తెరపై మళ్లీ తెలుగు అమ్మలు... అమ్మ పాత్రల్లో మధురిమ మెరుపులు!
ABN, Publish Date - Nov 19 , 2026 | 04:38 PM
‘ఒరేయ్ రిక్షా’, ‘శతమానం భవతి’, ‘యశోద’ చిత్రాలతో గుర్తింపు పొందిన నటి మధురిమ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ‘మాయలేడి’, ‘ఈఎన్ఈ రిపీట్’ చిత్రాల్లో కీలకమైన పాత్రలు పోషించారు. నటనతో పాటు హైదరాబాద్‌లో తన్మయ కూచిపూడి డాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు.
గతంలో తెలుగు సినిమాల్లో హీరోయిన్లు మాత్రమే పరాయి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవారు. కానీ ఆ తర్వాత తల్లి, పిన్ని, వదిన, అక్క, చెల్లి పాత్రలకు సైతం పక్క రాష్ట్రాల నుంచి తీసుకు రావడం మొదలైంది. కొంతకాలం క్రితం అయితే హీరో లేదా హీరోయిన్ తల్లి అంటే ఒకప్పటి స్టైలిష్ హీరోయిన్స్ ను ఎంపిక చేయడం ఫ్యాషన్ గా ఉండేది. ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితి మారుతోంది. తల్లి, చెల్లి పాత్రలలో కొంతలో కొంత తెలుగువారు కనిపిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలలో కనిపిస్తున్న నటి మధురిమ నార్ల.
బాలనటిగా కొన్ని చిత్రాల్లో నటించిన మధురిమకు ఆ తర్వాత మంచి గుర్తింపు 'ఒరేయ్ రిక్షా'తో దక్కింది. అందులో ఆర్. నారాయణమూర్తి చెల్లిగా ఆమె నటించారు. నారాయణమూర్తి, మధురిమ పై చిత్రీకరించిన 'నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా' తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్. ఆ తర్వాత మధురిమ కొంతకాలం సినిమాలకు దూరమైనా... ఆమెను మాత్రం జనాలు మర్చిపోలేదు. కూచిపూడి, భరతనాట్యం డాన్సర్ అయిన మధురిమ ఎన్నో క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మళ్ళీ తనలోని నటిని మేల్కొలిపి, 'శతమానం భవతి' సినిమాతో ఆమె తెలుగు సినిమా రంగంలోకి పునఃప్రవేశించారు. ఆ తర్వాత సమంత 'యశోద'లో ఆమె కీలక పాత్రను పోషించారు.
విశేషం ఏమంటే... నవంబర్ 13న వారం విడుదలైన రాకేశ్ వర్రే 'మాయ లేడీ' సినిమాలో ఆమె హీరో తల్లిగా సురేశ్ సరసన నటించారు. అలానే నవంబర్ 19, గురువారం విడుదలైన 'ఈఎన్ఈ రిపీట్' సినిమాలో హీరోయిన్ శివాత్మిక తల్లిగా, ప్రియదర్శిని రామ్ భార్యగా నటించారు. ఈ రెండు పాత్రలూ తెర మీద ఇలా కనిపించి అలా వెళ్ళిపోయేవి కాదు. కుటుంబంలో మహిళలకు ఉండాల్సిన ప్రాధాన్యత తెలియచెప్పేవి. తమ అస్తిత్త్వం కోసం పోరాటం చేసేవి. మధురిమ ఇటు సినిమాలలో నటిస్తూనే హైదరాబాద్‌లో తన్మయ కూచిపూడి డాన్స్ అకాడమిని నిర్వహిస్తున్నారు. అందులో సినిమా రంగానికి చెందిన కొందరు హీరోయిన్లు సైతం క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు. ఇటీవలే ఈషా రబ్బా సైతం తాను అదే అకాడమిలో కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నట్టు తెలిపింది. అలానే 'ఆదర్శ కుటుంబం'లో నటించిన నివేదా పేతురాజ్, డింపుల్ హయతీ సైతం ఆ అకాడమిలో శిక్షణ తీసుకుంటూ, మధురిమతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇటీవల వచ్చిన 'డి.ఎన్.కె.' మూవీలోనూ రజిత హీరో తల్లిగా నటించి, మెప్పించింది. మొత్తం మీద తిరిగి తెర మీద తెలుగు అమ్మలు కనిపించడం మొదలైంది.
ఇవి కూడా చదవండి:
మనవళ్లతో సూపర్ స్టార్.. ఇలా ఎప్పుడూ చూడలేదు కదా
అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే