సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య కీర్తన.. ఇది కదా తెలుగోడి పవర్ అంటే

ABN, Publish Date - Nov 28 , 2026 | 04:43 PM

స్విట్జర్లాండ్‌లో జరిగిన 2026 సోల్స్‌బర్గ్ ఫెస్టివల్‌లో భారతీయ సంగీత వైభవం ప్రపంచానికి పరిచయమైంది. గ్రామీ అవార్డు విజేత చాంటిక్లియర్ బృందం, వినీల్ గరిశ మహల్ నేతృత్వంలో అన్నమాచార్యుల బ్రహ్మమొక్కటే కీర్తనను ఆలపించింది. ఈ అద్భుత ప్రదర్శన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

600 Years Of Telugu Musical Legacy Echoes In Switzerland

అంతర్జాతీయ వేదికపై భారతదేశం గర్వించేలా అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామీ అవార్డు విజేత, ప్రఖ్యాత శాన్ ఫ్రాన్సిస్కో అకాపెల్లా సంగీత బృందం చాంటిక్లియర్ (Chanticleer) అంతర్జాతీయ వేదికపై భారతీయ సంగీత వైభవాన్ని, తెలుగు కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. స్విట్జర్లాండ్‌లోని రైన్‌ఫెల్డెన్ లో జరిగిన 2026 సోల్స్‌బర్గ్ ఫెస్టివల్ లో ఇండో-అమెరికన్ టెనర్ గాయకుడు వినీల్ గరిశ మహల్ (Vineel Garisa Mahal) లీడ్ వోకల్స్‌తో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన బ్రహ్మమొక్కటే (Brahmam Okate) కీర్తనను అద్భుతంగా ఆలపించారు. ఎలాంటి సంగీత వాయిద్యాల సహాయం లేకుండా కేవలం గాత్ర మాధుర్యంతోనే సాగిన ఈ ప్రదర్శన విదేశీ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసింది.


15వ శతాబ్దంలోనే అన్నమాచార్యులు రచించిన ఈ మహోన్నత భక్తి కీర్తన, కులమతాలు, వర్ణ భేదాలు, అంతస్తులకు అతీతంగా సకల ప్రాణులలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఒక్కటేననే గొప్ప సమతా భావాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ కీర్తన మరింత చేరువ కావడంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం అన్నమయ్యలో ఈ కీర్తనను పాటగా మలిచారు. అక్కినేని నాగార్జున నటన, ఎం.ఎం. కీరవాణి స్వరకల్పనలో సాగే ఆ పాట ఇప్పటికీ ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వ భావన యూరప్ వేదికపై అంతర్జాతీయ కళాకారుల గళంలో వినిపించడం విశేషం. జూన్ 29న జరిగిన ఈ లైవ్ ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపుతోంది.


ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ సంగీత వారసత్వాన్ని స్విట్జర్లాండ్ వేదికపైకి తీసుకెళ్లి, భారతదేశపు ఆధ్యాత్మిక లోతును ప్రపంచానికి పరిచయం చేశారంటూ సంగీత ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు భిన్న సంస్కృతుల మధ్య అందమైన సంగీత వారధిని నిర్మించారని కొనియాడుతున్నారు. వినీల్ గరిశ మహల్ స్వర మాధుర్యం, చాంటిక్లియర్ బృందం అందించిన అద్భుతమైన హార్మొనీ వినడానికి ఎంతో హృద్యంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 600 వందల ఏళ్ల క్రితం మన దేశంలో పుట్టిన సమతా సందేశం నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం భారతదేశానికి దక్కిన గొప్ప గౌరవమని, విదేశీ గడ్డపై ఈ కీర్తన వినిపించడం ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయుడికి గర్వకారణమని,ఇది కదా తెలుగోడి పవర్ అని నెటిజన్స్ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోని డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పోస్ట్ చేస్తూ.. ప్రశంసలు కురిపించాడు.

Also Read:

క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా

తెలుగు సినిమాల్లో డార్క్ హీరోయిజం.. ట్రెండ్ ఇదే కానీ..?

ఎన్టీఆర్, మహేష్, బన్నీ కాదు.. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ ఇదే

Updated Date - Nov 28 , 2026 | 04:43 PM