Telugu Cinema: టాలీవుడ్ స్టార్స్ కు రాజకీయ రంగు
ABN, Publish Date - Jul 14 , 2026 | 10:31 AM
కొన్ని దశాబ్దాలుగా సినిమా- పాలిటిక్స్ చెట్టాపట్టాలేసుకొని సాగుతున్నాయి. దాంతో స్టార్స్ ఏ పొలిటీషియన్ ను కలసినా, రాజకీయ చిత్రంలో నటించినా వెంటనే వారికి రంగు పులుముతోంది సోషల్ మీడియా. ఈ చేష్టలపై సినీ ఫ్యాన్స్ విపరీతంగా ముచ్చటించు కుంటున్నారు.
ఈ మధ్య జూనియర్ యన్టీఆర్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్నారని విశేషంగా వినిపించింది. జూలై 18వ తేదీన తన పొలిటికల్ ఎంట్రీపై యన్టీఆర్ క్లారిటీ ఇస్తారనీ టముకు సాగింది. అయితే అవేవీ నిజం కాదని యన్టీఆర్ అభిమాన సంఘాలు ఖండించాయి. దాంతో ఆ రచ్చ ముగిసింది. టాలీవుడ్ స్టార్స్ ఏ పొలిటీషియన్ ను కలిసినా, లేదా రాజకీయ నేపథ్యమున్న చిత్రాల్లో నటించినా వెంటనే వారికి పొలిటికల్ కలర్ పూసేస్తున్నాయి సోషల్ మీడియా సైట్స్. ఆ మధ్య ఓ హీరో తన అభిమానులకు ఘనంగా పార్టీ ఇచ్చారు. దాంతో వెంటనే సదరు హీరో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఫ్యాన్స్ ను కూడగట్టారని సోషల్ మీడియా సందడి చేసింది. ఈ రచ్చంతా తెలుగునేలపై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీయమ్ అయినప్పటి కంటే తమిళనాట విజయ్ ముఖ్యమంత్రి కాగానే పెచ్చుమీరింది. ఒకప్పుడు తమిళనాట పలువురు నటులు రాజకీయ పార్టీలు పెట్టి పోటీ చేశారు. అదే తీరున తెలుగునేలపై స్టార్ హీరోస్ కూడా సాగుతారని సామాజిక మాధ్యమమే పుంఖానుపుంఖాలుగా కథలు వండి వారుస్తోంది.
తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో సినీజనం ముడివేసుకొని సాగారు. 1967 నుండి ఇప్పటిదాకా తమిళనాడులో సినీజనంతో సంబంధమున్న పార్టీలే రాజ్యమేలుతూ వచ్చాయి. డి.యమ్.కె, అన్నా డి.యమ్.కె. తప్ప మరో పార్టీకి తమిళనాడులో తావులేదు అన్న మాటకు చెల్లు చీటి ఇస్తూ తమిళ జనం స్టార్ హీరో విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగమ్'కు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గద్దెనెక్కారు. అప్పటి నుంచీ తమిళనాడులో కన్నా మిన్నగా తెలుగునేలపై మన స్టార్స్ కూడా పాలిటిక్స్ లో పాలుపంచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తన మిత్రుడు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్ళారు. దాంతో అప్పటికప్పుడు 'అల్లు అర్జున్ ఆర్మీ' అంటూ ఓ పార్టీని సోషల్ మీడియానే క్రియేట్ చేసేసింది. ఈ సారి బన్నీ రాజకీయప్రవేశం గ్యారంటీ అంటూ కథనాలూ వండేసింది. అదే తీరున యన్టీఆర్ విషయంలోనూ పలు కథలు, కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం ఓ పార్టీ పెట్టబోతున్నట్టు సామాజిక మాధ్యమంలో సందడి సాగింది. ఇవన్నీ చూస్తున్న జనం నవ్వుకుంటున్నారే కానీ, దేనినీ సీరియస్ గా తీసుకోవడం లేదు.
లైక్స్, వ్యూస్ కోసమే సోషల్ మీడియా సినిమా హీరోలు రాజకీయాల్లోకి వస్తున్నారని టముకు వేస్తూ ఉంటుందని ప్రజలు ఏ నాడో పసికట్టేశారు. స్టార్స్ - వారి పొలిటికల్ ఎంట్రీస్ గురించి వస్తోన్న వార్తలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆ హీరో ఓ పార్టీ, ఈ స్టార్ మరో పార్టీ పెట్టుకోవడం ఎందుకు అందరూ సమైక్యంగా ఒకే పార్టీ పెట్టుకుంటే బాగుంటుందనీ సలహా ఇస్తున్నారు జనం. ఎటూ మన నటీనటులకు 'మా' అసోసియేషన్ ఉంది కదా. అదే పేరుతో అందరూ ఓ పార్టీలో సాగితే మంచిదనీ సూచిస్తున్నారు. ఇక స్టార్ హీరోస్ తమ సినిమాలకు ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయో చూసుకొని, అక్కడి తమ అభిమాన సంఘం అధ్యక్షునికి టిక్కెట్ ఇస్తే ఇట్టే గెలిచేస్తారనీ గోల చేస్తున్నారు. సోషల్ మీడియా క్రియేటర్స్ జనం వారిపై వేస్తున్న సెటైర్స్ ను పట్టించుకోవాలి. వ్యూస్ కోసం స్టార్స్ కు పొలిటికల్ కలర్ పులిమేసి, కొందరు జ్యోతిషులను తెచ్చి వారి రాజకీయ జాతకాలు చెప్పించడమూ సబబు కాదని అంటున్నారు. జనం మాటలను సోషల్ మీడియా క్రియేటర్స్ లెక్కలోకి తీసుకుంటారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్
కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ