సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గాంధీ జయంతికి సందీప్ కిషన్‌ 'సిగ్మా'!

ABN, Publish Date - Aug 18 , 2026 | 11:50 AM

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న 'సిగ్మా' చిత్రం కొత్త రిలీజ్‌ డేట్ వచ్చింది. ఇందులో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు.

Sigma Movie

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సిగ్మా'. తెలుగువారైన సందీప్ కిషన్‌, ఫరియా అబ్దుల్లా ఇందులో జంటగా నటించారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. జూలై 31న 'సిగ్మా' సినిమా విడుదల కావాల్సింది. అయితే సరిగ్గా దానికి వారం ముందు విజయ్‌ 'జన నాయగన్' విడుదల కావడంతో 'సిగ్మా' సినిమాను వాయిదా వేశారు. అప్పుడు కొత్త రిలీజ్ డేట్ చెప్పని మేకర్స్ తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.


'సిగ్మా' మూవీ గురించి లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ, 'జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది అతని తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో అతను చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన దర్శకుడిని తలపించాయి. సందీప్ కిషన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురాబోతున్నాం' అని అన్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ, 'నా విజన్‌ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చిన మా నిర్మాత సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ్ కుమరన్ సర్, లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం వల్లనే నేను అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాను' అని తెలిపారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ తదితరులు పోషించారు. 'సిగ్మా' చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్, హరిహరసుధన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు.


విశేషం ఏమంటే... అక్టోబర్ 2వ తేదీనే వెంకటేశ్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం 'ఆదర్శ కుటుంబం' విడుదల కాబోతోంది. అదే రోజున కన్నడ అనువాద చిత్రం 'పినాక' సైతం తెలుగువారి ముందుకు వస్తోంది. మరి వీటి నుంచి ఎదురయ్యే పోటీని 'సిగ్మా' ఏమేరకు తట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కన్నీళ్లను జయించిన రాజకుమారి.. ‘అగ్నిపరీక్ష’ నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌ వరకు!

వంటగదికే వెళ్లని సమంత మాస్టర్‌చెఫ్‌కి జడ్జ్ ఏంటి!?

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్..

Updated Date - Aug 18 , 2026 | 11:59 AM