సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మ‌రోసారి.. నంద‌మూరి వ‌ర్సెస్‌ అక్కినేని

ABN, Publish Date - May 26 , 2026 | 06:45 AM

బాలకృష్ణ, నాగార్జున మధ్య మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ నెలకొననుంది. గతంలో వీరి మధ్య జరిగిన క్లాష్‌ల హిస్టరీ, 2027 పొంగల్ రేసుపై పూర్తి వివరాలు.

Balakrishna, Nagarjuna

తెలుగు చిత్రసీమలో నందమూరి ఫ్యామిలీ పేరు తలచుకోగానే చప్పున గుర్తుకు వచ్చేది అక్కినేని కుటుంబమే. నటరత్న యన్టీఆర్ - నటసమ్రాట్ ఏయన్నార్ తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. వారిద్దరూ బాక్సాఫీస్ బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. పలుమార్లు యన్టీఆర్ దే పైచేయిగా సాగింది. అదే తీరున యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ (Balakrishna) - ఏయన్నారు తనయుడు నాగార్జున (Nagarjuna) మధ్య కూడా బాక్సాఫీస్ వార్ జరిగింది.

రాబోయే సంక్రాంతి బరిలో బాలయ్య- నాగ్ మరోమారు ఢీ కొంటున్నారని తెలుస్తోంది. నాగార్జున తన వందో సినిమా 'లాటరీ కింగ్'తో సంక్రాంతి బరిలో దూకున్నారు. అదే సమయంలో బాలకృష్ణ- కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కూడా జనం ముందుకు రానుందని టాక్. దాంతో రాబోయే పొంగల్ హంగామాపై జనం ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. పైగా అదే సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి- బాబీ మూవీ, వెంకటేశ్ - అనిల్ రావిపూడి సినిమా కూడా పాలుపంచుకోనున్నాయి. అందువల్ల సినీఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలుగుతోంది.

ఇప్పటి దాకా బాలకృష్ణ- నాగార్జున మధ్య దాదాపు 10 సార్లు బాక్సాఫీస్ వార్ సాగింది. వీరిద్దరూ మొట్టమొదటి సారి 1987 జనవరి 14న సంక్రాంతి రేసులో ఢీ కొన్నారు.. బాలకృష్ణ 'భార్గవరాముడు', నాగార్జున 'మజ్ను' చిత్రాలతో వీరిద్దరి బాక్సాఫీస్ వార్ మొదలయింది. 'భార్గవరాముడు' రాయలసీమలో మంచి విజయం సాధిస్తే, 'మజ్ను' ఆంధ్ర ప్రాంతంలో సందడి చేసింది. 1987లోనే ఏప్రిల్ 8న ఏయన్నార్- నాగ్ కలసి నటించిన 'కలెక్టర్ గారి అబ్బాయి' రిలీజ్ కాగా, ఏప్రిల్ 13 బాలకృష్ణ 'సాహస సమ్రాట్' వచ్చాయి.

'కలెక్టర్ గారి అబ్బాయి' మంచి విజయం సాధించింది. అదే యేడాది నవంబర్ 12న నాగ్ 'కిరాయి దాదా' రాగా, నవంబర్ 19న బాలయ్య 'భానుమతి గారి మొగుడు' రిలీజయింది. రెండూ రీమేక్స్ కావడం, రెండూ జనాన్ని అలరించడం జరిగింది. 1988లో నాగ్ 'చినబాబు' మే 6న రాగా, 11వ తేదీన బాలయ్య 'తిరగబడ్డ తెలుగుబిడ్డ' వచ్చింది. రెండూ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. 1989 అక్టోబర్ 5న నాగ్ 'శివ', 13న బాలయ్య 'బాలగోపాలుడు' వచ్చాయి. ఓపెనింగ్స్ లో 'బాలగోపాలుడు' పైచేయి సాధించగా, రన్నింగ్ లో 'శివ' సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ సారి ఏమవుతుందో..?

బాలకృష్ణ 'తల్లిదండ్రులు' 1991 ఫిబ్రవరి 9న రిలీజ్ కాగా, అదే నెల 21న నాగ్ 'నిర్ణయం' వెలుగు చూసింది. 'తల్లిదండ్రులు'ది పైచేయిగా సాగింది... 1994 ఏప్రిల్ 14న బాలయ్య జానపద చిత్రం 'భైరవద్వీపం' రాగా, అదేనెల 20వ తేదీన నాగ్ 'హలో బ్రదర్' రిలీజయింది. రెండూ ఘనవిజయం సాధించాయి. రన్నింగ్ లో 'భైరవద్వీపం' ఆధిక్యం ప్రదర్శించింది. 1996 పొంగల్ బరిలో మరోమారు బాలయ్య 'వంశానికొక్కడు'తో, నాగ్ 'వజ్రం'తో ఒకే రోజు జనవరి 5న పోటీపడ్డాయి. 'వంశానికొక్కడు' పైచేయి సాధించింది.

2004 డిసెంబర్ 15న బాలయ్య 'విజయేంద్రవర్మ' రాగా, అదే నెల 23వ తేదీన నాగ్ 'మాస్' విడుదలైంది. 'మాస్' మంచి విజయం సాధించింది. 2016 పొంగల్ లో బాలయ్య 'డిక్టేటర్'తో నాగ్ 'సోగ్గాడే చిన్నినాయనా' ఢీ కొట్టింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' అప్పర్ హ్యాండ్ అనిపించుకుంది.. ఇలా పలుమార్లు పోటీపడ్డ బాలయ్య, నాగ్ మరోమారు 2027 సంక్రాంతి బరిలో ఢీ కొనబోతున్నారు. పొంగల్ పోటీనే తీసుకుంటే మూడుసార్లు బాలయ్య, నాగ్ పోటీ పడ్డారు. ఓ సారి ఇద్దరూ సమానంగా సాగారు. తరువాత ఓ మారు బాలయ్య, మరోసారి నాగ్ పై చేయి సాధించారు.. అందువల్ల రాబోయే పొంగల్ బరిలో బాలయ్య, నాగ్ మూవీస్ ఏ తీరున సాగుతాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సారి ఏమవుతుందో చూడాలి..

Updated Date - May 26 , 2026 | 07:04 AM