బాలయ్యతో ‘ఇరుముడి’ దర్శకుడు నిజమేనా..

ABN , Publish Date - Aug 31 , 2026 | 10:37 PM

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Balayya and Shiva Nirvana

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్‌లతో కాస్త వీక్‌గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు ఫిలింనగర్ కారిడార్లలో జోరుగా షికార్లు చేస్తున్నాయి. యంగ్ హీరోలు, టైర్-2 హీరోలే కాకుండా, ఇద్దరు స్టార్ హీరోలు కూడా శివ నిర్వాణ దర్శకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. శివ నిర్వాణ తన తదుపరి ప్రాజెక్ట్‌ను నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య లాంటి మాస్ హీరోకి, శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ ప్రచారంలో అసలు నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 సినిమాలో ఆయన నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, మైత్రీ మూవీ మేకర్స్ దీనికి నిర్మాతలు కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల షూటింగ్‌లో గాయపడిన బాలయ్య, కోలుకున్న వెంటనే మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి దిగనున్నారు. ఇక ఈ సినిమా లైన్‌లో ఉండగానే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో NBK112 కూడా లాక్ అయింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి.


దీన్ని బట్టి చూస్తే రాబోయే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు బాలయ్య కాల్ షీట్స్ ఫుల్ అయిపోయాయి. ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే శివ నిర్వాణ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్య-శివ నిర్వాణ కాంబోపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. శివ నిర్వాణ తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నారనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

నిర్మాత సి. కల్యాణ్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్ రాధాకృష్ణ

అక్టోబర్ నుంచి యంగ్ టైగర్ వేటకు వస్తున్నాడట..

రాజా రవీంద్రతో నేనే దాడి చేయించుకున్నా: కస్తూరి షాకింగ్ కామెంట్స్

Updated Date - Aug 31 , 2026 | 10:51 PM