రాజా రవీంద్రతో నేనే దాడి చేయించుకున్నా: కస్తూరి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:43 PM

సీనియర్ నటి కస్తూరి శంకర్ విలన్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kasthuri Shankar comments

సీనియర్ నటి కస్తూరి శంకర్ విలన్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar Comments) మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తాను మునుపెన్నడూ చేయని అత్యంత క్రూరమైన, దేనికీ మొహమాటపడని మెయిన్ విలన్ పాత్రను పోషించానని ఆమె వెల్లడించారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వేదికపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా సీనియర్ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra)తో తన మొదటి సినిమా అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ కస్తూరి నవ్వులు పూయించారు. ‘‘నాకు తెలుగులో మొదటి సినిమా ‘నిప్పురవ్వ’. అందులో నేను బాలకృష్ణ చెల్లెలిగా నటించగా, రాజా రవీంద్ర అమ్రీష్ పురి కొడుకుగా జూనియర్ విలన్ వేషం వేశారు. ఆ సినిమాలో నాపై ఆయన దాడి చేసే ఒక సన్నివేశం ఉంది. ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్న రాజా రవీంద్ర.. ఆ రోజు షూటింగ్‌లో నా దగ్గరకు రావడానికి భయంతో వణికిపోయారు. నాకు వేరే షూటింగ్ ఫ్లైట్ టైమ్ అయిపోతుంటే.. ‘ప్లీజ్ నన్ను పట్టుకోండి, సీన్ త్వరగా పూర్తి చేయండి’ అంటూ నా చీరకొంగుని అందిస్తూ.. మంచం చుట్టూ నేనే ఆయన్ను లాక్కొచ్చి మరి సీన్ చేయించాను. ఆయన అలా వణకడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ సరదాగా ఆటపట్టించారు.


ఇక తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ఏ హీరోకి అభిమాని అని నన్ను ఎవరు అడిగినా నేను ఒక్కరి పేరే చెప్తాను.. నేను ఎన్టీఆర్ గారికి వీరాభిమానిని. చిన్నతనంలో పెద్ద ఎన్టీఆర్ గారి ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిక్స్ చూసి పెరిగాను. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ సినిమా చూసి ఆయనకు వీరాభిమానిగా మారిపోయాను. ‘ఆది’లోని ‘తొలివలపే’ పాట అంటే నాకు ప్రాణం.. ఇప్పటికీ కాలిఫోర్నియాలో లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు ఆ పాటే వింటుంటాను’’ అని తన అభిమానాన్ని చాటుకున్నారు.


అంతేకాకుండా తెలుగు నేలపై తనకున్న ప్రేమని వివరిస్తూ.. ‘‘నేను మొదట తెలుగు భాషను ప్రేమించాను, ఆ తర్వాత ఒక తెలుగు అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఒక తెలుగు కోడలిగా ఇక్కడి ప్రజలు, ‘గృహలక్ష్మి’ సీరియల్ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది’’ అని కస్తూరి ఎమోషనల్ అయ్యారు. చిత్రంలో ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయని, కచ్చితంగా ఆయనకు మరో జాతీయ అవార్డు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

మలయాళ బాక్సాఫీస్.. ‘స్టార్ పవర్’ కాదు.. కంటెంటే కింగ్!

విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం..: జానీ మాస్టర్ వైఫ్

సందీప్ పిలిస్తే రాకపోతే బతికి దండగ..: విజయ్ దేవరకొండ

Updated Date - Aug 31 , 2026 | 06:44 PM