Kanchana 4: లారెన్స్ భారీ స్కెచ్! ‘కాంచన 4’.. రష్మిక ఔట్! నయనతార ఎంట్రీ?
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:52 AM
రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’లో కీలక పాత్ర కోసం మొదట రష్మిక మందన్న పేరు వినిపించగా, ఇప్పుడు నయనతారను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
సౌత్ ఇండస్ట్రీలో హారర్-కామెడీ జానర్‌కు సరికొత్త అర్థాన్ని ఇచ్చి, తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ కాంచన (Kanchana). ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) సృష్టించిన ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగులోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. గతంలో విడుదలైన 'ముని', 'కాంచన', 'గంగ', 'కాంచన 3' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచి, ఈ సిరీస్‌కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న కాంచన 4 (Kanchana 4 )పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలోని పాత్రల ఎంపికకు సంబంధించిన కాస్టింగ్ వార్తలు సాషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ఆఖరి భాగాన్ని మునుపటి చిత్రాల కంటే అత్యంత గ్రాండ్‌గా, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దేందుకు రాఘవ లారెన్స్ పక్కా స్కెచ్ వేస్తున్నారట. ఇందులో భాగంగానే భారీ తారాగణాన్ని రంగంలోకి దించారట. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde), బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహి (Nora Fatehi) ప్రధాన పాత్రల్లో నటిస్తూ గ్లామర్ హంగులు జోడిస్తున్నారు. వీరితో పాటు 'కాంచన' ఫ్రాంచైజీకి వెన్నెముక లాంటి కామెడీ ట్రాక్ కోసం కోవై సరళ, దేవదర్శినిలతో పాటు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ నటుడు రెడిన్ కింగ్‌స్లే కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దీంతో ఈసారి భయంతో పాటు వినోదం కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని స్పష్టమవుతోంది.
అయితే, ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పాత్ర కోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పేరు ప్రముఖంగా వినిపించింది. చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం ఇప్పుడు 'లేడీ సూపర్ స్టార్' నయనతార (Nayanthara) ను ఎంపిక చేయాలని లారెన్స్ టీమ్ గట్టిగా భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా, కథను తన భుజాలపై నడిపించగల అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్ వాల్యూ ఉన్న నటి అయితేనే ఈ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని భావించి, రష్మిక స్థానంలో నయనతార వైపు మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది.
నయనతారకు ఇప్పటికే 'మూక్కుత్తి అమ్మన్', 'అరమ్', 'మాయా' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు హారర్, ఫాంటసీ జానర్లలో నటించి మెప్పించిన అనుభవం ఉంది. అందువల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే 'కాంచన 4' కి అదనపు బలం చేకూరడమే కాకుండా.. తమిళ, తెలుగుతో పాటు హిందీ మార్కెట్లలోనూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం ఈ క్రేజీ హారర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.