Allari Naresh: రాజమౌళి సినిమాలో నెక్ట్స్ తనే హీరో!
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:58 PM
'అల్లరి' నరేశ్ నటించిన తాజా చిత్రం 'రంభ ఊర్వశి మేనక' చిత్రం ఈ నెల 4న విడుదల కాబోతోంది. ఇక 'సుడిగాడు 2' సినిమా ఆలస్యానికి కారణమేమిటో తెలిపారు నరేశ్.
'అల్లరి' నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది?
- సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
- చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్‌టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని మొదలుపెట్టాం. చంద్ర మోహన్ చాలా మంచి రైటర్ కూడా. ఈ కథని ఆయన చక్కగా రాసుకొని వచ్చారు. అలాగే నందు మంచి డైలాగ్స్ ఇచ్చారు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
- నాది చాలా ఎంటర్టైనింగ్ ఉండే క్యారెక్టర్. అందరి దగ్గర అప్పులు చేసి ఉంటాడు. తనని ఎవరు ఊర్లో నమ్మరు. అందరూ కొంచెం నెగిటివ్‌గా అనుకునే క్యారెక్టర్. తనకి చాలా కష్టాలు వస్తుంటాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇందులో కామెడీ ఎలా ఉండబోతోంది?
- ఆడియన్స్ కామెడీని చూసే విధానం మారింది. నా బడీ లాంగ్వేజ్ సరిపడే కామెడీని డైరెక్టర్ డిజైన్ చేశారు. అలాగే స్వర్గం, నరకం, ఇంద్రలోకం ఇలాంటి కథలు చూసి చాలా కాలం అయింది. కచ్చితంగా ఆడియన్స్, అలాగే చిన్నపిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. చాలా క్లీన్ కామెడీ ఇందులో ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా వుంటుంది. కామెడీ కూడా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు కలిసి నాతో ట్రావెల్ అవుతుంటారు. మా మధ్య కామెడీ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ గారు, అజయ్ గారు ఇలా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. ఇది మా నాన్నగారి స్టైల్‌లో చేసిన సినిమా. అంత పెద్ద స్టార్ కాస్ట్ ఇందులో ఉంటుంది. అలాగే తారక్ పొన్నప్ప క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తను పోలీస్ ఆఫీసర్. ఒక క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ జరుగుతూ ఉంటుంది.
ట్రైలర్ లో ఓజీ స్పూఫ్ బాగా వైరల్ అయింది కదా?
- ఇందులో నా క్యారెక్టర్‌కి హీరో అవ్వాలని ఉంటుంది. తనకి తెలిసిన భాష సినిమా కాబట్టి ఆ సినిమా భాషల్లోనే మాట్లాడతా ఉంటాడు. సినిమాలో ఓజీ సీక్వెన్స్ వచ్చినప్పుడు చూస్తే పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది. అది ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ డార్క్ జోన్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులు లైట్ హార్టెడ్‌గా ఉండే కామెడీ సినిమాలు, ఎంటర్‌టైనర్స్ కోరుకుంటున్నారు. ఇకపై నేను కూడా రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా - ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తున్నాను.
దర్శకత్వం చేయాలని ఆలోచన ఉందా?
- ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం నటనపైనే ఉంది. నటుడిగా మంచి విజయవంతమైన చిత్రాలు చేయడం పైన నా దృష్టి ఉంది.
‘సుడిగాడు 2’ సీక్వెల్ గురించి?
- ‘సుడిగాడు 2’ చేయాలని నాకూ ఉంది. కాకపోతే ఒకప్పటి పరిస్థితులకి, ఇప్పుడు పరిస్థితులకి చాలా మార్పులు వచ్చాయి. ‘సుడిగాడు’ సినిమాకి దాదాపు 108 స్పూపులు చేశాము. అవన్నీ కూడా ఆ డైరెక్టర్లు, నిర్మాతల పర్మిషన్ తీసుకున్నాం. కాకపోతే ఇప్పుడు కాపీరైట్ ఇష్యూ ఎక్కువగా ఉంది. రిలీజ్ సమయంలో ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్తారో, ఎలాంటి కాపీరైట్ ఇష్యూ వస్తుందో అనేది మన చేతిలో ఉండదు. అందుకే చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటి యంగ్ డైరెక్టర్స్‌లో ఎవరితో సినిమా చేయాలని ఉంది?
- నాకు రితేష్ రానా స్టైల్ చాలా నచ్చింది. ‘మత్తు వదలరా’ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన కథల్లో చాలా డీటెయిల్‌గా ఉంటుంది. కాంటెంపరరీగా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా తీసుకొస్తారు. అలాగే తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్‌తో కూడా పనిచేయాలని ఉంది.
కొత్త సినిమాల గురించి?
- ‘ఆల్కహాల్’ రిలీజ్ రెడీగా ఉంది. అలాగే ‘కనకదుర్గ’ షూటింగ్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్
ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్