సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?

ABN, Publish Date - Aug 04 , 2026 | 12:56 PM

దేవి శ్రీ ప్రసాద్.. ఈ పేరు వింటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది అద్భుతమైన మ్యూజిక్, దానికి తోడు మైండ్ బ్లాకింగ్ ఎనర్జీ. కొన్నాళ్లుగా ఈ పేరు సరిగా వినిపించడం లేదు. ఇప్పుడు మరోసారి వినిపించే టైమ్ వచ్చేసింది.

Rockstar DSP

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).. ఈ పేరు వింటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది అద్భుతమైన మ్యూజిక్, దానికి తోడు మైండ్ బ్లాకింగ్ ఎనర్జీ. స్టేజ్ పైన మైక్ పట్టుకుని పాడినా.. థియేటర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోగించినా.. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ స్టెప్పులేయించడం ఒక్క డీఎస్పీకే చెల్లింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ‘దేవి’ (Devi) సినిమాతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి సినిమాతోనే తన డిఫరెంట్ ట్యూన్స్‌తో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాదు.. పాటలు రాయడం, పాడటం, తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఈవెంట్లను హోరెత్తించడం డీఎస్పీకే సొంతమైన ప్రత్యేకం.


ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలంలోనే టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరిగా మారిన దేవి, ఆ తర్వాత కొద్ది రోజులకే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. అప్పట్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ జోరు కాస్త తగ్గాక.. చాలా ఏళ్ల పాటు తెలుగులో పెద్ద హీరోల సినిమాలకి మొదటి ఛాయిస్ దేవి శ్రీ ప్రసాదే. ఆయన చేసిన మ్యూజిక్ మ్యాజిక్ అలాంటిది మరి. అయితే.. నాణేనికి రెండో వైపు ఉన్నట్టు, గత కొన్నేళ్లలో పరిణామాలు కాస్త మారాయి. థమన్, అనిరుధ్ రవిచందర్ వంటి సంగీత దర్శకులు సరికొత్త సౌండింగ్‌తో విజృంభించడంతో దేవి దూకుడు కాస్త తగ్గింది. వరుసగా సినిమాలు తగ్గడం ఒకెత్తయితే.. డీఎస్పీ మ్యూజిక్‌లో క్వాలిటీ కూడా తగ్గిందనే విమర్శలు గట్టిగానే వచ్చాయి. దీనికి తోడు, ‘ఎల్లమ్మ’ చిత్రంతో ఆయన హీరో అవతారం ఎత్తుతుండడంతో.. ఇక సంగీతం మీద దేవికి ఫోకస్ తగ్గిపోయిందని, ఆయన పనైపోయిందని రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. కానీ.. రాక్ స్టార్ ఊరికే తగ్గుతాడా? చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ తన మార్కుతో విజృంభించడానికి డీఎస్పీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల దేవి పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అనౌన్స్‌మెంట్లు ఆయన అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమా నుంచి ‘పర్షి’ పాత్రలో దేవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన చిన్న గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్‌లో సంగీత పరంగా తన మార్కును మరోసారి చూపించాడు. ఇంటెన్స్‌గా, కొత్తగా అనిపించే సౌండింగ్‌తో ‘ఎల్లమ్మ’ మ్యూజిక్‌పై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు.


మరోవైపు, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్‌లో మైలురాయి లాంటి వందో (King100) సినిమాకు కూడా దేవినే సంగీత దర్శకుడిగా ప్రకటించారు. నాగార్జునతో దేవికిది ఏడో సినిమా కావడం విశేషం. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. నాగార్జునకు ఇది ప్రెస్టీజియస్ మూవీ కావడంతో.. దేవి తన సంగీతంతో థియేటర్లను ఉర్రూతలూగిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తమిళంలో కూడా కార్తీ 30 (Karthi30)వ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవినే ఎంపిక చేశారు. ఇలా ప్రస్తుతం దేవి సైన్ చేసిన సినిమాలన్నీ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక్క అంశంపై ఉంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతోన్న కొత్త సినిమాకు (RC17) దేవి పనిచేస్తాడా లేదా?. తొలిసారిగా దేవి శ్రీ ప్రసాద్ లేకుండా వేరే సంగీత దర్శకుడితో సుక్కు పూర్తి స్థాయిలో ఒక సినిమాకు పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే

‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఆ వివాదానికి సూర్య చెక్ పెట్టనున్నారా

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

Updated Date - Aug 04 , 2026 | 02:13 PM