సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది: బాలకృష్ణ

ABN, Publish Date - May 24 , 2026 | 08:18 PM

ఆదివారం, విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న బాలకృష్ణ.. ఎఫ్‌డీసీని పూర్తిగా యాక్టీవ్ చేసి, సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్ద పీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Nandamuri Balakrishna

తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆకాంక్షించారు. ఆదివారం, విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న బాలకృష్ణ.. ఎఫ్‌డీసీని పూర్తిగా యాక్టీవ్ చేసి, సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్ద పీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో ‘థియేటర్లలో సినిమాలు లేక.. ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలి కలుగుతుంది’ అని అన్నారు.


ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్‌లు జరిగేలా అనుమతులు ఇస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ కృష్ణానది, దుర్గమ్మ గుడి, అరకు వ్యాలీ, అడవులు, జలపాతాలు ఇలా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సహజత్వం ఉట్టిపడేలా పలు ప్రాంతాలు.. షూటింగ్‌లకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక సినిమా షూటింగ్‌కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తాము. నందమూరి తారక రామారావు జన్మించిన కృష్ణా జిల్లా నుంచి ఈ కార్యచరణ ప్రకటించడం ఆనందంగా ఉంది. సభ్యులంతా సమన్వయంతో పని చేస్తూ.. వారి అనుభవంతో అభివృద్దిలో భాగస్వామ్యం కావాలి. ఎక్కడ షూటింగ్ జరిగినా.. పూర్తిగా సహకారం అందించాలని ప్రజలను కోరుతున్నాను. ప్రస్తుతం సినిమా ఎలా ఉందనే పరిస్థితి నుంచి సినిమాను బ్రతికించాలనే పరిస్థితికి వచ్చాం.


ఈ పరిస్థితులు పోవాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు చేయాలి. నా వరకు సందేశాత్మకంగా ఉండే చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను. టెక్నాలజీ లేని సమయంలోనే త్వరగా సినిమా షూటింగ్ పూర్తయ్యేది. నేడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతోంది. థియేటర్లలో సినిమాలు లేక.. ఎగ్జిబిటర్లు పరిస్థితి చూసి జాలేస్తోంది. మంచి కార్యాచరణతో చలన చిత్ర పరిశ్రమను అన్ని విధాలా కాపాడుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకారం అందించాలని కోరుతున్నాను. హైదరాబాద్ ఇప్పటికే సినీ పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఏపీలో కూడా తెలుగు సినిమా షూటింగ్‌లు జరిగేలా ప్రోత్సహిస్తాం. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగు సినిమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేలా అందరూ కలిసి పని చేయాలని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

జ‌స్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చ‌ర‌ణ్.. అసలు విషయమిదే!

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

Updated Date - May 24 , 2026 | 08:18 PM