సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!

ABN, Publish Date - Jul 31 , 2026 | 08:17 PM

రామాయణ.. ఇండియన్ సినీ హిస్టరీలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సీత పాత్ర చేసిన సాయిపల్లవి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

Silver Screen Sita Stars

రామాయణ (Ramayana).. ఇండియన్ సినీ హిస్టరీలోనే అతిపెద్ద ప్రాజెక్ట్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ దృశ్యకావ్యంలో రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. అయితే, ఇటీవల విడుదలైన ‘రామాయణ’ ట్రైలర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీతాదేవి పాత్ర (Sita Devi Role)లో సాయి పల్లవి లుక్స్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సాయి పల్లవి ఈ పాత్రకు సూట్ కాలేదని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. సీతగా నేచురల్ బ్యూటీ పరిపూర్ణంగా సరిపోయారని మరికొందరు వాదిస్తున్నారు. చివరికి పక్కన ఉన్న చెలికత్తె పాత్రలతో పోలుస్తూ అర్థం లేని విమర్శలు కూడా చేస్తున్నారు.


నిజానికి సీతాదేవి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడం సామాన్యమైన విషయం కాదు. సాయి పల్లవి కంటే ముందు వెండితెరపై చాలా మంది నటీమణులు సీతగా నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 1963లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ ‘లవకుశ’ చిత్రాన్ని ఎవరూ మరచిపోలేరు. ఇందులో అంజలీదేవి (Anjali Devi) సీతాదేవిగా నటించి, ఆ పాత్రకే ప్రాణం పోశారు. ఈ సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రజలు అంజలీదేవిని కేవలం ఒక నటిగా చూడలేదు.. నిజమైన సీతాదేవిగానే భావించి పూజించారు. సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు రాముడిగా అలరించారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో చంద్రకళ సీతగా మెప్పించారు. ఇక 1976లో బాపు తెరకెక్కించిన ‘సీతాకల్యాణం’ చిత్రంలో జయప్రద సీతగా కనిపించారు. అప్పటికి జయప్రద చిత్రసీమలోకి వచ్చిన తొలి రోజులే అయినప్పటికీ, సీత పాత్రలో అద్భుతమైన పరిణతి చూపించారు. ఆమె ముఖంలోని అమాయకత్వం, సాత్వికమైన కళ సీత పాత్రకు జీవం పోశాయి.


కాలం మారుతున్న కొద్దీ సీతాదేవి పాత్ర రూపురేఖలు, నటీమణుల అభినయం కూడా ప్రేక్షక దేవుళ్లను అలరిస్తూనే వచ్చాయి. 2006లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’లో సీతాదేవిగా అర్చన నటించారు. అర్చన ముఖంలోని సౌమ్యత, చిరునవ్వు ఈ పాత్రకు ఎంతో చక్కగా సరిపోయాయి. సాంప్రదాయకమైన అలంకరణలో, పట్టువస్త్రాల్లో ఆమె కనిపిస్తే నిజంగా ఆ తల్లి దిగివచ్చిందా అనేంతగా ప్రేక్షకులు ఆదరించారు. ఇక 2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ ఒక పెద్ద మైలురాయి. ఇందులో సీతాదేవిగా నయనతార అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. నిజానికి అప్పటివరకు గ్లామర్ పాత్రలకు పేరుగాంచిన నయనతారను బాపు సీత పాత్రకు ఎంపిక చేసినప్పుడు మొదట్లో చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. సీతాదేవిగా నయన్ తప్ప మరొకరిని ఊహించుకోలేము అనే స్థాయిలో ఆమె మెప్పించారు. ఇక ఇటీవలి కాలానికి వస్తే.. 2023లో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ చిత్రంలో జానకి పాత్రలో కృతి సనన్ కనిపించారు. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో కృతి సనన్ లుక్స్ పై విడుదల కాకముందు, ఆ తర్వాత కూడా మిశ్రమ స్పందనలు వచ్చాయి.


ఇప్పుడు మళ్లీ నితీశ్ తివారీ ‘రామాయణ’తో సాయి పల్లవి రూపంలో సీతాదేవి పాత్ర వార్తల్లో నిలిచింది. ఎలాంటి మేకప్ లేకుండా సహజత్వంతో నటించే సాయి పల్లవికి ఈ పాత్ర దక్కడంపై ఎంత సందడి ఉందో, అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ప్రచారంలోకి వచ్చింది. గతంలో సీత పాత్ర పోషించిన వారితో సాయి పల్లవిని పోలుస్తూ.. ఆ పాత్రకు ఆమె సరైన న్యాయం చేయలేదంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కాకముందే, కేవలం ఒక ట్రైలర్ చూసి అర్థం లేని పోలికలతో రభస చేయడం సరికాదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సీతాదేవిలోని అమాయకత్వాన్ని, పవిత్రతను సాయి పల్లవి తన నటనతో ఏ స్థాయిలో పండిస్తారనేది వెండితెరపై చూశాకే ఒక ముగింపునకు రావడం మంచిదంటున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత పాత్ర ఎలా ఉంటుంది.. సాయి పల్లవి ఆ పాత్రతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా.. లేక ట్రోలింగ్‌కు గురవుతారా అనేది తెలియాలంటే దీపావళి వరకు ఎదురుచూడక తప్పదు.

ఇవి కూడా చదవండి:

బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!

సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

సంగీత ప్రపంచంలోనూ రాజకీయాలుంటాయని తెలిసొచ్చింది - గాయని జమునారాణి చివరి ఇంటర్వ్యూ

Updated Date - Jul 31 , 2026 | 08:17 PM