Tollywood: దసరా బాక్సాఫీస్ బ్లాస్ట్‌.. సంక్రాంతిని మించి తెలుగు సినిమాల రిలీజెస్‌

ABN , Publish Date - Jun 14 , 2026 | 07:12 PM

వేసవి సీజన్‌ను కోల్పోయిన టాలీవుడ్ ఇప్పుడు దసరాపై ఫోకస్ పెట్టింది.

Dasara Releases

తెలుగు చిత్రసీమలో సంక్రాంతి సీజన్‌ను అత్యంత ప్రధానమైన, లాభదాయకమైన సమయంగా భావిస్తారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ విజయంలో వేసవి, దసరా సీజన్లు కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలు ఈ మూడు సీజన్లను లక్ష్యంగా చేసుకునే బరిలోకి దిగుతుంటాయి. కానీ, గత కొంతకాలంగా పరిశ్రమ సంక్రాంతి మాయలో పడిపోయి, మిగిలిన సీజన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.

దీనివల్ల ఈ ఏడాది వేసవి సీజన్ ఎలాంటి పెద్ద సినిమాలు లేకుండా పూర్తిగా వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలో, వేసవిలో జరిగిన భారీ నష్టాన్ని పూడ్చడానికి రాబోయే దసరా సీజన్ (Dasara Releases)ను సంక్రాంతి (Pongal)కి మించి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. హీరోలు, నిర్మాతలు ఈసారి ఎలాగైనా దసరా బరిలో నిలవాలని గట్టి పట్టుదలతో ఉండటంతో, వేసవి నిర్లక్ష్యానికి వడ్డీతో సహా బాక్సాఫీస్ (Box Office) వసూళ్లను రాబట్టడానికి టాలీవుడ్ సర్వం సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభ‌ర‌’ (Vishwambhara) కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరిగిన జాప్యం కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ విజువల్ వండర్‌ను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు, ఇప్పటికే దీని ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చింది.

మరోవైపు, సీనియర్ హీరో కింగ్ నాగార్జున (Nagarjuna) తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ మైల్‌స్టోన్ చిత్రంతో దసరా రేసులోకి వస్తున్నారు. కార్తీక్ దర్శకత్వంలో ‘లాటరీ కింగ్’గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. నాగ్ వందో సినిమా కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే టైటిల్, గ్లింప్స్, రిలీజ్ డేట్‌పై స్పష్టత రానుంది.

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా ఈ దసరా పోటీలో నిలవడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) చేస్తున్న కొత్త సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి భారీ అంచనాలు నమోదయ్యాయి. ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, రాబోయే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాక అప్పటికి షూటింగ్ పూర్తవుతుందా లేదా అనే విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.

మరోవైపు, వెంకటేష్ (Venkatesh) – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Adarsha Kutumbam) సినిమా వాస్తవానికి ఈ వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ దసరా బరిలో కచ్చితంగా దిగాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతోంది. జూలై నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, దసరా నాటికి సినిమాను సిద్ధం చేయడం పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ నలుగురు సీనియర్ అగ్ర హీరోల పోరుతో పాటు నాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న ‘పారడైజ్’ (Paradise) చిత్రం కూడా దసరా రేసులోనే నిలవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది, కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి ఎలాగైనా దసరా పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవాలని చిత్ర యూనిట్ పనులను చకచకా పూర్తి చేస్తోంది.

ఒకవేళ చిరు, బాలయ్య, నాగ్, వెంకీ వంటి నలుగురు అగ్ర హీరోలు ఒకేసారి దసరా బరిలో నిలిస్తే, బాక్సాఫీస్ వద్ద థియేటర్ల సర్దుబాటు సమస్య తలెత్తే అవకాశం ఉంది. అప్పుడు నాని తన సినిమా విడుదల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ నలుగురిలో ఏ ఒక్కరు డ్రాప్ అయినా, నాని తన ‘పారడైజ్’ చిత్రంతో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ ప్రణాళికలన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ దసరా సీజన్ టాలీవుడ్‌కు సంక్రాంతిని మించిన వైబ్‌ను అందిస్తూ బాక్సాఫీస్‌ను కళకళలాడించడం ఖాయం.

Updated Date - Jun 14 , 2026 | 07:44 PM