రజనీకాంత్ - కమల్ హాసన్ భారీ మల్టీస్టారర్ ఆగిపోయిందా?
ABN, Publish Date - Oct 09 , 2026 | 04:36 PM
భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా.. నాలుగు దశాబ్దాల తర్వాత కోలీవుడ్ దిగ్గజాలు ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కలయికలో ఓ భారీ చిత్రం పట్టాలెక్కబోతోందని వార్తలు వచ్చినప్పుడు యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై, ఆనందపడింది.
భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా.. నాలుగు దశాబ్దాల తర్వాత కోలీవుడ్ దిగ్గజాలు ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కలయికలో ఓ భారీ చిత్రం పట్టాలెక్కబోతోందని వార్తలు వచ్చినప్పుడు యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనై, ఆనందపడింది. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘KH×RK’ పేరుతో విడుదలైన అధికారిక గ్లింప్స్ టీజర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అయితే, కోట్లాది మంది సినీ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అర్థాంతరంగా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కథనాలు రావడం సినీ వర్గాల్లో నిరాశకు కారణమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’తో పాటు రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌లో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో చేయనున్న ‘ధర్మన్’ పూర్తి కాగానే.. నెల్సన్ డైరెక్షన్‌లో కమల్-రజనీల సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు. మొదట్లో రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని కోలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించేందుకు సన్నాహాలు చేసింది.
అయితే తమిళనాడులో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, మారిన సమీకరణాల నేపథ్యంలో నిర్మాణ సంస్థ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్‌కు చెందిన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్’ టేకోవర్ చేసుకుంటుందని వార్తలు వచ్చినప్పటికీ.. బడ్జెట్ పరిమితులు, కాల్షీట్ల సర్దుబాట్లు, ఇతర అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది.
ఒకే ఫ్రేమ్‌లో భారతీయ సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్‌లను చూడాలని కలలుగన్న అభిమానులకు ఈ వార్త తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇలాంటి విజువల్ వండర్ మిస్ అవ్వడం సినీ రంగానికి పెద్ద లోటని, ఏదైనా ఇతర అగ్ర నిర్మాణ సంస్థ ముందుకు వచ్చి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ చిత్రం ఆగిపోయినట్లు అటు దర్శకుడు నెల్సన్ నుంచి గానీ, ఇటు రజనీ, కమల్ బృందం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా కేవలం ప్రచారం మాత్రమేనా లేక నిజంగానే ఈ కల్ట్ మల్టీస్టారర్‌కు బ్రేక్ పడిందా అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి:
మోక్షజ్ఞ ఎంట్రీకి వశిష్ట మైండ్ బ్లోయింగ్ ప్లాన్
‘జై హనుమాన్’లో మమితా బైజు.. ప్రశాంత్ వర్మా, అసలేం తీస్తున్నావ్..
మణిరత్నం సినిమా కోసం విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం