సంగీత ప్రపంచంలోనూ రాజకీయాలుంటాయని తెలిసొచ్చింది - గాయని జమునారాణి చివరి ఇంటర్వ్యూ
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:41 PM
మనం మరిచిపోయిన మంచి గాయనీ మణి జమునారాణి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆవిడెవరో తెలియకపోవచ్చు గానీ, ఒక తరాన్ని మాత్రం ఉర్రూతలూగించారామె. ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావా మావా’ పాట ఒక్కటి చాలు ఆమె ఎంత గొప్ప సింగరో అర్ధం కావడానికి.
మనం మరిచిపోయిన మంచి గాయనీ మణి జమునారాణి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆవిడెవరో తెలియకపోవచ్చు గానీ, ఒక తరాన్ని మాత్రం ఉర్రూతలూగించారామె. ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావా మావా’ పాట ఒక్కటి చాలు ఆమె ఎంత గొప్ప సింగరో అర్ధం కావడానికి. ‘ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం’, ‘నాగమల్లి కోనలోన’, ‘పద పదవే వయ్యారి గాలిపటమా’ వంటి ఎన్నో హుషారు పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జమునారాణి తన విశ్రాంత జీవితాన్ని బెంగళూరులో ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఆమెతో జరిపిన సుదీర్ఘ సంభాషణలో తన వ్యక్తిగత - వృత్తిపర జీవితం గురించి ప్రముఖ పాత్రికేయుడు పులగం చిన్నారాయణతో మనసు విప్పి మాట్లాడారు.
మీ తరం వాళ్లంతా చెన్నైలో స్థిరపడితే, మీరెందుకని బెంగళూరు వెళ్లిపోయారు?
నేను 2004లోనే బెంగళూరు వెళ్లిపోయాను. చెన్నైలో ఆస్తులన్నీ అమ్మేసి డబ్బులు బ్యాంకులో వేసుకుని, ఆ వడ్డీతో హాయిగా బతుకుతున్నా. ఇక నేను బెంగళూరు వెళ్లిపోవడానికి కారణం ఏంటంటే - నా మేనకోడళ్లు. వాళ్ళు అక్కడే ఉంటారు. మా అన్నయ్య, వదిన ఇపుడు లేరు. ఇక మిగిలింది వాళ్ల పిల్లలు. వాళ్లే ఇప్పుడు నా కుటుంబం.
అప్పుడెప్పుడో ‘నాయకుడు’లో పాడారు. మళ్లీ చాలా ఏళ్ల విరామం తర్వాత ఆ మధ్య ‘మిథునం’ సినిమాలో పాడారు. ఎందుకింత విరామం?
‘మిథునం’ కన్నా ముందు ‘వరుడు’లో కూడా పాడాను కానీ, అదంత పెద్ద పాట కాదు. కేవలం అది బిట్ సాంగ్. ఇక ఎందుకింత గ్యాప్ అంటే నేనేం చెప్పను. అడిగితే పాడేదాన్నేమో.
‘నాయకుడు’ సినిమా ముందు కూడా మీకు సుమారు 20 ఏళ్ల గ్యాప్ ఉన్నట్టుంది?
1970 వరకూ బాగా పాడాను. ఆ తర్వాత 17 ఏళ్ల గ్యాప్. మళ్లీ 1987లో ‘నాయకుడు’ కోసం పాడాను. దాదాపు పదేళ్లు నేను సింగర్ ననే విషయమే మర్చిపోయా. 1980 వరకూ సినిమా ఫీల్డ్‌లో ఎవర్నీ కలవలేదు. ఏ ప్రోగ్రామ్స్‌కీ వెళ్లను కూడా వెళ్లలేదు. పాత పాటల్ని, పాత తరాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారులే అనే భావన నాలో బాగా ఉండేది. అయితే సింగపూర్ వెళ్లొచ్చాక నా మైండ్ సెట్ మారింది.
సింగపూర్ ఎందుకు వెళ్లారు? అక్కడేం జరిగింది?
1981లో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కోసమని సింగపూర్ వెళ్లా. అక్కడే రెండు నెలలు ప్రోగ్రామ్స్ ఇచ్చా. అన్నీ తమిళ పాటలే. ముఖ్యంగా పాత పాటలకు ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో అప్పుడు నాకర్థమైంది. అప్పటి నుంచీ ఎవరు ప్రోగ్రామ్‌కు పిలిచినా వెళ్లసాగాను. 1983లో కేవీ మహదేవన్ గారితో కలిసి సింగపూర్, మలేసియాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చా. 1986లో శ్రీలంక, సింగపూర్, మలేసియాల్లో చాలా ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నా. అమల, మోహన్, వెన్నిరాడై మూర్తి, మణిమాల తదితరులతో కలిసి 1988లో లండన్, పారిస్, స్విట్జర్లాండ్ వెళ్లొచ్చా.
17 ఏళ్లు పాటకు దూరమైనప్పుడు మీరు డిప్రెస్ అయ్యారా?
అస్సల్లేదు. అప్పటివరకూ కెరీర్‌లో బిజీగా ఉండి, మా కుటుంబ సభ్యులతో సరిగ్గా గడపలేకపోయా. నాకు గ్యాప్ వచ్చే సమయానికి మా అన్నయ్య పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్లయిపోయారు. వాళ్లతో కలిసి సినిమాలూ షికార్లూ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేశా. పాటను వదిలేసి, ఫ్యామిలీతో ఎక్కువ ఎటాచ్మెంట్ పెంచుకున్నా.
అంటే... ఇంట్లో కూడా సరదాగా పాటలు పాడుకునేవారు కాదా?
లేదు. అసలు పాట ఊసే లేదు. ఎవరైనా రికార్డులు వినిపిస్తే వినడం తప్ప, పాట జోలికి వెళ్లలేదు. పిల్లలతో గడపడం వల్ల ఆ లోటు కూడా తెలియలేదు.
అసలు మీకు గ్యాప్ రావడానికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?
బయట ఉన్నట్టే, మా సంగీత ప్రపంచంలో కూడా రాజకీయాలు ఉంటాయని నాకు మెల్లిమెల్లిగా తెలిసొచ్చింది. ఫలానా సింగర్‌తోనే పాడించాలని సంగీత దర్శకుడు పట్టుపడితే, ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను వెంటబడి పాటలు అడిగే రకం కాదు. అవకాశమొస్తే పాడేదాన్ని.
అప్పట్లో అంత రాజకీయాలు ఉండేవా?
బాగా ఉండేవి. నన్ను తొక్కేసి, వేరే వాళ్లను పైకి తీసుకురావాలనుకున్నారు.
ఇంతకూ ఎవరా సంగీత దర్శకుడు?
ఆయన ఏదో ఒక కారణం చెప్పి నన్ను పక్కన పెట్టించే ప్రయత్నం చేశాడు.
అంతమంది సింగర్స్ ఉండగా, ఆయన మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేసినట్టు?
ఎందుకంటే ఆ రోజుల్లో హుషారు గీతాలు నేనొక్కదాన్నే పాడేదాన్ని. నన్ను పక్కన పెడితేనే కదా, ఆయనకు నచ్చిన వాళ్లతో పాడించుకునే అవకాశం వస్తుంది. అదే జరిగింది.
దర్శకులు కూడా ఏం చేయలేకపోయారా?
వాళ్లు మాత్రం ఏం చేయగలరు ? ఒకరి వెనుక ఒకరు ... అంతే.
మరి మిగతా సంగీత దర్శకుల పరిస్థితి ఏమిటి?
నేను 22 మంది సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడాను. అప్పట్లో ఇలాంటి రాజకీయాల్లేవు. పాటకు విలువ ఇచ్చేవారంతే. కానీ ఒకరిద్దరి వల్ల ఈ రాజకీయాలు మొదలయ్యాయి. వాళ్లకున్న సక్సెస్‌ని అడ్వాంటేజ్ తీసుకునేవారు.
సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉన్న మీకు, ‘నాయకుడు’ కోసం ఇళయరాజా పిలిచి పాట ఇచ్చినప్పుడు ఏమనిపించింది?
అంతకు ముందెప్పుడో ఓసారి ఇళయరాజాను కలిసినపుడు ‘ఎప్పుడూ కొత్త సింగర్సేనా? మాలాంటి పాత సింగర్స్‌తో కూడా పాడించొచ్చుగా?’ అని క్యాజువల్‌గా అడిగా. ‘పాడించకూడదనేం లేదమ్మా. అవకాశం వస్తే తప్పకుండా పాడిస్తా’ అని చెప్పారాయన. ఆ తర్వాత ఆయనే పిలిచి ‘నాయకుడు’లో పాట పాడమన్నారు. ‘‘మణిరత్నం ఈ సిట్యుయేషన్ చెప్పగానే నాకు మీతోనే పాడించాలనిపించింది. ‘దేవదాసు’లో ‘ఓ దేవదా!...’ పాట తరహాలో ఉంటుంది ఇది’’ అని ఇళయరాజా ముందే నాతో చెప్పారు. ఆయన ఎవ్వరికీ గౌరవం ఇవ్వడని చాలామంది భయపెట్టారు. కానీ నన్ను ఆయన బాగా చూసుకున్నారు. పాట గురించి చెప్పి, తనకు శ్రుతి ఎంతలో కావాలో వివరించారు. ఆర్కెస్ట్రాతోనే డైరెక్ట్‌గా నాతో పాడించేశారు. అన్నేళ్లు గ్యాప్ వచ్చినా ఏమాత్రం తొట్రుపాటు లేకుండా పాడారని నన్నాయన మెచ్చుకున్నారు కూడా.
ఆ పాట హిట్టయ్యాక కూడా మీకు ఆఫర్లు రాలేదా?
నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందరూ కొత్త సింగర్లు కావాలని అడుగుతుంటే, మా పాత సింగర్లను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.
ఆ పాటకు పారితోషికం ఎంత ఇచ్చారు?
మేం పాడే రోజుల్లో అయితే పాటకు 500, 1000 రూపాయలు ఇచ్చేవారు. ఈ పాట పాడినందుకు 3000 ఇచ్చారు.
అప్పట్లో పారితోషికాలు ఎగ్గొట్టడం లాంటివి ఉండేవా?
మా రోజుల్లో ఆన్ ది స్పాట్ పేమెంట్ పద్దతి లేదు. మేమే కారులో వెళ్లి డబ్బులు కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. నాలుగైదు సార్లు తిరిగితే తప్ప కొన్ని చోట్ల డబ్బులు వసూలయ్యేవి కావు. ఏవీయమ్, జెమినీలాంటి పెద్ద సంస్థలైతే... వాళ్లే ఇంటికి పారితోషికం పంపించేసేవారు.
ఓసారి మీ చిన్ననాటి రోజుల్లోకి వెళ్దాం. ఆ విశేషాలు చెప్పండి?
నేను పుట్టింది 1938 మే 17న. మా ఇంటి పేరు ‘కోకా’. మా పూర్వీకులంతా చెన్నైలోనే స్థిరపడిపోయారు. మేం తెలుగు వాళ్లమే అయినా, మా ఇంట్లో మాట్లాడే తెలుగు మాత్రం మద్రాసు యాసతో చాలా ఇబ్బందికరంగా ఉండేది. నాన్న పేరు వరదరాజులు నాయుడు, అమ్మ పేరు ద్రౌపది. షా వాలెస్‌లో పనిచేసేది.
మీ మదర్ మంచి సింగర్ అనుకుంటా. ఆమె సినిమాలకేమైనా పాడారా?
అమ్మకు వీణలో బాగా ప్రావీణ్యం ఉండేది. మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన సాంబమూర్తిగారు లేడీస్‌తో ఓ ఆర్కెస్ట్రా పెట్టి ఫెస్టివల్స్ టైమ్‌లో టెంపుల్స్ దగ్గర ప్రోగ్రామ్స్ చేయించేవారు. ఆ ఆర్కెస్ట్రాలో మా అమ్మ కూడా ఉన్నారు. అంతేకానీ అమ్మ ఎప్పుడూ సినిమా ఫీల్డ్‌కి రాలేదు. సినిమాలకు పాడలేదు. అమ్మకున్న ఆ సంగీత జ్ఞానం నాకు పెద్ద పునాది.
మీరు తొలి పాట పాడి, ఇప్పటికి 70 ఏళ్లు అవుతోంది కదూ!
అవును. నా ఏడేళ్ల వయసులో ‘త్యాగయ్య’ కోసం తొలిసారి పాడా.
అదేంటి... మీరు తొలిసారి పాడింది ‘తాశిల్దారు’ (1944)లో కదా?
నిజమే కానీ, అందులో టైటిల్స్‌లో నా పేరు వేయలేదు. అందుకే నేనెప్పుడూ ఆ సినిమా మెన్షన్ చేయను. నా పేరుకు బదులు, ఆ పాటలో నటించిన బేబీ కమలకుమారి అని వేశారు. దాంతో అమ్మకు కోపం వచ్చింది. మా దగ్గర చాలా బాధపడిపోయింది కూడా. ‘‘వాళ్లు పేరు వేయలేదు కాబట్టి, నువ్వు అస్సలు దాని గురించి చెప్పుకోవద్దు. నీ ఫస్ట్ సినిమా ‘త్యాగయ్య’ అనే చెప్పు’’ అని అమ్మ నా దగ్గర ప్రామిస్ తీసుకుంది.
ఇంతకూ ‘తాశిల్దారు’లో ‘ఆహా! ఏమందునే చిన వదినా’ పాట పాడే అవకాశం ఎలా వచ్చింది?
మా బంధువులెవరికో సంగీత దర్శకుడు పద్మనాభశాస్త్రి తెలిసినవారు. ఆ రీతిగా నాకు అవకాశం వచ్చిందట. ‘త్యాగయ్య’ (1946)కు మాత్రం ‘భరణీ’ రామకృష్ణగారి ద్వారా వచ్చింది.
అది ఎలా జరిగింది?
రామానుజులురావు నాయుడు గారని మా అమ్మకు మేనమామ ఉన్నారు. ఆయనా, ‘భరణీ’ రామకృష్ణగారూ కాలేజీ రోజుల నాటి స్నేహితులు. ‘త్యాగయ్య’కు నాగయ్యగారి దగ్గర రామకృష్ణగారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసేవారు. ‘మధురానగరిలో’ పాటలో చిన్న పిల్ల వాయిస్ కావాలని రామకృష్ణగారు చెబితే, రామానుజరావు నాయుడుగారు నన్ను పంపించారు. నాగయ్యగారు నాకు టెస్ట్ కూడా పెట్టలేదు. ఆ పాటకు నాతో నెలరోజులు ప్రాక్టీస్ చేయించారు. అప్పుడే ఘంటసాలగారిని కలిశాను. ఆయనకప్పుడు బిగినింగ్ స్టేజ్. ఊరి నుంచి కొత్తగా మద్రాసు వచ్చి, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
‘రత్నమాల’లో రెండు పాటలు పాడటమే కాకుండా, నటించినట్టున్నారు?
రామకృష్ణగారి వల్ల భానుమతిగారు కూడా మా కుటుంబానికి క్లోజ్ అయ్యారు. ఎక్కడకు వెళ్లినా నన్ను వెంట తీసుకువెళ్లేవారామె. అప్పుడే ‘రత్నమాల’లో రెండు పాటలు నాతో పాడించారు. ఒకటేమో ‘వగలాడి నిను చేరుతా’, మరొకటి ‘పోయిరా మా తల్లి’. ‘వగలాడి నిను చేరుతా’ పాట చిత్రీకరిస్తున్నప్పుడు లిప్ మూమెంట్ ఎవ్వరూ సరిగ్గా ఇవ్వకపోయేసరికి, భానుమతిగారు నాకు పావడా కట్టించి ఆ పాటలో నిలబెట్టించారు. నాకేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అలా తెలియకుండానే అందులో నటించేశానన్నమాట. ఆ తర్వాత మళ్లీ నటించలేదు. ఆ ఒక్కసారి కూడా కేవలం భానుమతిగారి వల్ల. ఆవిడకు నేనంటే ఇష్టం. నన్ను ఒక బిడ్డను చూసుకున్నట్టు చూసుకునేది. ఆవిడ దగ్గర ‘లైలా మజ్ను’, ‘ప్రేమ’ సినిమాల్లో పాడాను. ఆమె అడిగితే చివరకు ‘కోరస్’ కూడా పాడేసేదాన్ని. ‘కోరస్’లా కాదు! నాకు ఆవిడతో పాడాలని అంతే! ‘లైలామజ్ఞు’లో ‘అందాల చిన్నదానను’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
మీరు పెద్దయ్యాక ఫస్ట్ పాడింది ‘శివగంగ’ కదూ?
1947లో నటుడు సీఎస్సార్ తీసిన ‘శివగంగ’లో పాడాను కానీ, ఆ సినిమా విడుదల కాలేదు. ‘శివగంగ’లో నేను పాడిన విషయం తెలిసి, ‘ద్రోహి’లో నాతో మంచి పాటలు పాడించారు. 1947లో నటుడు సీఎస్సార్ ‘శివగంగ’ అనే సినిమా మొదలుపెట్టారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకులు. అందులో నాతో పాడించారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత పెండ్యాల ‘ద్రోహి’ (1948) సినిమాకు పిలిపించి ‘ఆలకించండి బాబూ, ఆదరించండి’, ‘ఎందుకీ బ్రతుకు?’, ‘ఓహో రాజా’ పాటలతో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. అయితే అప్పట్లో హీరోయిన్లే పాటలు పాడుకునేవారు. నేపథ్యగానం కొత్తగా మొదలైంది. అందుకే చాలా కాలం పాటు గ్రామఫోన్ రికార్డుల మీద నా పేరు వచ్చేది కాదు. హీరోయిన్ పేరో, వాళ్ల పాత్ర పేరో వచ్చేది.
మరి మీ ఫస్ట్ సినిమా ఏమని చెప్తారు?
మోడ్రన్ థియేటర్స్ వాళ్లవి. తమిళం, తెలుగు రెండూ. అత్తింటి కాపురం, కల్యాణి, షావుకారి జానకితో ఒక సినిమా, సవతిపోరు. అంతా హిందీ లతామంగేష్కర్ పాటలు కాపీ పెట్టి దక్షిణామూర్తిగారు మ్యూజిక్. మనం పాటలు పాటలు పాడి మనం పేరు వేయకుంటే లాభం లేదని మోడ్రన్ థియేటర్స్‌కి అప్లికేషన్ పెట్టారు. మైక్ టెస్ట్‌గా వెళ్లాను. పాటలు పాడి నా పేరు ఉంటే కదా ఎవరికైనా తెలియటానికి. ఇలా పాడే అమ్మాయి ఉంది అని ఆ ఎంకరేజ్మెంట్ లేదు. మనం ముందుకెళ్లడానికి చాన్స్ లేదు. అంతా పేర్లు వేయకుండా నొక్కేస్తున్నారు. ఎందుకంటే హీరోయిన్స్ డామినేషన్. మ్యూజిక్ డైరెక్టర్ రామ్‌నాథ్ ఆయనే టెస్ట్ చేసింది. ఫస్ట్ క్లీన్‌గా ఉంది వాయిస్. ఈ అమ్మాయిని పర్మినెంట్‌గా పెట్టుకోండి అన్నారు. రెండేళ్లు పర్మినెంట్ అక్కడ. అన్ని పిక్చర్స్ వాళ్లవి పాడాను. పాడని పిక్చర్స్ లేదు. వాళ్ల నాకు ‘సినర్జ్’ ఎంకరేజ్ చేశారు. సినాలీ పీపుల్ వచ్చినప్పుడు టి.వి. సుందరం గారు నా ఆర్టిస్ట్ పాడాల్సిందే. వాళ్లతో కూడా పాడాను. అక్కడి నుంచే నాకు మంచి పేరు వచ్చింది. కన్నదాసన్ అని అక్కడ అన్ని పాటలు ఆయనే రాయటం. మోడ్రన్ థియేటర్స్‌లో. ఆయన మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. తర్వాత ‘గులేబకావళి’ పిక్చర్స్ తీసేటప్పుడు డ్రంకర్ సాంగ్ పాడటానికి సెక్సీ వాయిస్ కావాలి ఎవరున్నారు అన్నప్పుడు ఇంకో హీరోయిన్‌కి ‘లీల’ పాడుతుంది. జిక్కి ఇంకో హీరోయిన్‌కి పాడుతుంది. సుశీల ఇంకా రాలేదు. అప్పుడు కన్నదాసన్ గారు డ్రంకర్ సాంగ్‌కి ఇంట్రడ్యూస్ చేశారు. విశ్వనాథన్-రామ్‌మూర్తి అప్పుడే ఉన్నారు ఆరెస్ట్రాలో. సుబ్బరామన్ చనిపోయి చాన్స్ వస్తుందా అన్న లెవెల్‌గా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్లు. కన్నదాసన్ గారు పట్టుపట్టి చిన్న టేప్ రికార్డర్లో వెక్కిళ్లతో సాంగ్ రికార్డ్ చేయించారు. కానీ రికార్డింగ్ అయ్యేటప్పుడు నేను పాడుతుంటే విశ్వనాథన్ వచ్చి పాడుతూ వెక్కిళ్లు నువ్వే ఇస్తుంటే అది మరీ కష్టమవుతుంది. నాకు మెయిన్ పాట బాగా రావాలి. అని చెప్పి, కోరస్ పాడుతున్న ఎల్. ఆర్. ఈశ్వరిని వెక్కిళ్లు ఇవ్వమని నాతో పాట పాడించారు. అప్పటి నుంచి ఎన్నో పాటలు పాడాను. తర్వాత తెలుగు కూడా అటూ ఇటూగా ఉంటుంది. పెద్దగా తెలుగు ఆఫర్స్ రాలేదు. తమిళ్ పాడుతున్నాను. మహదేవన్‌గారి వల్ల ‘మావా-మావా’, ‘మక్కు మీద కోపం’ పాడేటప్పటికి తెలుగులో అందరూ పిలవడం మొదలుపెట్టారు. అలాగే పాడాను. లాస్ట్‌లో బ్రేక్ వచ్చింది.
సింహళ భాషలో ఎన్ని పాటలు పాడారు?
వంద వరకూ పాడి ఉంటాను. మోడ్రన్ థియేటర్స్‌లోనే. సింహళ భాషా చిత్రాల షూటింగ్స్ జరిగేవి. ఓ పది సినిమాలు షూటింగ్ జరిగితే, ఆ పది సినిమాలకూ పూర్తిగా నేనే పాడాను. శ్రీలంక వెళ్లి పాడింది లేదు. విశేషమేంటంటే ఆ పాటలు ఇవాల్టికీ అక్కడ పాపులరే. అందుకే ఆ మధ్య నన్ను అక్కడకు ఆహ్వానించి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చారు. ఆ సమయంలో నేను వేదిక మీద అన్నీ సింహళం పాటలే పాడాను. అందరూ ఎంత ఆనందపడ్డారో. అప్పుడు నాతో పాటలు పాడించిన వాళ్లెవరూ ఇప్పుడు లేరు. వాళ్ల పిల్లలు వచ్చారు.
మీకు సింహళ భాష తెలుసా?
తెలీదు. తెలుగులో రాసుకోవాల్సిందే! అంతా తెలుగులో రాసుకుని పాడేదాన్ని.
వేరే భాషల్లో ఏమైనా పాడారా?
కన్నడంలో పాడాను. కానీ, చాలా తక్కువే. బి.ఆర్.పంతులుగారు, డి.ఎస్. రంగా, నాగేంద్రరావుల సినిమాల్లో పాడాను. అయితే అవి ఏమిటనేవి నాకు గుర్తు లేవు.
మరి హిందీలో?
హిందీలో డైరెక్టుగా పాడలేదు కానీ, ‘గులేబకావళి’ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసినప్పుడు పాడానంతే. మలయాళంలో పి. దక్షిణామూర్తి వాళ్లందరి దగ్గర పాడాను. ఆ రోజుల్లో నేను పాడిన పాటలన్నీ హిట్టే.
అన్ని భాషలూ కలిపి మొత్తం ఎన్ని పాటలు పాడి ఉంటారు?
6000 వరకు ఉంటాయి. అందులో 75 శాతం తమిళ పాటలే ఉంటాయి. తెలుగు కన్నా తమిళంలోనే ఎక్కువ పాడాను. తెలుగులో తక్కువ పాడినా అన్నీ హిట్లే.
తెలుగు అమ్మాయి అయి, తమిళ పాటలు పాడుతుంటే బాధ అనిపించేదా?
అలా ఏం లేదు. ఎక్కడైనా పాట పాటే కదా! ఇక్కడ నాకు పూర్తి స్థాయిలో అవకాశాలు రాలేదు. ‘మూగ మనసులు’లో మొత్తం పాటలు నేనే పాడాలి. చివరకు ‘ముక్కు మీద కోపం’ పాట ఒక్కటే పాడించారు ఏం చేస్తాం?
కేవీ మహదేవన్ మీకు మంచి లిఫ్ట్ ఇచ్చారు కదా?
అవును. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్ని పాటలు పాడానో గుర్తు లేదు. కానీ, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన అన్ని సినిమాల్లోనూ నాకో పాట కంపల్సరీ. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ఆయన దగ్గర పాడాను.
ఆయన వర్కింగ్ స్టయిల్ ఎలా ఉండేది?
చాలా బావుండేది. పాటలకు, మనుషులకు ఆయన ఎంత విలువ ఇచ్చేవారో. ఆయన నాకు పేపర్ ఇచ్చేసి, మైక్ దగ్గర నిలబడు అనేవారు. అంటే నా మీద అంత కాన్ఫిడెన్స్ ఆయనకు. నే చెప్పినట్లే పాడు అనేవారు కాదు. ఇలా పాడతానంటే ఒప్పుకునేవారు. ఆయన దగ్గర చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు.
‘మంచి మనుషులు’లో ‘మావా-మావా’ పాట అవకాశం ఎలా వచ్చింది?
తమిళం వెర్షన్ ‘కుముదం’లో ఈ పాటను గాయకుడు టి.ఎం. సౌందర్ రాజన్ వేరే సింగర్ పాడిద్దామని సలహా ఇచ్చారట. కానీ కేవీ మహదేవన్, నిర్మాత టీఆర్ సుందరం అస్సలు ఒప్పుకోలేదు. ఈ పాట జమునా రాణీయే పాడాలి అని నన్ను పిలిపించారు. నాకు వాళ్లు ఇలా పాడాలని ఏమీ చెప్పలేదు. నేనే ఒక స్టయిల్ అనుకుని పాడేశాను. వాళ్లకు తెగ నచ్చేసింది. నన్ను ఎంత అభినందించేశారో!
మావా-మావా అలానే పాడాలని మీకెందుకనిపించింది?
ఏమో అలా అనిపించి, పాడేశాను. ‘నాగమల్లి కోసలోన’ పాట కూడా అంతే. సంగీత దర్శకుడు కోదండపాణి కూడా నాకిలా పాడమని చెప్పలేదు. ఒక్కోసారి మనం పాడే స్టయిల్ వల్ల కూడా పాట హిట్టవుతుంది.
‘కుముదం’లో ఆ పాట ఒక్కటే పాడారా? ఇంకేమైనా పాడారా?
ఒక్కటే. మిగతావన్నీ సుశీల పాడారు. ఆ రోజుల్లో ఫస్ట్ హీరోయిన్‌కు సుశీల పాడితే, సెకండ్ హీరోయిన్‌కు నేను పాడేదాన్ని. అలాగే మా ఇద్దరికీ కలిసి వచ్చింది.

మెయిన్ హీరోయిన్‌కు పాడాలి అని ఎప్పుడూ అనుకోలేదా?
నా పాట మెయిన్ హీరోయిన్స్‌కు రాదు. రాణీ సంయుక్త అని పద్మిని, మహదేవన్ గారిది. చిత్ర చిత్ర పెళ్లెనిది అని ఒక పాట న్యాయంగా సుశీల పాడాలి. ఆ టైమ్‌కి ఈ పాట జమున పాడితే బావుంటుందన్న ఐడియాతో నన్ను పిలిపించి పాడించారు. బాగా హిట్ అయ్యింది. అలాగే మహాదేవి అని తమిళ పిక్చర్ సావిత్రిగారిది. ఒక జైల్ పాట రావడం అనేది ఫేట్. అది హీరోయినా, సపోర్ట్ అంతా రాదు. పాట ట్యూన్ బట్టి కంపోజ్ చేసినప్పుడు వాళ్లకి ఫ్లాష్ అవుతుంది. జమునారాణి పాడితే బావుంటుందే అని. ‘ఉషా పరిణయం’లో హీరోయిన్ జమునకు పాడాను. హీరోయిన్‌కి పాడినవి చాలా ఉన్నాయి. కానీ నాకు గుర్తులేదు. ఆయనకు ఆరోగ్యం పాడయ్యింది. తర్వాత పిక్చర్స్ ఏమీ పెట్టుకోలేదు. ‘శంకరాభరణం’ తర్వాత ఆయనకు హెల్త్ బాగా పాడయింది. ఆయన చాలా కష్టపడ్డారు. తర్వాత ‘బండరాముడు’లో సావిత్రికి పాడాను. ఎస్. దక్షిణామూర్తి పాడించినవి కొన్ని హీరోయిన్ పాటలే ఉంటాయి. మీనాకుమారికి హైలో హైలెస్సా ఇలా కొన్ని సపోర్టింగ్ సిట్యుయేషన్ బట్టి అలా వస్తాయి.
సంగీత దర్శకత్వం చేయమని మిమ్మల్ని ఎవరూ అడగలేదా?
అడగలేదు.. నేను కూడా అనుకోలేదు.
‘మిథునం’లో పాడమని మిమ్మల్ని ఎవరు అడిగారు?
సంగీత దర్శకుడు వీణాపాణి ఫోన్ చేసి ఈ పాట గురించి అడిగితే, నేను ఆసక్తి చూపించలేదు. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి పాడాక, మీకు నచ్చకపోతే ఇబ్బంది కదా అని చెప్పాను. దాంతో వాళ్లే బెంగళూరు వచ్చేశారు. అప్పుడు తెలిసింది దానిని తనికెళ్ల భరణి దర్శకులని. మీరెలా పాడినా ఫర్వాలేదని చెప్పి పాడించారు.
మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?
పాటల్లో పడి పెళ్లి గురించి ఆలోచించలేదు. అప్పటికే 35 ఏళ్లు వచ్చేశాయి. మా అన్నయ్యతో నాకు ఎటాచ్మెంట్ ఎక్కువ. తనను వదిలి నేను ఉండలేను. నన్ను వదిలి తను ఉండలేడు.
మీరు ఎంతమంది సంతానం?
అన్నయ్య, నేను అంతే. కానీ నాకు ఆఫర్స్ ఉండి ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడే వాడికి పెళ్లి చేశాము. ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ నన్ను వదలరు. రికార్డింగ్స్‌కి వెళ్లినా కూడా నాతో పాటు వచ్చి ఒక పక్కన కూర్చునేవారు. ‘వరకట్నం’ సినిమా. టి.వి. రాజుగారు పాడిస్తున్నారు. చిన్నపిల్లలు నన్ను వదలరు, ఏమీ మాట్లాడరు అంటే... గంట రికార్డింగ్ అయ్యేవరకు లేవలేదు. అలాంటి మంచి పిల్లలు. ఇంత అటాచ్మెంట్ అని ఆయన ఆశ్చర్యపోయారు. మా అన్నయ్య పెళ్లికి ముందే మా చెల్లెల్ని వదిలి నేను ఉండలేను అని వదినతో చెప్పారు. నేను కూడా అలాగే ఉంటే మా అన్నయ్య దగ్గరే ఉంటానని అన్నాను. పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ పెరిగాక నాకు పెళ్లి చేసుకోవాలనే ఇంట్రస్ట్ లేకుండా పోయింది. రెండోది.. నా కో-సింగర్స్ జీవితాలు చూస్తుంటే ఏం జరుగుతుంది? ఎలా కష్టాలు పడుతున్నారు? ఆఖరి వరకూ కలిసే ఉంటారా? డివోర్స్ అవుతాయా...? ఇలాగ. అప్పట్లో కో-సింగర్స్ ఆరుగురం ఉండేవాళ్లం. బాలసరస్వతి, లీల, జిక్కి, నేను. అలా ఉన్న వాళ్లలో చేసుకున్న వాళ్లదంతా అదే పరిస్థితి. సంబంధాలు ఎన్నో వచ్చినా రిజెక్ట్ చేశాను. నన్ను చేసుకుంటానని వెనుకబడ్డ వాళ్లు ఎందరో. అందరికీ గుడ్ బై చెప్పేశాను.
సింగర్స్ ఎవరూ ఆఫర్ చేయలేదా?
లేదు. అందరూ గౌరవస్తులే. మాధవపెద్ది సత్యం తదితరులంతా నన్ను ఒక సిస్టర్‌లా చూసుకునేవారు. చుట్టూ చాలామంది అవస్థలు చూసి, ఇవన్నీ చూసి మనం పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకుని అన్నయ్య దగ్గరకి వచ్చేకంటే ఇదే బెటర్ అనుకున్నా.
మిమ్మల్ని పెళ్లి చేసుకోమని మీ అన్నయ్య ఎప్పుడూ మీపై ఒత్తిడి చేయలేదా?
వాళ్లు చెప్పే పద్ధతిలో చెప్పేవారు. నన్ను ఒప్పించలేకపోయారు. మా మదర్‌కి కూడా ఒకే మాట చెప్పాను. నేను పెళ్లి చేసుకుని అవస్థ పడేకంటే ఇలా ఉండిపోవడం బెటర్ అని. నాకు తోడు ఉంది. అన్నయ్య నన్ను వదలడు. పిల్లలు అసలే వదలరు. ఆ నమ్మకం నాకుంది.
మీ అన్నయ్యకు ఎంత మంది పిల్లలు?
ఇద్దరు ఆడపిల్లలు. ఒక మగ పిల్లాడు. వాడు ఇప్పుడు యూఎస్‌లో సెటిల్ అయ్యాడు. ఎమ్.ఎస్. చేశాడు. ఇద్దరు ఆడపిల్లలూ బెంగళూరులోనే ఉంటారు. నా కన్నపిల్లలు కూడా అంత బాగా చూసుకోరేమో. నన్ను చాలా బాగా చూసుకుంటారు.
అందరికీ పెళ్లిళ్లు అయ్యాయా?
అందరికీ అయ్యాయి. వాళ్ల పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. అందరూ ఒకటిగానే ఉంటారు. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్లకు వాళ్ల తల్లితోనే ఎటాచ్మెంట్ లేదు. చిన్నప్పటి నుంచీ నన్ను తల్లిగానే భావిస్తారు.
మీ అన్నయ్య, వదిన ఉన్నారా?
లేరు. మా అన్నయ్య 2000లో పోయాడు. వదిన 2007లో చనిపోయింది. అన్నయ్య పోయాక నేను, వదిన 2004లో పిల్లల దగ్గరకు బెంగళూరు వచ్చేశాం. యూఎస్ వెళ్లినా 6 నెలలకు మించి ఉండలేం. వాడు బెంగళూరులో ఫ్లాట్ కొన్నాడు. నన్ను అంతా డిస్పోజ్ చేసి బ్యాంక్‌లో వేసెయ్యమన్నాడు. వచ్చి పిల్లల దగ్గర ఉన్నాం. బాగా చూసుకుంటున్నారు.
మీ వారసత్వం కొనసాగించే వాళ్లు ఎవరైనా ఉన్నారా?
అందరూ చదువుకొని, జాబ్స్ చేసుకుని హాయిగా హౌస్‌వైఫ్‌గా ఉన్నారు. వాళ్లని ఇటు పక్క రానివ్వలేదు. వాళ్లు రారు.
మీరు సింగర్ అయ్యాక మీ మదర్ కెరీర్ ఏ విధంగా చూశారు?
నా పాట వినడానికి మాకు చెప్పకుండా థియేటర్‌కి వెళ్లిపోయేది. ఎందుకు తర్వాత విందాంలే అంటే.. “అదంతా నాకొద్దు. ఫస్ట్ డే నేను ఆ పాట వినాలి’’ అని పరుగెత్తేది. నేను పైకి రావాలనేది ఆవిడ యాంబిషన్ కదా! నా పేరు, ప్రతిష్టలు ఆవిడ అన్నీ చూసి పోయిందావిడ. ఆవిడ 1977లో మరణించారు.
తమిళ్‌లో ‘కలైమామణి’ ఒకటే అవార్డ్ ఇచ్చారా?
‘కలైమామణి, ఆరింజన్ అన్న స్టేట్ అవార్డు, మొన్న రేడియో మిర్చి, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు.. 100 ఏళ్ల సినిమా ఫంక్షన్‌కి నా సర్వీస్‌కి జయలలితగారు ఇచ్చారు.
తెలుగు వాళ్లు ఇచ్చిన పురస్కారాలేమైనా ఉన్నాయా?
ఏమీ లేవు. శ్రీలంకలో లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు ఇచ్చారు.
శ్రీలంకలో గవర్నమెంట్ వారు ఇచ్చారా?
గవర్నమెంట్ ద్వారా రాజపక్సే ఇచ్చారు. ప్రెసిడెంట్, ప్రధానమంత్రి భార్య, వాళ్లతో పాటే నేను వెళ్లడం, రెడ్ కార్పెట్ వేసి నాకు చాలా గౌరవం ఇచ్చారు. మినిస్టర్‌కి ఇచ్చినట్లు ఇచ్చారు.
మీ కెరీర్ మీకు సంతృప్తేనా?
అవును కదా మరి! ఇంతకంటే ఏంటి. వంశీరామరాజుగారు ద్వారా ఉగాది పురస్కారం, సంజయ్ కిశోర్ గారు కొన్ని ప్రోగ్రామ్స్‌కి ముందు పెట్టి జమునారాణిగారు ఇంకా ఉన్నారు అని చూపిస్తారు. ఇంతకంటే అవార్డ్స్ ఏమీ అక్కరలేదు.
భానుమతిగారితో చివరి వరకు మీ అసోసియేషన్ కొనసాగిందా?
లేదు. తగ్గింది. కొంచెం నేను ఫీల్డ్‌లో బాగా వచ్చాక పెద్దగా ఆవిడతో టచ్‌లో లేను.
భానుమతి, రామకృష్ణల పెళ్లి మీ మదర్ వాళ్లు చేశారా?
రామానుజ నాయుడుగారని మా మదర్ మేనమామ. వాళ్లు ఫ్రెండ్స్. మొదట్లో భానుమతి వాళ్ల తండ్రిగారు ఒప్పుకోలేదు. మద్రాసు, వాల్ టాక్స్ రోడ్లో భైరాగిమఠం అని గుడి ఉంది. అప్పుడు మేము జాక్ టౌన్‌లో ఉండేవాళ్లం. చాలా చిన్నపిల్లని నేను. మా మదర్ అందరు కలిసి పెళ్లి సరంజామా తెచ్చి పెళ్లి చేశారు. రిసెప్షన్ ఎక్కడ జరిగిందో తెలీదు. మా పెద్దమ్మ, మా అమ్మ, రామానుజ నాయుడుగారు అందరూ కలిసి పెళ్లి చేయడం మాత్రం తెలుసు. ఆ అభిమానం రామకృష్ణగారికి ఎప్పుడూ ఉంది. నన్ను తన బిడ్డలాగ చూసుకునేవారు.
మీ అన్నయ్యది రియల్ ఎస్టేట్ బిజినెస్సా?
మా అన్నయ్య ఫ్లాట్స్ ప్రమోటర్. ఆయన కట్టిన ఇళ్లలో నేను ఉండి రాజశ్రీకి రెండు ఇళ్లు అమ్మాను. ఒక్కొక్క డిజైన్ వస్తుంటే అందులో ఉండాలని నా కోరిక. మా అన్నయ్య నా కోరిక తీర్చేవాడు. లాండ్‌లో ఇల్లు కట్టడం తర్వాత అమ్మేయడం, మళ్లీ స్థలం కొనడం ఇల్లు కట్టడం ఇలాగ. రామానాయుడుగారు ఉండేవారు. విద్యావతి హైస్కూల్ అని దానికి ఎదురుగా నా ఇల్లు. ఆ రోజుల్లో స్థలం 20 వేలు, 25 వేలు. లక్ష రూపాయలు ఇస్తే నాలుగు అంతస్తులు వచ్చేసేది. 10 వేలకు 3 అంతస్తులు, 60 వేలకు ఒక పెద్ద బంగళా... అలా ఉండేవి ఆ రోజులు. ఇప్పుడు ఇమేజిన్ చేయలేదు.
అవన్నీ ఉండుంటే ఇప్పుడు బాగుండేది కదా?
అవన్నీ పెట్టుకుని ఇప్పుడు టాక్స్‌లు ఎవరు కడతారు.
మీరు బెంగళూరు ఎందుకు వెళ్లిపోయారు?
అన్నయ్య చనిపోయాక, వాళ్ల పిల్లలు బెంగళూరులో సెటిల్ అయ్యారు. నేను, వదిన చెన్నైలో ఉండి ఏం చేస్తాం, అందుకని ఇక్కడే సెటిల్ అయ్యాం. అన్నయ్య కొడుకు 2 సంవత్సరాలు ఎమ్.ఎస్. చదివి వచ్చేస్తానన్నాడు. తర్వాత నేనూ అక్కడే ఉంటాను అని.. అక్కడే సెటిల్ అయ్యాడు. వెళితే రారు. అక్కడ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడేమోనని ఇక్కడ అమ్మాయిని చూసి పెళ్లి చేసి పంపించాము. తెలుగు అమ్మాయే.
మీరు యూఎస్ వెళ్లారా?
ప్రతి సంవత్సరం వెళ్లేదాన్ని. ప్రోగ్రామ్స్‌కు వెళ్లినప్పుడు, తానా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాడి దగ్గరకు వెళతాను. మా వదిన ఉన్నంత వరకూ ఇద్దరం వెళ్లేవాళ్లం. వాడికి ట్విన్స్ పుట్టారు. పోయిన నవంబరు వాడి దగ్గర 2 నెలలు ఉండి వచ్చాను. డెలివరీకి నేను ఉన్నాను. నేను పెళ్లి చేసుకోకపోయినా చాలా పీస్ ఫుల్‌గా ఉన్నాను. ఇండస్ట్రీ వారు అర్థం చేసుకోవాలి. ఈ జనరేషన్ గురించి మాట్లాడటం లేదు. అప్పట్లో అండర్‌స్టాండింగ్స్ లేవు. జిక్కీకి పెళ్లి అయ్యాక, మ్యూజిక్ డైరెక్టర్‌ని ఆమె భర్త ‘జిక్కి’ అని ఎందుకు పిలుస్తాడు. జిక్కమ్మ అని పిలవొచ్చుకదా! భార్యని పిలిచినట్టు పిలుస్తాడు అంటే అర్థం ఏముంది? పాడేటప్పుడు అందరం, జిక్కి, లీల ఇలా పిలుస్తాము. ఇలాంటివి అన్నీ భర్తల పాలిటిక్స్. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకే అన్ని సందేహాలుంటే లేని వాళ్లకు ఎలా ఉంటుంది. ‘లీల’ భర్త కూడా అలానే. ఇండస్ట్రీలో లేడు. ఆయన వకీలు. చాలా సందేహాలు ఆయనకు. నైట్ షిఫ్ట్ పూర్తి చేసి వస్తే వాడెవడు నైట్ రికార్డింగ్ పెట్టేవాడు. చూసి చూసి ఆ అమ్మాయి సంవత్సరం తర్వాత విడాకులు ఇచ్చేసింది. వాడు నీ ప్రాపర్టీ రాసి పెట్టు.. లేదా విడాకులు ఇవ్వు అని రెండు పేపర్లు తెస్తే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టింది. లీల తన తల్లిదండ్రులను కాపాడింది. లీల తండ్రికి అంతా ఆడపిల్లలే. వాళ్లు ఆమె దగ్గరే ఉన్నారు. వాళ్లని ఇంటి నుంచి పంపించడమంటే ఎట్లా పంపిస్తుంది. వాళ్లని ఎవరు చూసుకుంటారు. నాకు ఈ లైఫ్ వద్దు. తల్లిదండ్రులు కావాలి. వాళ్లని వదిలి ఉండను అంది.
బాల సరస్వతిగారిది కూడా అంతేనా..?
ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆయన పుట్టింటికి పంపలేదు. ఇండస్ట్రీకి పంపలేదు. తెలియకుండా ఎన్ని పాటలు పాడారు ఆమె. ఆయన వల్ల ఆమె ఎన్ని బాధలు పడ్డారు. ఎంత మంచి వాయిస్ ఆమెది. చాలా చిన్న వయసులో ఆమెను చేసుకున్నారు. చేసుకున్నపుడు మంచి గొంతు. పెళ్లి తర్వాత కూడా నువ్వు పాటలు పాడవచ్చు అని చెప్పి.. తర్వాత ఆ పక్కకు వెళ్లకూడదంటే ఎలా? ఎవరితో మాట్లాడుతుంది? చూడటానికి ఒక ఎస్కార్ట్. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు అమ్మాయి జాబ్‌కి వెళ్లినా పర్వాలేదు. ఆడపిల్లలు తమ కాళ్లమీద నిలబడాలి అన్న ఇంటెన్షన్ ఉంది. ఆ రోజుల్లో అది లేదు. అట్లాంటి రోజులు కాబట్టి మన తలరాత ఇలా తిరిగిపోయింది. నేను అన్నీ చూశాను.
మీరు ‘జింబో’ లాంటి డబ్బింగ్ పాటలు పాడారు?
చాలా పాడాను. ఆ రోజుల్లో హిందీ పిక్చర్స్ వచ్చేవి. అదంతా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ భాస్కర్. ఇంకా చాలా గుర్తు లేదు.
డబ్బింగ్ అంటే ఆల్రెడీ ఉంటుంది. మరి మీ స్టైల్ వేరు కదా?
ఆశాభోంస్లే పాడిన పాటలు ఆవిడ ఎట్లా పాడిందో అట్లాగే ట్రాక్ వేసుకుని పాడేదాన్ని. మళ్లీ మార్పులు ఏమీ చేయటానికి లేదు.
మీకు ఇష్టమైన గాయని ఎవరు?
హిందీలో లతామంగేష్కర్, తెలుగులో ఫస్ట్ సుశీల... తర్వాత జానకి. వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టం.
మీకు ఇష్టమైన సంగీత దర్శకులు?
నాకు తెలిసి మహదేవన్ గారిని మించి ఎవరూ లేరు. తమిళ్‌లో, తెలుగులో రాజేశ్వరరావుగారిని మించి ఎవరూ లేరు.
మీకు నచ్చిన పాట?
తమిళ్ ‘పాటెంట్రుకేటిన్ పాసిమలర్...’ శివాజీ గణేశన్ నటించిన, విశ్వనాథన్ రామ్మూర్తిగారు మ్యూజిక్. తెలుగులో ‘చివరకు మిగిలేది’ సినిమాలోని ‘అందానికి అందం...’.
సింహళ భాషలో మీకు అంత పేరు రావటానికి కారణం? మీకు గాని, సుసర్ల దక్షిణామూర్తిగారికి కానీ...?
వాళ్ల సింగర్స్‌కి మనంత టాలెంట్ లేదు. పాడతారు కానీ అంత పెద్దగా మనం పాడినంత ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. చదివి, అప్పజెప్పినట్లుగా ఉంటుంది. మన పాట వినబడితే ఎంత బావుందో అనుకుంటారు. ఈనాటి వరకు నిలబడ్డామంటే అదే కారణం.
సింహళ జాతీయగీతం దక్షిణామూర్తిగారు చేసినట్లున్నారు? మీరు పాడారా?
నేను, లతా మంగేష్కర్ మిగతా కొంతమంది కలిసిపాడాం వాళ్ల జాతీయ గీతాన్ని.
1940లో ‘త్యాగయ్య’కు పాడారు. 1950, 1960, 1970... ఇలా రీసెంట్‌గా ‘మిథునం’కు పాడారు. అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉంది?
1940లో పాడినప్పుడు నెల రోజులు ప్రాక్టీస్ ఇచ్చేవారు. 1950లో నెల రోజులు అంత లేదు. 2, 3 రోజులు ఆర్కెస్ట్రా ప్రాక్టీస్ ఇస్తే రికార్డింగ్ చేసేవాళ్లు. 1960 కూడా మాకు ఆర్కెస్ట్రాతో స్ట్రెయిట్‌గా అప్పటికప్పుడు పేపర్ ఇచ్చి పాడేయాలి అనే లెవెల్ వచ్చేసింది. ఆ తర్వాత నాకు తెలీదు. ట్రాక్ వచ్చాక నేను పాడింది ఒక్క పాటే. అది ‘నాయగన్’. తర్వాత ‘మిథనం’ ట్రాక్‌లో పాడటం అనేది నాకు నిజంగా సంతృప్తినివ్వలేదు. కంఫర్ట్‌గా లేదు.
ట్రాక్‌లో ఎవరో పాడిందనా?
ఎవరో పాడిందని కాదు. ఆర్కెస్ట్రాతో పాడేటప్పుడు ఆ ఎమోషన్. పాట ఎలా వస్తుందో చెప్పలేము. అంత బావుంటుంది. ఇవి ఏంటో పాట అప్పజెప్పినట్లు. నేర్పించి ఒక టీచర్‌కి అప్పజెప్పినట్లు ఉంటుంది. ఎమోషనల్‌గా పాడాలనుకుంటే, పెద్దవాళ్లంతా మంచి ఆర్టిస్టులంతా తెలుసుకుని పాడుతున్నారు. నాకు ఆ అనుభవం లేదు. ఎమోషన్‌తో ట్రాక్ పాడాలన్న ఆసక్తి లేదు. ఇప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రా ఉంటేనే నాకు గ్రిప్, హ్యాపీ, జోష్ అంతా.. లేకపోతే లేదు.
రాజేశ్వరరావుగారి డైరెక్షన్లో పాడారా?
5, 6 సినిమాలకు పాడి ఉంటాను. కులగోత్రాలు, భీష్మ ఇలా…
‘హైలో హైలెస్సా’ పాట మీకు చాలా పేరు తీసుకొచ్చిన పాట కదా! అలాంటి పాటల కోసం జానపద శైలి, హస్కీ వాయిస్ కోసం జాగ్రత్తలేమైనా తీసుకుంటారా?
అదంతా ఏమీలేదు. పాటను బట్టి, మనకు నేర్పించిన దానిని బట్టి, అందులోనూ రాజేశ్వరరావుగారు ఎన్ని సార్లు పాడతారో. పాడి, పాడి మనకు నేర్పించి మనకు బుర్రలో ప్రింట్ అయిపోతుంది. ఆయన దగ్గర మనం సెపరేట్‌గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పాడుతుంటే మనకు తెలిసిపోతుంది అలాంటిది ఆయన సంగతి.
ఆయన మీద ఒక విమర్శ... అచ్చం ఆయన పాడినట్టే పాడమంటాడు. ఇక అందరూ రాజేశ్వరరావు పాడినట్టే ఉంటుంది అని...?
అలా ఏమీ లేదు. ఆయన ఎంతసేపూ పాడుతూ ఉంటారు. మనతోపాటు పాడుతూ ఉంటాడు. ఒక్క రికార్డింగ్ టేక్ టైమ్లోలో పాడడు కానీ మిగతా అపుడు పాడుతూ ఉంటారు. వేరే అవసరం లేదు.
రాజేశ్వరరావుగారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది?
బాగా గంతులేసుకుంటూ పాడతారు. చక్కగా ఉంటారు. నేను చాలా తక్కువ పాడా. కంపోజింగ్ టైమ్‌లో లేదు కానీ పాట నేర్పించే టైమ్లోలో చూశా.
ఎక్కువ పాడింది?
మహదేవన్ గారితో. తర్వాత అందరి దగ్గర అంటే... 22 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర. కోదండపాణి, టి.వి.రాజు, సత్యం.. ఇలా అందరి దగ్గర కొన్ని కొన్ని పాటలు పాడాను. సుసర్ల దక్షిణామూర్తి, టి.జి. లింగప్ప ఇలా. మహదేవన్ గారితో 30 సినిమాలు అనుకున్నా. మిగిలిన 22 సినిమాలూ తెలుగులో కలిపి. మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఆఫర్లు ఉండేవి.
రాజేశ్వరరావుగారి దగ్గర పాడిన పాటల్లో మీ బెస్ట్ సాంగ్ ఏది?
హైలో హైలెస్సో…
మీతో అందరి సింగర్స్ బాగా ఉన్నా.. మీకు, జిక్కిగారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కారణం ఏంటి?
మద్రాసులో ఎప్పుడు కనబడినా జంట పక్షుల్లా ఉండేవారు...? జిక్కీ, నేను చిన్నప్పుడు 7 ఏళ్లప్పుడు వచ్చాం. త్యాగయ్య నుంచే. త్యాగయ్యలో తను కోరస్ పాడేది. అప్పుటి నుంచి నేను, తను ఒక్కటిగా పాడుతున్నాము. కానీ నన్ను దాటిపోయింది. హీరోయిన్‌కి పాడటానికి. ఆవిడ వచ్చాకే నేను వచ్చా. టాప్ పొజిషన్‌కి వచ్చాక సఖ్యత లేదు. నేను ఎక్కువ మోడ్రన్ థియేటర్స్‌లోనే పాడుతూ ఉండేదాన్ని. ఆమె ఎ.ఎమ్. రాజా చనిపోయాక ఆమెతో మళ్లీ నాకు సఖ్యత ఏర్పడింది. వాళ్లాయన ఎవరినీ రానిచ్చేవారు కాదు. ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా! మాట్లాడుతుంటే ఆమె మాట్లాడొద్దని నొక్కి చెపుతుంది. ఎందుకంటే ఇంటి విషయాలు ఏమైనా చెపుతుందేమోనని ఆయనకు సందేహం. ఇంటికెళ్లాక ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆమెకు భయం. అందుకే అందరం మాట్లాడకుండా తప్పించుకునేవాళ్లం.
జిక్కిగారికి పిల్లలున్నారా?
6 మంది. పెళ్లయ్యాక ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని కనాలని మిషన్. అందుకే ఆయన ఎక్కడికీ పంపే వాడు కాదు. కెరీర్ కూడా డల్ అయింది. ఎందుకు ప్రతి సంవత్సరం అని మేము అంటే అలా అబార్షన్ చేయకూడదు. మా అత్తగారు ఇష్టపడరు అనేది. ఎన్నాళ్లని ఇలాగ అని మేము అనేవాళ్లం. రెండుసార్లు అబార్షన్ అయింది. వాళ్ల పద్దతులో ఏమో మనకు తెలీదు. అదంతా పెద్ద కథ పాపం. ఆయన పోయాక ఇంటికి వెళితే నన్ను పట్టుకుని ఏడ్చింది. ఇండస్ట్రీలో అందరూ నన్ను వదిలేశారు. నువ్వు కూడా వదలి పెడితే నాకు దిక్కులేదు. అందుకే అప్పటి నుంచి కచేరీలకు వెళ్లడం, తను, నేను వాళ్ల అబ్బాయి వెళ్లేవాళ్లం. తనకు ఆఫర్స్ వచ్చినా నేను, నాకొచ్చినా తనకు. విదేశాలకు వెళ్లినా నేను లేకుండా వెళ్లదు. అట్లా మాకు అటాచ్మెంట్ బాగా ఎక్కువైపోయింది. నేను అమెరికా వెళ్లినప్పుడు ఆమెకి కేన్సర్ ఉందని ముందే తెలిసినా.. ఆపరేషన్ చేస్తారని తెలీదు. నేను వెళ్లి బాబు దగ్గర 3 నెలలు ఉందామనుకుంటే అడ్వాన్స్ స్టేజికి వచ్చేసింది. మీరు వచ్చాక పెట్టుకుంటామంటే లేదు మీరు చేసెయ్యండి నేను వచ్చేస్తానన్నా. నేను వచ్చేటప్పుటికి ఆపరేషన్ అయి ఇంటికి వెళితే వాళ్ల ఇళ్లు డిస్పోజ్ చేసి పిల్లలకు షేర్ ఇచ్చేశారు. వాళ్ల షేర్లు వాళ్లు పెట్టుకుని ఈవిడ ఒక మంచి ఇంట్లోనే ఏడు వేల రూపాయలు అద్దె ఇచ్చి అపార్ట్మెంట్లో ఉంది. అశోక్ నగర్ వాళ్ల ఆడబిడ్డ వాళ్ల ఇంట్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని ఉంది. అక్కడ ఉంది అన్నారు. ఎందుకు అక్కడ ఉంది అని వెళ్లి చూస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు. అది ఫ్లాట్ కాదు, ఉండదగిన ప్లేస్ అసలేకాదు. ఏంటమ్మా ఇట్లా ఇక్కడకు వచ్చి చేరావు అంటే.. ‘‘ఏం చేయమంటావు. నాలుగు లక్షలు ఆపరేషన్‌కు అయింది. ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లోంచి అన్నీ తీసేశాను’’ అని చెప్పింది. అప్పుడు నేను సంజయ్ కిశోర్‌కి ఫోన్ చేసి ఆమె పరిస్థితి ఇలా ఉంది ఏదైనా సాయం చేద్దామని, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టు, నాకు డబ్బులు వద్దు. అందరికీ చెప్పి డొనేషన్ తీసి ఆవిడకు ఏమైనా చేయాలి అని చెప్పాను. సంజయ్ రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ పెట్టించి అన్నీ ఏర్పాటు చేశాడు. ఒక్క పైసా తీసుకోలేదు. ‘‘నీ సంగతి పబ్లికికి చెప్పొచ్చా?’’ అని పర్మిషన్ తీసుకుని కేన్సర్ అన్న సంగతి తెలియకపోతే అనవసరంగా తీసుకుంటున్నామనుకుంటారు. పేపర్లో చెప్పేశాం కదా! ఆ సంగతి అప్పటికే అందరికీ తెలిసిపోయింది. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లక్షా డెబ్బయ్ ఐదు వేలు వచ్చింది. ఈ ప్రొగ్రామ్ చూసి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్‌మెంట్ ఇచ్చి నేను చూస్తానమ్మా అన్నారు. ఏం చేస్తాడులే అనుకుంటే 15 రోజుల్లో రెండు లక్షలు రూపాయలు ఇచ్చారు. సుబ్బిరామిరెడ్డి గారు యాభైవేలు ఇచ్చారు. అట్లా, ఇట్లా తెలియకుండా ఆవిడ ఖర్చు పెట్టిన మొత్తం వచ్చేసింది. అంతా సెట్ చేసి మా చేతుల్లోంచి ఇచ్చింది ఏమీ లేదు. సంజయ్ ద్వారా మొత్తాన్ని తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించా.
కానీ ఎంత చేసినా ఆమెను కాపాడుకోలేకపోయాం. ఆపరేషన్ అయ్యాక మూడేళ్లు బాగానే ఉంది. రమణమూర్తిగారి ద్వారా లండన్ వచ్చింది. దుబాయ్ వెళ్లాం. ప్రతీ షోకూ నాతో పాటు వచ్చింది. మలేషియా వెళ్లాం. కానీ ఎక్కడికి వెళ్లినా నేను ఉంటాను కాబట్టి చూసుకునేదాన్ని. లీలగారికి, జిక్కి గారికి, జమునారాణి గారు మూలస్తంభంలాగ ఉండేవారు. అంటే ప్రతీది చెప్పి సలహాలు తీసుకునేవారు. జిక్కీగారు మరీ అమాయకురాలు. ఏం మాట్లాడం తెలీదు. ఎక్కడికి వెళ్లినా భోజనం, ఏం తింటుందీ అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఒకసారి రమణమూర్తిగారితో లండన్ వెళ్లినప్పుడు బాలసరస్వతీగారు వాళ్లు వచ్చారు. అప్పుడు వాసు (రాజేశ్వరరావుగారి కొడుకు) తిరిగి వచ్చాక వాళ్ల పిల్లలతో ఒక కో-సింగర్ మీ అమ్మను ఎంత బాగా చూసుకున్నారు. మీరు కూడా చూసుకోరు అన్నారు. ఇంత బాగా చూసుకుని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయించుకుని వచ్చారు. ఇలా కూడా ఉంటారని మాకు నమ్మశక్యం కాలేదు... అని చాలా భ్రమపడ్డారు. తను ఉన్న పరిస్థితుల్లో మనం ఇంతకన్నా ఏమి చేయగలుగుతాము అని నేను అన్నాను. లీల కూడా నేను లేకుండా ఎక్కడికీ వెళ్లరు. సుశీల కూడా నాతో ఎంతో బావుంటుంది. అందరితో కూడా అలా ఉండదు. నాతో ఉన్నంత ప్రేమ, అభిమానం ఎవరితోనూ పెట్టుకోరు.
మీరు పిఠాపురంగారితోను, మాధవపెద్ది సత్యంగారితోను పాటలు వరుసగా పాడినప్పుడు మీది ఒక త్రయంలాగ ఉండేది. ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది?
పాడిన రోజులు గుర్తులేదు కానీ మనం పాడినపుడు మనల్ని ఎంతబాగా ఎంకరేజ్ చేసారంటే, వాళ్ల ఎంకరేజ్మెంట్లోనే పాట మనకు తెలియకుండా అంత బాగా వచ్చేది. ఎన్ని టేక్‌లు అయినా నేను వాళ్లతో కలిసి పనిచేసేదాన్ని. ‘ఎన్ని టేక్స్ అయినా విసుక్కోరు. తను మాత్రం పాడుతూనే ఉండేది. ఇలా ఉంటే బావుంటుంది. తల్లీ! నీలాగ ఎవరూ ఉండరమ్ము’ అని పిఠాపురం, మాధవపెద్ది సత్యం మెచ్చుకునేవారు.
‘లవకుశ’లో పాడిన పాట గురించి...
పాడినట్టు గుర్తుంది. ఏ పాటపాడానో గుర్తు లేదు. చాలాపాటలు తెలుగులో పాడాను. ‘దేవదాసు’లో ‘ఓ దేవరా...’ అదీ చాలా ముందు. 1953లో ‘వరకట్నం’ అయితే ‘పిఠాపురం’తో పాడిన పాటలు అసలు గుర్తులేవు. చక్రవర్తి మ్యూజిక్ లో ఒక పాట 1972లో ‘సిగ్గులేని సిగ్గులేని మావయ్య’ పాటపాడినా. నా కిష్టమైన పాటలన్ని భాగ్యదేవత, కులదైవం. వేణుగారితో చాలా పాటలు పాడాను. సంగతులన్ని చెప్పి చంపేసేవాడు.
ఆయన డైరెక్షన్లో మంచి పేరు తెచ్చిన పాట..?
‘పద పదవే వయ్యారి గాలిపటమా...’, ‘భాగ్యదేవత’లో ‘తలచిన తలపులు...’, ‘కులదైవం’లో ‘కోటు-బూటు వేసిన బావ...’, ‘మురళీకృష్ణ’లో శాంతకుమారి గారికి పాడాను.
సాలూరు హనుమంతరావు గారి దగ్గర పాడారా?
‘ఉషా పరిణయం’ అంతా ఆయనదే. ఇది కాక ఇంకా తెలుగు సినిమాలు పాడాను. పిక్చర్ టైటిల్స్ గుర్తుండవు. ఆ రోజుల్లో ప్రొడక్షన్-1, ప్రొడక్షన్-2 అని ఉండేవి. ఏం పిక్చరో తెలీదు. డ్యూయెట్ తెలీదు. పాట పాడి వచ్చేసెయ్యడమే. ఒక్కొక్కసారి ఫలానా సిట్యుయేషన్ కూడా చెప్పరు. మనమే తెలుసుకుని పాడాలి. వెళ్లామా, పాడామా, డబ్బు తీసుకున్నామా, వచ్చామా అంతే.
కథ తెలియకుండా అంత ఎఫెక్టివ్‌గా ఎలా పాడించేవారు?
అదే అక్కడ గమ్మత్తు. కథ తెలీదు, ఆర్టిస్టులు ఎవరో తెలీదు. ‘బండరాముడు’లో దక్షిణామూర్తి ఇలా పాడాలి అని బాగా నేర్పించి పాడించారు. సావిత్రి ఎవరిదీ ఒప్పుకోరు. అదే ఫస్ట్ టైమ్ తనకు నేను పాడింది. ఎవరు పాడారు. ‘నాకు లీల కదా పాడాలి. లేకపోతే సుశీలే కదా పాడాలి. ఆవిడతో ఎందుకు పాడించారు?’ అని అంటే ఆయన ఒక్కసారి వచ్చి వినండి అంటే విని ‘అబ్బ! చాలా బాగా పాడింది. ఇంత బాగా లీల కూడా పాడుతుందో- లేదో తెలియదు. ఇంత డామినేట్ చేసి పాడింది’ అని ఆవిడ మెచ్చుకున్న పాటల్లో అది ఒక పాట.. ‘ఎవరని అడిగె మొనగాడా..’ అని.. ‘బండరాముడు’ లోనిది. జానకి అప్పుడప్పుడే వస్తుంది. జానకి, నేను ఇంకో పాట. డాన్స్‌కి డ్యూయెట్ పాడుతున్నాము. హీరోయిన్‌కు పాడించే లెవెల్ లేదు. నాతో పాడించారు. సావిత్రి ఒప్పుకోదు అనుకున్నారు కానీ ఒప్పుకుని తమిళ్‌లో ‘మహాదేవి’ పిక్చర్లో ఒక జైల్ సాంగ్ చెబితే మేనేజర్ గారు ఒప్పుకుని పాడించాలంటే అప్పుడు సావిత్రి.. లీల, సుశీల, జమునారాణి ముగ్గురిలో ఎవరిని పాడించినా నాకు ఓకే అన్న లెవెల్ వచ్చింది సావిత్రి దగ్గర. సావిత్రిగారు ఎవరినీ ఒప్పుకోరు. ఆ రోజుల్లో జానకిగారినే ఒప్పుకోలేదు.
హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రిగారి దగ్గర పాడారు కదా!
‘తాసిల్దారు’లో పాడాను. ఆ తర్వాత ఇంకో సినిమాలో పాడాను కానీ, గుర్తు లేదు.
సీఆర్ సుబ్బురామన్ దగ్గర ఏం పాడారు?
‘దేవదాసు, రత్నమాల, లైలా-మజ్ఞు, ప్రేమ’.. వీటన్నింటిలో పాడాను. ఇవన్నీ భానుమతి సినిమాలు. అప్పట్లో ఆవిడ సినిమాలన్నింటికీ ఆయనే సంగీత దర్శకులు.
గాలి పెంచల నరసింహారావు దగ్గర పాడారా?
పాడాను. కానీ సినిమాలు గుర్తు లేవు. బి. గోపాలం, మోతీబాబుగారి దగ్గర కూడా పాడాను. బి. గోపాలం, పార్థసారథి వీళ్లంతా అసిస్టెంట్లుగా ఉండి, తర్వాత మ్యూజిక్ డైరక్టర్స్ అయిన వాళ్లే కదా!
అశ్వద్దామతో..?
ఆయనతోనూ పాడాను. ‘అందానికి అందం...’, ‘రగులుతోంది..’ టీవీ రాజు, పెండ్యాలతోను పాడాను.
పెండ్యాల కూడా టఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు?
అందరికీ కాదు. ఒక ఎమోషన్, ఎక్స్ప్రెషన్ లేని వాళ్లకు చెబుతాడు కానీ అందరికీ కాదు.
జీకే వెంకటేశ్ గారితో..?
కన్నడ సినిమాకు పాడా. మలయాళం కూడా పాడా.
జె.వి. రాఘవులు గారితో..?
ఏదో ఒక పిక్చర్స్‌కి పాడా. పేరు గుర్తులేదు.
సత్యం గారితో..?
రెండు సినిమాలకు పాడుంటాను.
విశ్వనాథన్-రామ్మూర్తి గారితో...
వీళ్లతో తమిళ్‌లో మాళయిట్టమంగై, పాశమళర్ అని... ఎక్కువే. వాళ్లు ఒక లెవెల్లో ఉన్నప్పుడే పాడా. టాప్‌కి వెళ్లాక లేదు. వీళ్లు ఎమ్జీఆర్ పిక్చర్స్‌కి ఎక్కువ వర్క్ చేశారు. చంద్రబాబుతో చాలా పాటలు పాడా. ‘అడోడిమన్నన్’ అని ఎమ్జీఆర్‌గారి పిక్చర్. అది ఎవరంటే సుబ్బయ్యనాయుడు అనే ఆయన. విశ్వనాథన్-రామ్మూర్తిగారు టాప్‌కి వచ్చినప్పుడు మహదేవన్ గారికి అవకాశాలు తగ్గిపోయాయి. మిగిలిన చిల్లర డైరక్టర్స్ లేరు. రాజేశ్వరరావుగారు తమిళ్‌కి లేరు. తమిళ్లో వీళ్లే డామినేషన్. వీళ్లు వచ్చినప్పుడు నా సాంగ్స్ అన్నీ ఇంకో ఆర్టిస్ట్‌కు వెళ్లేవి. అందువల్ల తెలుగులో కూడా పాటలు ఆమెకే ఇద్దామని వాళ్లంతా ఎగబడ్డారు. అలాగే నాకు గ్యాప్ వచ్చింది. నియర్లీ ఆయన 10 ఏళ్లు ఉన్నారనుకుంటా. ఇళయరాజా వచ్చేవరకు. విశ్వనాథన్-రామ్మూర్తి గారు ఎవరిని వదిలిపెట్టారో వాళ్లందరూ ఇళయరాజా రావడంతో పైకి వచ్చారు. జానకి వాళ్లు. కానీ నేను ఎవరినీ నాకు ఆఫర్స్ కావాలని అడగలేదు. నాకది ఇష్టం లేదు. ఎవరైనా ఇష్టపడి పిలిస్తే వెళ్లాలి, లేకపోతే లేదు.
వేదకి పాడారా..?
ఆయన పాటలే నాకు పాపులర్. ‘అబయంగే..’ అనే పాట హిట్. నాలుగైదు సినిమాలు చేశాను. ఇలాగే చాలా మంది ఉన్నారు.
రాజన్-నాగేంద్ర..?
పాడాను. ‘వద్దంటే పెళ్లి’లో గిరిజకి పాడా. ఆ పాట నుంచి గిరిజకు నేనే పాడేదాన్ని. ఏ పాట అయినా గిరిజ, ముందు నాకు జమునారాణి పాడాలి అని చెప్పేది. అందుకే గిరిజతో నాకు ఎక్కువ పాటలయ్యాయి.
మై టాప్ టెన్ సాంగ్స్
1. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం (మూగ మనసులు - సంగీతం: కేవీ మహదేవన్)
2. మావా-మావా (మంచి మనసులు - సంగీతం: కేవీ మహదేవన్)
3. హైలో హైలెస్సా (భీష్మ - సంగీతం: సాలూరు రాజేశ్వరరావు)
4. నాగమల్లి కోనలోన (బంగారు తిమ్మరాజు - సంగీతం: ఎస్.పి. కోదండపాణి)
5. ఓ వెన్నెల వయ్యారి చూసేపు ఎవరి దారి (శభాష్ రాజా - సంగీతం: ఘంటసాల)
6. సరదా సరదా సిగరెట్టు (రాముడు-భీముడు - సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు)
7. అందానికి అందము నేనే జీవన మకరందము నేనే (చివరకు మిగిలేది - సంగీతం: అశ్వత్థామ)
8. తలచిన తలపులు ఫలమైతే తీరని ఊహలు నిజమైతే (భాగ్యదేవత - సంగీతం: మాస్టర్ వేణు)
9. పద పదవే వయ్యారి గాలిపటమా (కులదైవం - సంగీతం: మాస్టర్ వేణు)
10. రావాలని రావాలి రమ్మంటే రావాలి (మర్మయోగి - సంగీతం: ఘంటసాల)
-పులగం చిన్నారాయణ