గాయని పి. సుశీలకు.. ఘన పౌర సన్మానం
ABN, Publish Date - Oct 07 , 2026 | 09:18 AM
దశాబ్దాలుగా తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పి. సుశీలకు హైదరాబాద్‌లో ఘన సత్కారం జరిగింది.
త్యాగరాయ గానసభ (Sri Thyagaraya Gana Sabha)లో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదర్శ ఫౌండేషన్, ఆర్ఆర్ ఫౌండేషన్ (RR Foundation) ఆధ్వర్యంలో మంగళవారం పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పి.సుశీల (P. Susheela) కు పౌర సన్మానం గాయనీ గాయకుల ఆనం దోత్సాహాల మధ్య జరిగింది.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. సుశీల తెలుగు జాతి సంపద అని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమె పాటలు భవిష్యత్ తరాలకు అందేలా చేయాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన సమాచార హక్కు చట్టం మాజీ ముఖ్య కమిషనర్ పి. విజయబాబు మాట్లాడుతూ, సప్త స్వరాలు సుశీల గానంలో పలుకుతాయన్నారు. గాయని ఆమనిపై ఉన్న అభిమానంతో పదహారు సార్లు ఆమె కార్యక్రమాలకు రావటం విశేషమన్నారు.
అనంతరం గాయని సుశీల మాట్లాడుతూ, వృద్ధాప్యంలో ఉన్న సంగీత కళాకారులకు వేరే ఉపాధి లేదని, వారి కోసం ట్రస్ట్ ప్రారంభించామన్నారు. అయితే, ఆర్ధిక వనరులు లేక మూసివేతలో ఉన్న ట్రస్టును ఆమని తిరిగి తెరిపించే ప్రయత్నంలో ప్రభుత్వ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నదని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు. వేదికపై కుసుమ భోగరాజు, బీఎస్పీవీఎస్ మూర్తి, వెంకటేష్ గుప్తా తది తరులు పాల్గొన్నారు.