నిన్న రాజశేఖర్.. నేడు విజయ శాంతి! అసలు బాలయ్యతో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివయ్య
ABN , Publish Date - Oct 07 , 2026 | 08:45 AM
నటసింహం నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సినిమాలో సీనియర్ నటి కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (koratala shiva) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందట. ముందుగా బాలయ్య లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి, ఆ తర్వాత ఆయన సెట్‌లోకి అడుగుపెట్టగానే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు.
ఇందుకోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను సైతం నిర్మిస్తున్నట్లు సమాచారం. బాలయ్యను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్‌లో, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కొరటాల ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ సీనియర్ నటి కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి (Vijayashanti) ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారట. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కీలక సన్నివేశాల్లో ఆమె ఒక డాషింగ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారని సమాచారం. బాలయ్య-విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలయ్య, విజయశాంతిల కాంబో టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి దాదాపు 17 సినిమాల్లో జోడీగా అలరించారు. 1984లో వచ్చిన ‘కథానాయకుడు’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం... ఆ తర్వాత వచ్చిన 'ముద్దుల కృష్ణయ్య', 'దేశోద్ధారకుడు', 'అపూర్వ సహోదరులు', 'మువ్వ గోపాలుడు', 'భానుమతి గారి మొగుడు', 'ఇన్‌స్పెక్టర్ ప్రతాప్', 'భలే దొంగ', 'ముద్దుల మావయ్య', 'రౌడీ ఇన్‌స్పెక్టర్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇక 1993లో వచ్చిన ‘నిప్పురవ్వ’ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ వెండితెరపై కలిసి కనిపించలేదు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల విరామం తర్వాత బాలయ్య - విజయశాంతి మళ్లీ ఒకే సినిమాలో నటించబోతున్నారనే వార్త వినగానే నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని గట్టిగా ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న రాజశేఖర్ (rajasekhar) బాలయ్యకు ధీటైన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. బాలయ్య వర్సెస్ రాజశేఖర్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే థియేటర్లలో ఈలలు పడటం ఖాయమనిపిస్తోంది.
ఇక ‘దేవర’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కొరటాల ఈ సినిమాపై చాలా కసరత్తులు చేశారట. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుకు హత్తుకునే స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి 33 ఏళ్ల తర్వాత బాలయ్య - విజయశాంతి కాంబో నిజంగానే రిపీట్ అవుతుందా? రాజశేఖర్ విలనిజం ఎలా ఉండబోతోంది? ఈ రూమర్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.