Tollywood: వీకెండ్ మూవీస్‌పై ప్యారడైజ్ ఎఫెక్ట్!
ABN, Publish Date - Sep 16 , 2026 | 01:37 PM
ఈ వీకెండ్‌లో రెండు రీ-రిలీజ్‌తో కలిసి పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందు అనుకున్న 'హనుమాన్ అంశ్, అనుమాన పక్షి' చిత్రాల విడుదల వాయిదా పడింది.
ఈవారం సినిమాలపై వచ్చే గురువారం రాబోతున్న నాని 'ది ప్యారడైజ్' ఎఫెక్ట్ గట్టిగా పడబోతోంది. అలానే ఆంగ్ల చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్: ఎంకోర్' సైతం ఈ నెల 25న వస్తుండటంతో ఈవారం విడుదలయ్యే సినిమాలు ఎలా ఉన్నా... ఈ రెండు సినిమాలకు థియేటర్లను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేస్తాడని ప్రచారం జరిగిన 'హనుమాన్ అంశ్' మూవీ సైతం ఈ శుక్రవారం రావట్లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ నుంచే త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పుకున్నాడని అంటున్నారు. ఇక రాగ్ మయూర్ హీరోగా నటించిన 'అనుమాన పక్షి' కూడా ఈ నెల 25కు వాయిదా పడింది. దాంతో ఈవారం ఒక డబ్బింగ్‌తో కలిపి ఎనిమిది సినిమాలు, రెండు రీ-రిలీజ్ మూవీస్ రానున్నాయి. రీ-రిలీజ్ అవుతున్న వాటిలో రవితేజ 'మిరపకాయ్', ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన 'ఉపేంద్ర' చిత్రాలు ఉన్నాయి.
స్ట్రయిట్ తెలుగు సినిమాల విషయానికి వస్తే అన్నపూర్ణ, ఆమని, ఝాన్సీ, సునయన, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన 'హ్యాపీజర్నీ' శుక్రవారం వస్తోంది. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏడుగురు మహిళ జీవితాలకు సంబంధించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య కీలక పాత్రలు పోషించిన సినిమా 'మిస్సింగ్ మేఘన'. వాచస్పతి దర్శకత్వం వహించిన ఈ సినిమా 18న విడుదల అవుతోంది. ఇక వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన సినిమా 'కాగితం పడవలు'. ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహించిన ఈ మూవీని కీర్తన నరేశ్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ ద్వారా ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జనం ముందుకు రాబోతోంది.
'చైనాపీస్' పేరుతో రూపుదిద్దుకున్న నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ మూవీ ఇప్పుడు 'సీక్రెట్ సోల్జర్' పేరుతో 18న జనం ముందుకు వస్తోంది. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ సంస్థ నిర్మించింది. ఇదో యూనిక్ స్పై డ్రామా అని మేకర్స్ చెబుతున్నారు. ట్వింకిల్ కపూర్, బెనర్జీ, జీవా, రైజింగ్ రాజు కీలక పాత్రలు పోషించిన 'ద్రోహి' సినిమా సైతం 18న విడుదల అవుతోంది. ఈ హారర్ మూవీని కోయ రమేశ్ బాబు, దేవభక్తుని నవీన... నాగుల్ దర్శకత్వంలో నిర్మించారు. ఘంటాడి కృష్ణ దీనికి సంగీతం అందించారు. ఇక చంద్రసిద్ధార్థ్ దర్శకత్వం వహించిన 'ఈ పాట కోరినవారు' సినిమా, మహేశ్ చంద్ర తెరకెక్కించిన 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం కూడా శుక్రవారం విడుదల అవుతున్నాయి. ఇప్పటికే తమిళంలో విడుదలైన జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మెర్టల్' ఈ శనివారం వస్తోంది. ఇదిలా ఉంటే... కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించిన 'దాయ్‌రా' శుక్రవారం తెలుగులో కూడా విడుదల కావాల్సింది. కానీ దీనిని హిందీకే పరిమితం చేశారు. అలానే 'రెసిడెంట్ ఈవిల్' మూవీని కూడా తొలుత తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ అది కూడా కేవలం ఇంగ్లీష్ లోనే శుక్రవారం విడుదల కాబోతోంది. ఏదేమైనా... ఈ వారం విడుదలయ్యే ఈ సినిమాలకు ఎలాంటి స్పందన లభించినా... అవన్నీ కేవలం ఆరు రోజులకే పరిమితం అవుతాయి. వాటి తర్వాత 'ప్యారడైజ్, అవెంజర్స్' సందడి ధియేటర్లలో మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి:
కత్రీనా పని అయిపోయింది.. పూర్తిగా ఆంటీలా మారిపోయింది
అబ్బా.. భాగ్యశ్రీ అందం.. రామ్ అన్నా ఎక్కడో మచ్చేసుకోని పుట్టాడురా
కావ్య - కాలభైరవ పెళ్లి డేట్ ఫిక్స్..