వెంకటేష్ సినిమా వాయిదా.. శ్రీవిష్ణుకి లక్కీ ఛాన్స్
ABN, Publish Date - Oct 05 , 2026 | 11:12 PM
టాలీవుడ్‌లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ హీరో శ్రీవిష్ణు.. ఈ దసరాకు ‘కామ్రేడ్ కళ్యాణ్’గా రాబోతున్నారు.
టాలీవుడ్‌లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మినిమం గ్యారెంటీ హీరోగా ముద్ర వేసుకున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ నుంచి మొదలుపెడితే.. ‘నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, రాజా రాజా చోర, బ్రోచేవారెవరు రా’.. వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ‘సామజవరగమన, ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తూ కమర్షియల్ సక్సెస్ సాధించారు.
అయితే, ఈ ఏడాది శ్రీవిష్ణు నటించిన ‘మృత్యుంజయ్, విష్ణు విన్యాసం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. 1990ల కాలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 9న రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే, అదే రోజున విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House no 47) కూడా పోటీకి సిద్ధమైంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక తన ఫేవరెట్ హీరో అయిన వెంకటేష్‌తో శ్రీవిష్ణు డైరెక్ట్ క్లాష్‌కి దిగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ, తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీమ్‌కి ఒక ఊహించని శుభవార్త అందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదా (Postpone) వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు.
ఈ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో శ్రీవిష్ణుకి బాక్సాఫీస్ వద్ద పెద్ద రూట్ క్లియర్ అయిందనే చెప్పాలి. ఒకవేళ వెంకీ మామ సినిమాతో పోటీపడి ఉంటే, థియేటర్ల కేటాయింపుతో పాటు ఓపెనింగ్స్‌పై కొంత ప్రభావం పడేది. ఇప్పుడు పెద్ద సినిమా వాయిదా పడడంతో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టాక్ గనుక పాజిటివ్‌గా వస్తే, దసరా హాలీడేస్ అడ్వాంటేజ్‌తో కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణుకి ఇంకో చిన్న సవాలు ఎదురుకానుంది. రూ.2 కోట్లతో తెరకెక్కి దాదాపు రూ.410 కోట్ల సంచలన వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘హనుమాన్ అంశ్’ కూడా అక్టోబర్ 9నే తెలుగులో విడుదలవుతోంది. ఏది ఏమైనా, ఆదర్శ కుటుంబం తప్పుకోవడమే శ్రీవిష్ణుకి అతిపెద్ద అడ్వాంటేజ్. మరి ఈ దసరా బరిలో ‘కామ్రేడ్ కళ్యాణ్’గా వస్తున్న శ్రీవిష్ణు థియేటర్లలో నవ్వులు పూయించి, తన ఖాతాలో మరో సాలిడ్ హిట్ వేసుకుంటాడో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?
నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు
డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం