Balakrishna Tollywood Strike: అందరూ బాగుండేలా చూస్తా
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:50 AM
సినీ కార్మికుల సమ్మె నిర్ణయంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు బుధవారం నందమూరి బాలకృష్ణను కలిశారు. ఈ సమావేశంలోని కీలక అంశాలను నిర్మాత ప్రసన్నకుమార్ మీడియాకు...
సినీ కార్మికుల సమ్మె నిర్ణయంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు బుధవారం నందమూరి బాలకృష్ణను కలిశారు. ఈ సమావేశంలోని కీలక అంశాలను నిర్మాత ప్రసన్నకుమార్ మీడియాకు తెలిపారు. ‘నిర్మాత బాగుండాలని బాలకృష్ణ ఎప్పుడూ చెబుతుంటారు. అదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. వర్కింగ్ డేస్ ఎంత ఎక్కువ అయితే అంత మంచిదన్నారు. అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలని సూచించారు. అటు నిర్మాతలు, ఇటు కార్మికులు అంతా బాగుండేలా తాను చూసుకుంటానన్నారు. థియేటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏడాదికి నాలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మాటిచ్చారు’ అని ప్రసన్నకుమార్ తెలిపారు.
రేపటితో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా: సి కల్యాణ్
నిర్మాత సి.కల్యాణ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. అనంతరం సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ పరిశ్రమలో ఏర్పడిన సమస్యలను సినిమా వాళ్లే పరిష్కరించుకున్నారు. ఒకప్పుడు దర్శకుడు దాసరి నారాయణరావు ఇలాంటి సమస్యలను పరిష్కరించేవారు. ఇప్పుడున్న సినీ ప్రముఖులు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. సినిమా వాళ్లకు ప్రభుత్వంతో పనిలేదు. టికెట్ల పెంపు కోసమే ప్రభుత్వాన్ని నిర్మాతలు సంప్రదిస్తారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదు. నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ కార్మికులకు టాలెంట్ లేదనడం కరెక్ట్ కాదు. రేపటిలోగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను’ అని సి.కల్యాణ్ పేర్కొన్నారు.
నాకు సినీ కార్మికులపై ఎలాంటి కోపం లేదు: విశ్వ ప్రసాద్
‘సినీ కార్మికులపై నాకు ఎలాంటి కోపం లేదు. నేను ఆవేశం, బాధతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. పరిశ్రమలో జరుగుతున్న వ్యవహారంపైనే మాట్లాడాను. ఒక్కరు చేయాల్సిన పనిని ఇరవై మంది చేస్తామనడం సమంజసం కాదు. టాలీవుడ్‌లో స్కిల్ వర్కర్స్‌కు లోటు ఉంది. నేనయితే స్కిల్ ఉన్న వారితోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. అయితే పరిశ్రమలో నా ఒక్కడి నిర్ణయం నడవదు కాబట్టి, అందరం కలసి ఓ నిర్ణయం తీసుకుంటాము’ అని నిర్మాత విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సమ్మెతో మాకు సంబంధం లేదు: వడ్డే కరుణాకర్ రెడ్డి
‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న సమ్మెకి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లో ఉన్న కార్మిక సంఘాలకు సంబంధం లేదు’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు వడ్డే కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఈ సమ్మె మా దృష్టికి రాలేదు. మా ఛాంబర్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో అనుసంధానమై ఉంది. చలనచిత్ర నిర్మాతల మండలితోనే కలిసి పని చేస్తాం. తెలంగాణ ఫెడరేషన్‌లోని వారు అన్ని విభాగాల్లోనూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వివాదాన్ని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్‌కు, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లాం’ అని అన్నారు.