కావ్య - కాలభైరవ పెళ్లి డేట్ ఫిక్స్..
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:20 PM
టాలీవుడ్‌లో మరో క్యూట్ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్‌రామ్, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పెద్ద కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే వివాహ బంధంతో ఒకటవుతున్నారు.
టాలీవుడ్‌లో మరో క్యూట్ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్‌రామ్ (Kavya Kalyanram), ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పెద్ద కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ (Kala Bhirava) త్వరలోనే వివాహ బంధంతో ఒకటవుతున్నారు. కొంతకాలంగా సాగుతున్న తమ ప్రేమ బంధాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ జంట అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో శుభాకాంక్షల వెల్లువ కురిసింది.
ఇన్స్టాగ్రామ్ వేదికగా కాలభైరవ ఎంతో కవితాత్మకంగా స్పందిస్తూ.. కావ్యతో తనకున్న అనుబంధాన్ని సొంత ఇంటికి చేరుకున్న అనుభూతిగా వర్ణించాడు. కావ్య కూడా కాలభైరవ తన సాధారణ రోజులను సైతం ఎంతో ప్రత్యేకంగా మార్చేశాడంటూ ప్రేమపూర్వకంగా చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరి ప్రేమ వార్తలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. మొదట్లో ఇరు కుటుంబాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈ జంట నిర్ణయాన్ని గౌరవించి పెద్దలు కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్రమంలోనే ఈ జంట వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. రాబోయే డిసెంబర్ నెలలోనే వీరి కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారా అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వేడుక కోసం కీరవాణి కుటుంబం ఇప్పటికే వివాహ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు టాక్. కీరవాణి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతున్న కావ్యకు, కాలభైరవకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.