హిట్ జోడీ మరోసారి.. అభిమానులకు పండగలా కాంబినేషన్స్
ABN, Publish Date - Jun 15 , 2026 | 06:48 AM
టాలీవుడ్‌లో ఒకప్పుడు హిట్‌గా నిలిచిన స్టార్ జంటలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఒకప్పుడు థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేసిన కాంబినేషన్స్ మళ్లీ స్క్రీన్ మీద కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. వాళ్ల మధ్య ఉండే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi)-త్రిష (Trisha), నాగార్జున (Nagarjuna)- టబు (Tabu) లాంటి జంటలను దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు పెద్ద పండగే.
మెగాస్టార్ చిరంజీవి- త్రిష జోడీ రెండు దశాబ్దాల తర్వాత రిపీట్ అవుతోంది. 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రంలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ‘విశ్వంభర’ (Vishwambhara)లో జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ చిత్రంగా ‘విశ్వంభర’ రూపుదిద్దుకుంటోంది.
యాక్షన్ డ్రామా ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించిన తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్‌బీకే 111’(వర్కింగ్ టైటిల్)తో ప్రేక్షకులను మళ్లీ అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో మొదట నయనతారను అనుకున్నారు.కానీ కథలో వచ్చిన మార్పులు, ఇతర కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆ అవకాశం కాజల్‌ను వరించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో కాజల్ పాత్ర ఎలా ఉండబోతుందనేది బయటకు రానప్పటికీ, బాలకృష్ణ పవర్‌ఫుల్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.
అక్కినేని నాగార్జున-టబు కాంబినేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చే చిత్రాలు ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ జోడీ మళ్లీ వెండి తెరపై కలసి నటిస్తోంది. నాగార్జున కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ద్వారా వీరిద్దరూ మళ్లీ స్ర్కీన్‌ను షేర్ చేసుకోబోతున్నారు. నాగార్జున సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) తెరకెక్కిస్తున్నారు. నాగార్జున వందో చిత్రం కావడం, మరోవైపు టబు రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.