ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం!
ABN , Publish Date - May 25 , 2026 | 06:44 PM
టాలీవుడ్‌లో నెలకొన్న ‘పర్సెంటేజ్’ వివాదానికి తెరదించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. సోమవారం చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశంలో.. చిత్ర పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)లో నెలకొన్న ‘పర్సెంటేజ్’ వివాదానికి తెరదించేందుకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రంగంలోకి దిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన సబ్ కమిటీ సూచనల పట్ల సంతోషంగా లేని తెలంగాణ ఎగ్జిబిటర్స్.. రెండు రోజుల క్రితం ‘పెద్ది’ సినిమా నుంచే తమకు పర్సెంటేజ్ కావాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మరో పెద్ద సినిమా వరకు కాకుండా, ‘పెద్ది’తోనే సమస్య పరిష్కారం కావాలని ఎగ్జిబిటర్టు పట్టుబట్టారు. దీంతో ఈ వివాదం చిరంజీవి గడపకు చేరింది. సోమవారం తెలంగాణ ఎగ్జిబిటర్స్, నిర్మాత కెఎల్ నారాయణ, అల్లు అరవింద్, ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు.. మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం ముగిసింది.
ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి.. చిత్ర పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని.. ఒక సినిమా గురించో, ఒక సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుందని అన్నారు. టాలీవుడ్‌కు హైయెస్ట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితమని తెలిపారు. ఒకసారి అందరినీ సంప్రదించి, పర్సెంటేజ్ మోడల్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఛాంబర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదని హితోబోధ చేశారు. ఇలాంటి ఘటనలతో ఇండస్ట్రీ ఒక్కటిగా లేదనే సందేశం ఇవ్వకూడదని తెలిపారు.
ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పని తీరు, ఫలితాల పట్ట సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్థమైందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే.. జూన్ 30వ తేదీ వరకూ, అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజ్ విధానంపై ప్రతిపాదనని చేస్తుందని తనకు నమ్మకం వుందని, ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు.
సమావేశం ముగిసిన అనంతరం నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు తెలంగాణ ఎగ్జిబిటర్స్, నిర్మాత కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, అల్లు అరవింద్, నేను.. మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యాము. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్స్ తమ సమస్యలు వివరించారు. అలాగే సబ్ కమిటీ నిర్ణయాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. రెండు మూడు రోజుల్లో ఛాంబర్ నుంచి అఫీషియల్‌గా పర్సంటేజ్‌పై తీసుకున్న నిర్ణయాలతో ప్రకటన వస్తుంది. ఇది ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన సమస్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య ఇది’’ అని తెలిపారు. ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిటర్స్ సమస్యలను చిరంజీవికి వివరించాం. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పడుతున్న సమస్యలు ఇన్ని ఉన్నాయా? అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి:
హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు
ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది: బాలకృష్ణ
10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?