The Paradise Review : ది ప్యారడైజ్ మూవీ రివ్యూ
ABN , Publish Date - Sep 24 , 2026 | 09:51 AM
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్ లో 'దసరా' తర్వాత వచ్చిన సినిమా 'ది ప్యారడైజ్'. చెరుకూరి సుధాకర్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' ఎలా ఉందో తెలుసుకోండి.
అతి సర్వత్ర వర్జయేత్ అనే సుభాషితం ఒకటి ఉంది. కానీ కొందరు దానిని పట్టించుకోరు. అలాంటి వారు ప్రజల తిరస్కారానికి గురి కాక తప్పదు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు, వాటి కథ, కమామీషులను గమనిస్తే... ఈ సుభాషితమే గుర్తొస్తుంది. అతిగా చేసిన పనులు బెడిసికొట్టడమే కాదు... వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ ను కూడా కలగ చేశాయి. తాజాగా విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా జనం ముందుకొచ్చిన 'జడల్' విశ్వరూపం ఎలా ఉందో తెలుసుకుందాం.
ఇది దేశానికి స్వాతంత్రం వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా గుర్తింపుకు నోచుకోని ఐదు వేలమంది సవారీల కథ. హైదరాబాద్‌లోని దొరలు వాళ్ళతో దొంగసారా కాయించి, పబ్బం గడుపుకుంటారు తప్పితే... కనీసం వాళ్ళను మనుషులుగా చూడరు. వాళ్ళు వైద్యం, విద్య వంటి కనీస హక్కులకు కూడా నోచుకోరు. అలాంటి వారిని జాగృతం చేసి షికంజా మాలిక్ (మోహన్ బాబు) నుంచి విముక్తి కలిగించడానికి సమ్మక్క (సోనాలీ కులకర్ణి) నడుం కడుతుంది. మాలిక్ దాష్టికానికి, ఆమె కవలల పిల్లలను కంటే అందులో ఆడపిల్ల పురిటీలోనే కన్నుమూస్తుంది. దాంతో కొడుకునే కూతురిలా జడలు వేసి పెంచుతుంది. అతనే జడల్ (నాని)! అయితే తల్లి ప్రవర్తన సరైనది కాదని జనమంతా అంటుంటే... అదే నిజమని నమ్మి ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు జడల్. చిన్న వయసులోనే ఓ హత్య చేసి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలు నుంచి తిరిగి వచ్చినా... తన వాళ్ళ జీవితాలు మారలేదని తెలిసిన జడల్ వారి కోసం మాలిక్ తోనూ, అతని కొడుకు చోటా మాలిక్ తోనూ ఎలా తలపడ్డాడు? తన తల్లి త్యాగాన్ని ఎలా గుర్తించి, ఆమెను గౌరవించాడు? సవారీలు ఈ దేశంలో భాగమేననే గుర్తింపు తీసుకు రావడానికి ఏ రాజకీయ నాయకుడు నడుం బిగించాడు? అనేది 'ది ప్యారడైజ్' కథ.
దేశానికి స్వాతంత్రం వచ్చినా గుర్తింపు నోచుకోలేని వాళ్ళ కథలు ఈ మధ్య కాలంలో మనం చాలానే చూశాం. నిజానికి 'పెద్ది' సినిమా బేసిక్ పాయింట్ కూడా అదే. ఓ గ్రామం, ఆ గ్రామ వాసులకు సర్కార్ లెక్కల్లో చోటు దక్కకపోవడంతో అతను చేసే పోరాటం. అయితే అదే అంశాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో కోణంలో చెప్పాడు. తమపై అధికారం చెలాయించి, తమను బానిసలుగా చేసిన వారిపై పోరాటం చేసే క్రమంలో తుపాకీలు పట్టి, ఈ దేశమే తమది కాదని, తమది స్వతంత్ర దేశమని అనిపించాడు. ఆ ఐదువేల మందితో ఓ రాజ్యాన్నే స్థాపించాగలమనే పిచ్చి భ్రమను కల్పించాడు. దాంతో... ఓ సమూహపు గుర్తింపు పోరాటం కాస్తా... ప్రత్యేక దేశ ఏర్పాటుగా మారిపోయింది. అయితే ఆయుధాలతో ఇది సాధ్యం కాదు... సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలంటూ... ఓ ఎమ్మెల్యేను, ఆపైన అతని సలహాతో ఓ ముఖ్యమంత్రి పాత్రను రంగంలోకి దింపి ఈ సినిమాకు రాజకీయ రంగు పులిమాడు. ఈ పతాక సన్నివేశాన్ని చూస్తే తెలంగాణ రాజకీయ రంగంలో రెండు ప్రత్యర్థ పార్టీల నడుమ వైరం సృష్టించి, చలి కాచుకోవాలని దర్శకుడు చూశాడేమో అనిపిస్తుంది. కానీ సాధారణ ప్రేక్షకుడికి ఇవేవే బుర్రలోకెక్కవు. వాళ్ళు కొన్న టిక్కెట్ కు తగ్గ వినోదాన్ని మేకర్స్ ఇచ్చారా? లేదా? అనే చూస్తారు. ఆ విషయంలో 'ది ప్యారడైజ్' పూర్తిగా విఫలమైంది.

అస్తిత్వ పోరాట గాథలలో ఎమోషన్ ప్రధానం. అది ఏ మాత్రం అటూ ఇటూ అయినా... హాస్యాస్పదంగా మారిపోతుంది. ఎవరి కోసమైతే కథానాయకుడు పోరాడుతున్నాడో... దాని గురించి ప్రేక్షకులు పట్టించుకోకుండా... తెర మీద కనిపించే సన్నివేశాలనే బేరీజు వేయడం మొదలు పెడతారు. దాంతో హీరో చేసే రక్తపాతం తప్పితే, దాని వెనుక ఉన్న మోటో ఏమిటనేది వాళ్ళ బుర్రలోకి ఎక్కదు. ఈ కథ చెప్పడానికి ఇంత దారుణ మారణకాండ అవసరమా? అనిపిస్తుంది. పోనీ ఆ పోరాటానికి ఏమైనా సరైన ముగింపు పలికారా? అంటే అదీ లేదు. సింపుల్ గా ఓ సీఎంను ప్రవేశపెట్టి శుభం కార్డు వేసేశారు. ఇది చాలదన్నట్టు ఓ తల్లి, కూతురు కలిసి బీ గ్రేడ్ సినిమాలు తీసేసి, అప్పులు తీర్చేయొచ్చనే దర్శకుడి తెలివి తేటలకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయి.
నాని ఆలోచనలు ఎక్కడో ట్రాక్ తప్పుతున్నాయి. ఉన్న స్థానాన్ని దాటి ముందుకు వెళ్ళాలనుకోవడం ఎప్పటికీ తప్పుకాదు. సినిమా రంగంలో మరో మెట్టు పైకి వెళ్ళాలనే ఎవరైనా అనుకుంటారు. కానీ మాస్ హీరో ఇమేజ్ కోసం పడే తాపత్రయంలో అతను ఎంచుకునే కథలే అందరినీ ఒప్పించలేకపోతున్నాయి. పైగా అతనికి ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్ ను అవి అసంతృప్తికి గురి చేస్తున్నాయి. పొదల్లో ఉన్న పిట్ట కోసం చేతిలో ఉన్న పిట్టను వదులుకున్నట్టు అవుతోంది నాని పరిస్థితి. ఈ సినిమాలో జడల్ పాత్రకు అతను సంపూర్ణ న్యాయం చేశాడు. కానీ ఫలితం ఏమిటీ? ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇక కయాదు లోహర్ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తల్లిలానే ఆమె ప్రియురాలు కూడా అని హీరో అనుకోవడం కోసం ఆ పాత్రను మరీ దారుణంగా చిత్రీకరించారు. ఇందులో ప్రాధాన్యమున్న మరో రెండు పాత్రల్లో ఒకటి. జడల్ తల్లి సమ్మక్కగా నటించిన సోనాలి కులకర్ణిది. ఆమె తన పాత్రను చక్కగా పోషించింది, ఆమె స్నేహితురాలిగా నటించిన ఈశ్వరీరావు పాత్ర కూడా బాగానే ఉంది. మోహన్ బాబు ఇటీవల వచ్చిన 'శ్రీనివాస మంగాపురం'తో పూర్తిగా నిరాశ పర్చారు. అయితే దానికంటే బెటర్ క్యారెక్టర్ ఆయనకు దక్కింది. ఆయన కొడుకుగా నటించిన రాఘవ్ జుయల్ తెర మీద ఉన్నంత సేపు ఓ స్పెషల్ వైబ్ ను క్రియేట్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను తనికెళ్ళ భరణి, సంపూర్ణేశ్ బాబు, రాజా రవీంద్ర, రామ్ జగన్, సత్యరాజ్, సత్య ప్రకాశ్ తదితరులు పోషించారు. ఎమ్మెల్యే శంకరరావుగా ప్రియదర్శి కేసీఆర్‌ను సూపర్ గా ఇమిటేట్ చేశాడు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతంతో మూవీని మాగ్జిమమ్ లేపే ప్రయత్నం చేశాడు. అయితే పాటలు విడిగా చూసినప్పుడు ఇచ్చిన కిక్ సినిమాలో చూస్తే కలగలేదు. హీరో నానితో పాటు ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను పూర్తి స్థాయిలో నమ్మి ఈ సినిమా కోసం నూరు శాతం ఇచ్చారు. కానీ మేకర్స్ పడిన శ్రమకంటే... థియేటర్లో ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి పడిన కష్టమే ఎక్కువ! నిజానికి ఈ సినిమాకు 'ది ప్యారడైజ్' అని కాకుండా 'సమ్మక్క' అని పెట్టి ఉంటే సబబుగా ఉండేది. ఇంత హైప్ క్రియేట్ కాకపోను! ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జనాలు... ఏదో భిన్నమైన సినిమా చూశాం అని కొంతలో కొంత తృప్తి పడి ఉండేవారేమో! ఒకటి మాత్రం నిజం... ఈ సినిమాలోని పొలిటికల్ అంశాల కారణం, సెన్సార్ నిర్లిప్తత కారణంగా రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం.
రేటింగ్: 2.25/5
ట్యాగ్‌లైన్: ప్యారడైజ్: ద హెల్