు. నా తెలుగు సినీ ప్రయాణానికి కారణం వైజయంతీ మూవీస్ కుటుంబమే. నాకు హైదరాబాద్‌లో వైజయంతీ సంస్థే సొంత కుటుంబం లాంటిది. నాగి ఎప్పుడు పిలిచి నటించమన్నా నేను ఆలోచించకుండా వచ్చేస్తాను’’ అని స్పష్టం చేశారు. అలాగే తన తండ్రి మమ్ముట్టి నటించిన సినిమాల్లో ‘దళపతి’ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని, కాలేజీ చదువుల కోసం వెళ్లినప్పుడు ఆ సినిమా డీవీడీని మాత్రమే వెంట తీసుకెళ్లానని గుర్తుచేసుకున్నారు. తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే విపరీతమైన ఇష్టమని కూడా చెప్పారు.
చివరగా, త్వరలోనే తన నుంచి మరో రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు రాబోతున్నాయని దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానున్న ‘ఐయామ్ గేమ్’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో కలిసి ఆయన స్టేజ్‌పై డ్యాన్స్ స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్యతో ‘ఇరుముడి’ దర్శకుడు నిజమేనా..
అక్టోబర్ నుంచి యంగ్ టైగర్ వేటకు వస్తున్నాడట..