పంచమహాశక్తుల నేపథ్యంలో ‘ఆది రుద్రాక్ష’.. గ్లిమ్స్ అదిరింది
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:00 PM
పంచమహాశక్తులు, ఓ మహారహస్యం, దుష్టశక్తుల మధ్య జరిగే భీకర పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతోన్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ‘ఆది రుద్రాక్ష’. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.
పంచమహాశక్తులు, ఓ మహారహస్యం, దుష్టశక్తుల మధ్య జరిగే భీకర పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతోన్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ‘ఆది రుద్రాక్ష’ (Aadhi Rudraksha). షేక్ మహబూబ్ బాషా నిర్మాణంలో, ఆర్యన్ (Aryan) హీరోగా నటిస్తూ స్వయంగా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి గ్లిమ్స్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో వేదికగా ఘనంగా విడుదల చేశారు. ఇందులో రూప హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్ర గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గ్లిమ్స్‌లో వినిపించిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ సినిమా కథా ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు పరిచయం చేసింది. నాగ, గజ, వ్యాఘ్ర, మయూర తదితర శక్తుల ప్రస్తావనతో పాటు, యుగయుగాలుగా ఒక మహారహస్యానికి రక్షణగా నిలిచిన పంచరక్షకుల నేపథ్యాన్ని ఆవిష్కరించారు. ఆ రహస్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే దుష్టశక్తులు, వాటిని అంతమొందించడానికి మహాదేవుని సంకల్పానికి ప్రతిరూపంగా రణరంగంలోకి అడుగుపెట్టే ఓ మహావీరుడి కథగా ఈ సినిమా సాగనుందని గ్లిమ్స్ ద్వారా స్పష్టమైంది.
గ్లిమ్స్ లాంచ్ వేడుకలో హీరో, దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ.. ‘‘కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున మా సినిమా గ్లిమ్స్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎంతో ఇష్టపడి రాసుకున్న కథను వెండితెరపైకి తీసుకొస్తుండటం సంతోషాన్నిస్తోంది. ముఖ్యంగా మా గ్లిమ్స్‌ను ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని వీక్షించి, అభినందించడం మా చిత్రబృందానికి కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేలా సినిమాను రెడీ చేస్తాం’’ అని తెలిపారు.

నిర్మాత షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. ‘ఆది రుద్రాక్ష’కు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దర్శకుడు ఆర్యన్ ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథపై ఆయనకున్న స్పష్టత, అంకితభావం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ నిర్మాణ విలువలతో, మంచి నాణ్యతతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అందరం సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. హీరోయిన్ రూప మాట్లాడుతూ.. ఆర్యన్ చెప్పిన కథ తనకు ఎంతో నచ్చిందని, ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులు నవీన్, సందీప్, శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఆది రుద్రాక్ష’ కథాంశం చాలా ప్రత్యేకంగా ఉందని, పరమశివుడి ఆశీస్సులతో ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
చరిత్రను తెలుసుకుందాం.. ఫూలే దంపతుల పోరాటానికి తెరపై నివాళి
‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే
సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే