Sree Vishnu: 'కామ్రేడ్ కళ్యాణ్‌'లో ఆర్. నారాయణమూర్తి...

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:44 AM

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి 'కామ్రేడ్ కళ్యాణ్‌' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీవిష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్ ప్రజెంటర్.

People Star R Narayana Murthy

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) రూట్ మార్చబోతున్నారు. ఇంతవరకూ కథానాయకుడిగానే నటించిన ఆర్. నారాయణమూర్తి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్నింగ్ తీసుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో ఆర్. నారాయణమూర్తి మెరిసారు. దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) శిష్యుడైన నారాయణమూర్తిని హీరోని చేసిన ఘనత దాసరి నారాయణరావుదే. ఆయన దర్శకత్వంలో పలు చిత్రాలలో నారాయణమూర్తి కీలక పాత్రలూ పోషించారు. ఆ తర్వాత తనదైన ముద్రను తెలుగు సినిమాపై వేయడానికి ఆర్. నారాయణమూర్తి స్నేహచిత్ర పతాకాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఆ బ్యానర్ లో వచ్చిన ముపైకి పైగా చిత్రాలలో ఆయన కథానాయకుడిగా నటించాడు. సొంత బ్యానర్ లో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న ఆర్. నారాయణమూర్తి ఆ తర్వాత వరుస పరాజయాలనూ చవిచూశారు. అయితే ఎప్పుడు మడమ వెనక్కు తిప్పలేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేసినా... నారాయణమూర్తి వెనకడుగు వేయలేదు. మధ్యలో పలువురు అగ్ర నిర్మాతలు, ప్రముఖ దర్శకులు తమ చిత్రాలలో కీలకమైన పాత్రను చేయమని కోరినా నారాయణ మూర్తి సున్నితంగా తిరస్కరించారు. అయితే... ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా జానకిరామ్ మారెళ్ళ తెరకెక్కిస్తున్న 'కామ్రేడ్ కళ్యాణ్‌' (Camrade Kalyan) సినిమాలో ఆర్. నారాయణమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.


డిసెంబర్ 31 ఆర్. నారాయణమూర్తి పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న స్కంద వాహన మోషన్ పిక్చర్స్ సంస్థ ఆర్. నారాయణమూర్తికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే ఇది కూడా నక్సలిజం నేపథ్యంలో తన భావాలకు అనుగుణమైన సినిమా కావడం వల్లే నారాయణ మూర్తి అంగీకరించినట్టు తెలుస్తోంది. 1992లో ఆంధ్ర - ఒడిసా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని అంటున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ ను చూస్తే అదే విషయం అర్థమౌతోంది. కామ్రేడ్ కళ్యాణ్‌ ను పట్టుకుంటే ప్రభుత్వం ఐదు లక్షల రివార్డ్ ప్రకటించిన పోస్టర్ ఒకటి ఈ గ్లింప్స్ లో ఉంది. కళ్యాణ్ పాత్రను శ్రీవిష్ణు చేస్తున్నాడు. అయితే ఇందులో అతని పాత్రకు, ఆర్. నారాయణమూర్తి పాత్ర మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందన్నది చూడాలి. సీరియస్ సబ్జెక్ట్ ను ఇందులో డీల్ చేస్తున్నా... శ్రీవిష్ణు నుండి ప్రేక్షకులు ఆశించే వినోదానికి చోటు ఉంటుందని అంటున్నారు. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్ (Kona Venkat) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Comradekalyan.jfif

Updated Date - Jan 01 , 2026 | 11:47 AM