Vikram Sahidev: వాయిదా పడిన 'అనకాపల్లి'! అయితే...
ABN, Publish Date - Aug 05 , 2026 | 05:08 PM
అనకాపల్లి సినిమా ఒక వారం వెనక్కి వెళ్ళింది. ఈ నెల 7న రావాల్సిన ఈ చిత్రాన్ని 15వ తేదీన విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.
విక్రమ్ సహిదేవ్, 'శ్రీ చిదంబరం గారు' ఫేమ్ సంధ్యా వశిష్ట జంటగా నటించిన సినిమా 'అనకాపల్లి'. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన తన మిత్రుడు కాండ్రేగుల నాయుడుతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో ఖగేష్ తమ్మినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఈ సినిమాను ఓ వారం పాటు వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. నిజానికి జూన్ 5న 'అనకాపల్లి' సినిమా విడుదల కావాల్సింది. కానీ అదే రోజున రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ కావడంతో దీనిని ఆగస్ట్ 7కు దర్శక నిర్మాతలు వాయిదా వేశారు. అయితే... ఆగస్ట్ 7న కూడా పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో ప్రధానంగా వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు లోకేశ్ కనకరాజ్ 'డీసీ' చిత్రం వస్తోంది. అలానే మాధవన్ అనువాద చిత్రం 'జి.డి. నాయుడు'కూడా 7నే వస్తోంది. దాంతో ఇప్పుడీ సినిమాను ఆగస్ట్ 15కి వాయిదా వేశారు.
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషా దంపతుల తనయుడైన విక్రమ్ సహిదేవ్ ఇప్పటికే పలు చిత్రాలలో నటించి, నటుడిగా మంచి మార్కులు పొందాడు. ఇప్పుడీ సినిమాతో అతనికి మాస్ హీరోగా చక్కని గుర్తింపు వస్తుందని నిర్మాతలలో ఒకరైన త్రినాథరావు నక్కిన చెబుతున్నారు. ఈ సినిమా పేరుకు తగ్గట్టే మొత్తం షూటింగ్‌ను అనకాపల్లిలో చిత్రీకరించారు. విశేషం ఏమంటే ఈ సినిమా నిర్మాతలు త్రినాథరావు, కాండ్రేగుల నాయుడు ఇద్దరిదీ అదే ఊరు. 'అక్కడ ఉన్న 75 లొకేషన్స్ లో షూటింగ్ చేశామని, అందుకే ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను అక్కడే జరుపుతున్నామ'ని వారు అన్నారు.
ఆగస్ట్ 7న విడుదల కావాల్సిన ఈ సినిమా 15వ తేదీకి వాయిదా పడినా... అనకాపల్లిలో మాత్రం 7వ తేదీ నాలుగు ఆటలు పబ్లిక్ కోసం ప్రదర్శిస్తున్నామని తెలిపారు. నిజానికి ఇవాళ చాలా సినిమాలకు ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. కానీ ఇలా మరీ వారం ముందు నాలుగు ఆటలు ఒకే ఊరిలో ప్రదర్శించడం మాత్రం విశేషమే! ఇదే విషయాన్ని నిర్మాతల దగ్గర ప్రస్తావిస్తే, 'తమ సినిమా విజయంపై ఉన్న నమ్మకం కారణంగా ఈ విధంగా ప్లాన్ చేశామ' తెలిపారు. అయితే... ఆగస్ట్ రెండోవారంలోనూ టాలీవుడ్ బరిలో గట్టిపోటీనే 'అనకాపల్లి' సినిమా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వీకెండ్ లో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం'తో పాటు 'పళ్ళబురుసు, హుషార్ పిట్టలు, అగథ, ది రెడ్ బ్యాగ్' సినిమాలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన
గ్లామర్ డోస్ పెంచితే ఆఫర్స్ వచ్చేస్తాయా రాశీ..
ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!