బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్.. ఇది నటసింహం రేంజ్!

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:48 PM

‘బాహుబలి’ విడుదలైనప్పటి నుంచి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు మన సినిమాలు స్థానిక ఆడియన్స్‌కే పరిమితం అనుకునే రోజులు పోయాయి.

Balakrishna in Bhagavanth Kesari

‘బాహుబలి’ విడుదలైనప్పటి నుంచి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు మన సినిమాలు స్థానిక ఆడియన్స్‌కే పరిమితం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మన హీరోల స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మన పాటలు మార్మోగుతున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన ఒక విచిత్రమైన ఘటన చూస్తే.. టాలీవుడ్ రేంజ్ ఏకంగా గ్లోబల్ పాలిటిక్స్‌లోకి కూడా చేరిందా అనిపించక మానదు. నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)లో బాలయ్య చేసిన ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా సినిమా క్లిప్స్‌ను ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. కానీ ఈసారి ఏకంగా ఒక దేశ దౌత్య కార్యాలయం.. అగ్రరాజ్యం అధినేత వ్యాఖ్యలకు సమాధానంగా బాలయ్య యాక్షన్ సీన్‌ను వాడుకోవడం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.


ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ (Iran)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఇరాన్‌పై తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు, ఇప్పటికే ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేశామని, తదుపరి పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారమే రేపాయి. ట్రంప్ చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలపై జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే క్రమంలో.. ‘భగవంత్ కేసరి’ సినిమాలోని 58 సెకన్ల మాస్ ఫైట్ సీన్‌ను అధికారికంగా షేర్ చేసింది. ఆ పోస్టులో.. ‘ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయడం గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అయితే ఇరాన్ తనను తాను కాపాడుకోలేని నిస్సహాయ దేశం కాదనే సత్యం ఆయనకూ స్పష్టంగా తెలుసు. ఆ విషయం అర్థమైనప్పటి నుంచి.. వారు హాలీవుడ్ చూడటం మానేసి, భారతీయ సినిమాలను చూడటం మొదలుపెట్టారు’ అంటూ వ్యంగ్యంగా ట్రంప్‌కు చురకలంటించింది.


అయితే ఇరాన్ ఎంబసీ ఈ యాక్షన్ క్లిప్‌ను పోస్ట్ చేస్తూ, దానిని బాలీవుడ్ సినిమాగా పేర్కొంది. ఇంకేముంది.. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో మన తెలుగు సినీ ప్రేమికులు కామెంట్లతో హోరెత్తించారు. ఇది బాలీవుడ్ కాదు, పక్కా టాలీవుడ్.. అక్కడ ఉన్నది నందమూరి నటసింహం బాలకృష్ణ (Natasimham Nandamuri Balakrishna).. బాలయ్య మాస్ క్రేజ్ అంటే ఇదీ అంటూ కామెంట్లు పెట్టి సరిదిద్దారు. ఏదేమైనా ఒక అంతర్జాతీయ వివాదంలో పొలిటికల్ పంచ్‌గా మన తెలుగు సినిమా సీన్ నిలవడం విశేషం. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ఇలా గ్లోబల్ లెవల్లో ట్రెండ్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా?

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్

Updated Date - Sep 24 , 2026 | 05:48 PM