Dr. Rajsekhar: అప్పుడు తండ్రితో... ఇప్పుడు కొడుకుతో...
ABN , Publish Date - Apr 15 , 2026 | 07:39 PM
తండ్రీ కొడుకుల దర్శకత్వంలో నటించిన తెలుగు హీరోలు ముందు జనరేషన్‌లో చాలామందే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి డా. రాజశేఖర్ పేరు కూడా చేరింది.
మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులంతా ఇటు తండ్రి డైరెక్షన్‌లో సినిమాలు చేసి, ఆ పైన కొడుకు దర్శకత్వంలోనూ సినిమాల్లో నటించారు. దానికి ప్రధాన కారణం ఆ దర్శకుల వారసులు మెగాఫోన్ పట్టుకోవడం ఒకటైతే, ఈ హీరోలంతా లాంగ్ కెరీర్‌ను కొనసాగించడం మరో కారణం! ఇప్పుడు ఈ జాబితాలోకి డాక్టర్ రాజశేఖర్ కూడా చేరబోతున్నారు. డా. రాజశేఖర్ 1989లో ప్రముఖ మలయాళ దర్శకుడు ఐ. వి. శశి తెరకెక్కించిన 'మంచివారు మావారు' సినిమాలో నటించారు. జీవిత అందులో హీరోయిన్. విశేషం ఏమంటే ఇది రాజశేఖర్ సొంత సినిమా. నిర్మాణ సారధిగా ఎ. ఎం. రత్నం వ్యవహరించారు. అయితే... మళ్ళీ ఇంత కాలానికి డా. రాజశేఖర్ ఇప్పుడు స్వర్గీయ ఐ. వి. శశి తనయుడు అని ఐ.వి. శశి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
ఐ. వి. శశి కొడుకైన అని ప్రస్తుతం తమిళ సినిమా 'లబ్బర్ పండు'ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. నిజానికి అని ఐ.వి. శశి తెలుగు సినిమాతోనే దర్శకుడిగా మారాడు. 2021లో అని దర్శకత్వంలో 'నిన్నిలా నిన్నిలా' సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో అశోక్ సెల్వన్, రీతూ మీనన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. అని తెరకెక్కించిన 'మాయ' అనే షార్ట్ ఫిల్మ్ దీనికి ఆధారం. ఆ తర్వాత అని ఐ.వి. శశి 'ఉప్పుకప్పురంబు' అనే మరో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో సుహాస్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో తెలుగు సినిమాగా తమిళ చిత్రం 'లబ్బర్ పండు'ను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రాబోతోంది.
కెరీర్ పరంగా రాజశేఖర్ గతంలో అంత యాక్టివ్‌గా లేకపోయినా... తనకు వచ్చిన అవకాశాలలో సమ్ థింగ్ బెటర్ అనుకున్న ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుని యాక్ట్ చేస్తున్నారు. అలా ఇటీవల వచ్చిన 'బైకర్' ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే పవన్ సాదినేని దర్శకత్వంలోనూ రాజశేఖర్ ఓ సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ సెట్‌లో ప్రమాదం
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!