ఈ వీకెండ్ సందడి మామూలుగా లేదుగా!

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:36 PM

ఈ వీకెండ్‌లో ఏకంగా పదకొండు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అందులో పలు అనువాద చిత్రాలు కూడా ఉన్నాయి.

Telugu Movies

అక్టోబర్ ఫస్ట్ వీకెండ్‌లో అనువాద చిత్రాలతో కలిపి పదికి పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అక్టోబర్ 2న రావాల్సిన 'ఏ నిమిషానికి ఏమి జరుగునో', కన్నడ అనువాద చిత్రం 'పినాక' వాయిదా పడ్డాయి. దాంతో ఈ వారాంతంలో ఏకంగా పదకొండు సినిమాలు విడుదల అవుతున్నాయి. తమిళంలో సూరి, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన 'ఏళు కడల్ ఏళు మలై' సినిమా తెలుగులోనూ అక్టోబర్ 1న 'సంచారి' పేరుతో విడుదల కావాల్సి ఉంది. అయితే టైటిల్‌ వివాదం కారణంగా ఈ సినిమా రెండో తేదీ థియేటర్లలో ప్రదర్శితం అవుతుందని తెలుస్తోంది. ఇది రెండు మూడేళ్ళ క్రితం నిర్మితమైన సినిమా. గత నెలలో సూరి నటించిన 'మండాడి' సినిమా సూపర్‌ హిట్‌ కావడంతోనూ, ఇందులో మరో కీలక పాత్ర పోషించిన మలయాళ నటుడు నివిన్ పౌలీ 'బెత్లెహాం కుటుంబ యూనిట్‌' సూపర్ డూపర్ హిట్‌ కావడంతోనూ ఆగిపోయిన ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధం చేశారు.


ఇదిలా ఉంటే... ఈ శుక్రవారం ఏకంగా మూడు తమిళ అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో ఒకటి 'సంచారి' కాగా మరొకటి కీర్తి సురేశ్‌ నటించిన 'డోరతీ'. కార్తీక్ సుబ్బరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'డోరతీ' ఇప్పటికే తమిళంలో విడుదలైంది. ఈ డిఫరెంట్‌ కాన్సెప్ట్ మూవీకి అక్కడ ప్రతికూల ఫలితమే దక్కింది. అయినా తెలుగులోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మేకర్స్ తాపత్రయ పడుతున్నారు. తమిళం నుంచి వస్తున్న మరో అనువాద చిత్రం 'సిగ్మా'. తెలుగు వారైన సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా లైకా ప్రొడక్సన్స్ అధినేత సుభాస్కర్ నిర్మించిన ఈ సినిమాతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తనయుడు జాసన్ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రమోషన్స్ లో చిరంజీవి కూడా పాల్గొనడంతో మూవీకి కాస్తంత క్రేజ్ వచ్చింది. పిల్లలు అమితంగా ఇష్టపడే డోరేమాన్ సీరిస్ నుంచి 'డోరేమాన్: క్యాజిల్ ఆఫ్ ది అండర్ సీ డెవిల్' కూడా తెలుగులో అక్టోబర్ 2న విడుదల అవుతోంది.


ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఫహద్‌ ఫాజిల్‌ నటించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్‌' మూవీ మీదే ఉంది. ఈ సినిమాతో శశాంక్‌ ఏలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ సమర్పణలో ఈ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కాలభైవర సంగీతం అందిస్తున్నాడు. రొటీన్‌ కు భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్' మూవీకి టాలీవుడ్‌ స్టార్ హీరోలంతా దన్నుగా నిలిచి, ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక మేలోనే విడుదల కావాల్సిన విక్రమ్ సహిదేవ్‌ 'అనకాపల్లి' సినిమా గాంధీ జయంతికి వస్తోంది. ఈ సినిమాతో పాటే 'తత్తం, తెల్లకాగితం', రూపాయనమః' చిత్రాలు విడుదల అవతున్నాయి. ఇంకో విశేషం ఏమంటే.. ఆది సాయికుమార్ నటించిన 'సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్‌' మూవీ ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్‌ అవుతోంది. 'ఎల్.బి.డబ్ల్యూ, మన్మథుడు 2, మా ఇంటి బంగారం' చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన నిశాంతి తొలిసారి దర్శకత్వం వహించిన ఇండీ మూవీ 'ఇంప్యూర్‌' కూడా అక్టోబర్ 2న విడుదల అవుతోంది. మరి ఇన్ని చిన్న సినిమాలలో ఏవేవి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Radhika Sarathkumar: రివ్యూల పేరుతో హద్దులు దాటుతున్నారు.. సోషల్ మీడియా తీరుపై రాధిక శరత్‌కుమార్ ఫైర్

ఇరుముడి గ్లోబల్ రికార్డ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మాస్ మహారాజా

Sandeep Kishan: ఇండియన్‌ సెల్యులాయిడ్‌పై సరికొత్త విజువల్‌ ట్రీట్‌

Updated Date - Oct 01 , 2026 | 12:40 PM