దర్శకుల సంఘం కోసం నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సంచలన నిర్ణయం
ABN , Publish Date - Apr 20 , 2026 | 10:09 PM
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్శకుల సంఘం ఆధ్వర్యంలో రూ. 30 కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నట్లుగా ఆయన ప్రకటించారు
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) కోసం నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivas Rao) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్శకుల సంఘం ఆధ్వర్యంలో రూ. 30 కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదలవాడ శ్రీనివాసరావు హాజరవగా.. అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్ సాయి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర.. దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారంతా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘మొదటి నుంచి నాకు మీడియా సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇలా పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు.. కానీ, దర్శకుడు విఎన్ ఆదిత్య, నా చేతుల మీదుగానే ఈ ప్రకటన జరగాలని కోరారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించలేకపోయినా.. కళామతల్లికి చేసిన సేవతో నాకు సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏఎన్నార్, శోభన్ బాబు వంటి నటులెంతో మందితో ఎన్నో సినిమాలు తీశాను. నాకు అజయ్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ వంటి వాడు. ఆయన ‘జీవిత ఖైదు’ రూ. 75 లక్షల్లో తీసి పెట్టారు. అప్పట్లో నాకు ఏడు కోట్ల షేర్ వచ్చింది. అప్పట్లో నేను 30 నుంచి 40 రోజుల్లో సినిమాలను తీశాను. నాకు ఇప్పుడున్న ఇండస్ట్రీ కంటే, అప్పుడున్న ఇండస్ట్రీ అంటేనే ఇష్టం. శోభన్ బాబు, ఏఎన్నార్ వంటి హీరోలు మాకెంతో సపోర్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకు కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే దర్శకులకు అండగా నిలబడాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాలను తీయాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణతో ఉంటూ, కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’’ అని చెప్పుకొచ్చారు.
అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘మా కమిటీ కొత్తగా ఎన్నికైంది. మేం విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాలపై ఫోకస్ పెట్టాం. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఉగాది రోజు ఓ గొప్ప ఆలోచనను మాతో పంచుకున్నారు. నిర్మాతలుంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. టాలెంట్ ఉండి కూడా యూనియన్ మెంబర్ షిప్ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద రూ. 30 కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. మా అసోసియేషన్‌లోని మెంబర్లకు ఆయన గొప్ప అవకాశం ఇస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు. ఒకరికి ఒక అవకాశం ఇవ్వడమనేది చాలా గొప్ప విషయం. కానీ చదలవాడ శ్రీనివాసరావు ఒకేసారి ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఆ సినిమాల్లో లాభాలు వస్తే.. యూనియన్‌కే ఇస్తాను అని ఆయన అన్నారు. ఇది మాకు అవకాశం కాదు.. వరం.. ఆయనకు శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాయి రాజేష్, దర్శకుడు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్, సముద్ర, నవీన్ మేడారం వంటి వారు ప్రసంగిస్తూ.. చదలవాడ శ్రీనివాసరావుపై ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి:
అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!
సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!